మన దేశంలో పర్యాటక రంగం ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడటమే కాకుండా ఎంతోమందికి ఉపాధి అవకాశాలను కల్పించింది. ముడి చమురు, వాహన తయారీ పరిశ్రమల తరవాత మన పర్యాటక రంగం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద పరిశ్రమగా అవతరించడమే ఇందుకు నిదర్శనం. ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ గణాంకాల ప్రకారం సుమారు 70 కోట్లకుపైగా పర్యాటకులు ఏటా పలుదేశాల్లో విహరిస్తూ 22లక్షల కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ, ప్రపంచ ఎగుమతుల్లో 8 శాతం, అంతర్జాతీయ వ్యాపారంలో 30 శాతానికి దోహదపడుతున్నారు. ప్రపంచ ప్రయాణ పర్యాటక మండలి ప్రకారం ప్రయాణ పర్యాటక రంగం వృద్ధి రేటు 3.5%. అది 2.5%గా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటును మించిపోయింది. మనదేశంలోనూ విదేశ మారక ద్రవ్యాన్ని సంపాదించడంలో పర్యాటక రంగం రెండోస్థానంలో నిలిచింది. ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ ప్రచార కార్యక్రమం భారత పర్యాటక రంగ విస్తరణకు ఎంతగానో దోహదపడింది. మన దేశంలో ఆంధ్రప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ అధిక సంఖ్యలో విదేశీ పర్యాటకులు సందర్శిస్తున్న రాష్ట్రాలుగా గుర్తింపు పొందాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, యాదాద్రి, భద్రాచలం, వేములవాడ, ధర్మపురి తదితర ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలతోపాటు, ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన లంబసింగి, బౌద్ధ ఆరామాలు, అరకు లోయ అందాలు, బొర్రా గుహలు, జలపాతాలు, హైదరాబాద్ మహానగరం వంటివి పర్యాటకుల్ని విశేషంగా ఆకర్షించే జాబితాలో ఉన్నాయి.
కరోనా సంక్షోభంతో కుదేలు
కరోనా ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌తో ప్రయాణ నిషేధాలు, సరిహద్దుల మూసివేత, క్వారంటైన్లు, భౌతిక దూరం నియమాలు వంటి చర్యలతో పర్యాటక రంగం తీవ్రంగా ప్రభావితమయింది. విదేశీ ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి. మహిళలు, యువకుల పర్యాటక సంబంధిత ఉపాధి గందరగోళంలో పడింది. ఈ రంగానికి సంబంధించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలైన ఎంఎస్‌ఎంఈలు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నాయి. వాటిపై ఆధారపడిన చిన్నస్థాయి ఉద్యోగులు, గ్రామీణులు, ఆదివాసులు, వెనకబడిన ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు భారీ వర్షాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు పర్యాటక రంగం కుదేలయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనాను మించిన విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రపంచ పర్యాటక సంస్థ తన సభ్య దేశాలకు స్పష్టం చేసింది. సామాజిక ఆర్థిక అంశాలపై కొవిడ్ ప్రభావాన్ని తగ్గించడం, పర్యాటక విలువ గొలుసును బలోపేతం చేయడం, ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించడం, హరిత అభివృద్ధికి తోడ్పడటం, భాగస్వామ్యాన్ని, పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలని సూచించింది. ఈ చర్యలకు స్పందనగా యూరోపియన్ బ్యాంకు ప్రపంచ పర్యాటక సంస్థకు రుణ సదుపాయం ద్వారా కరోనా తదనంతర కాలంలో పర్యాటక పునరుజ్జీవనానికి ముందుకు రావడం హర్షించదగిన పరిణామం. ఈ మేరకు భోపాల్‌లో 200 ఎకరాల్లో విస్తరించిన ప్రఖ్యాత ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయం ఆన్‌లైన్లో తమ మ్యూజియం వర్చువల్ ప్రదర్శనను జూన్ నుంచి ప్రారంభించింది. దృశ్యమాధ్యమం ద్వారా పర్యాటకులకు ఇంటివద్ద నుంచే అంతర్గత, బహిరంగ గ్యాలరీల విహంగ వీక్షణ అనుభూతిని అందిస్తోంది.