ప్రపంచమంతా కరోనా వైరస్‌పై పోరాడుతోంది. ఇలాంటి అనిశ్చిత పరిస్థితి నుంచి బయటపడేందుకు మనం తీవ్రంగా యత్నిస్తున్నాం. దక్షిణాసియాలోని ఒక ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి భారత్, పాకిస్థాన్‌ల మధ్య కాల్పుల మోత మోగుతూనే ఉంది. మార్చి నెలలో కాల్పుల విరమణ ఉల్లంఘనకు సంబంధించిన ఘటనలు 411 దాకా చోటుచేసుకున్నట్లు అంచనా. ఇవి గత ఏడాది ఇదే సమయంలో జరిగిన ఘటనలకన్నా ఎక్కువ. 2018లో జరిగిన ఉదంతాలకు రెట్టింపు.
ఉల్లంఘనలు సర్వసాధారణం
ఏప్రిల్ అయిదోతేదీన అయిదుగురు ఉగ్రవాదులు కేరన్ సెక్టార్‌లో చొరబడేందుకు యత్నిస్తూ భారత జవాన్ల కాల్పుల్లో హతమయ్యారు. ఈ ఆపరేషన్‌లో అయిదుగురు సైనికులు సైతం వీరమరణం పొందారు. అయిదు రోజుల తరవాత పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల లాంచ్‌ప్యాడ్‌లపై శతఘ్ని దాడులు చేపట్టినట్లు భారత సైన్యం ఒక వీడియోను విడుదల చేసింది. రెండు రోజుల దరమిలా పాక్ సైన్యం అదే సెక్టార్‌లో జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత పౌరులు మరణించగా, ఏడుగురు క్షతగాత్రులయ్యారు. చనిపోయిన వారిలో ఎనిమిదేళ్ల చిన్నారి ఉండటం గమనార్హం. ఇలాంటి సమయాల్లో కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. భారత్, పాకిస్థాన్ రెండూ పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో, సరిహద్దుల్లో కొంతకాలంపాటైనా శాంతిని పాటించలేమా? ఇరుదేశాలు పరస్పర పోరాటం సాగించేకన్నా, మన శక్తిసామర్థ్యాల్ని ఉమ్మడి శత్రువుపైకి మరల్చలేమా? దురదృష్టవశాత్తు వాస్తవం ఏమిటంటే నైతిక కోణాలెప్పుడూ జాతీయ నిర్ణయాల్ని శాసించలేవు.
చొరబాట్లను నియంత్రించాలి..
నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల ఘటనలకు సంబంధించిన విషయాన్ని ఇరుపక్షాల సైనికుల తరఫు అధికార ప్రతినిధులూ చాలా మామూలుగా చెప్పేస్తుంటారు. ఇరు సైన్యాలు సాధారణంగా 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని 2012 దాకా పరస్పరం గౌరవించాయి. 2013 ప్రారంభంలో నియంత్రణ రేఖ వెంబడి భారత గస్తీ బృందంపై దాడి జరిగింది. మందుపాతరలు, మెరుగు పరిచిన పేలుడు పదార్థాలు అమర్చడం వంటి ఘటనలు పెరిగాయి. ఆగస్టులో పూంచ్ సెక్టార్‌లో అయిదుగురు సైనికులు పాక్ దళాల చేతిలో హతమయ్యారు. మొత్తంగా భద్రత పరిస్థితి క్షీణించడంతో ఉద్రిక్తతలు ఎక్కువ య్యాయి. సరిహద్దుల వెంబడి కాల్పుల తీవ్రత పెరిగింది. చాలా ఏళ్ల తరవాత మొదటిసారి ‘డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్’ ఇద్దరూ ముఖాముఖి సమావేశానికి అంగీకరించారు. పరిస్థితుల్ని చల్లార్చేందుకు ఒక ఒప్పందం కూడా కుదిరింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం కనిపించలేదు. 2014లో కాల్పుల విరమణ ఉల్లంఘనలు మరింతగా పెరిగాయి. ఏదైనా నిజమైన పురోగతి సాధించాలంటే, పాకిస్థాన్ తన వైపు నుంచి చొరబాట్లను నియంత్రించాలి. చొరబాట్లు కొనసాగితే, భారతీయ సైనికులు నియంత్రణ రేఖ వెంబడి అమరులవుతూనే ఉంటారు. శాంతిస్థాపన సాధ్యం కాదు. ఇందుకోసం పాకిస్థాన్‌లో కీలకంగా వ్యవహరించే సైన్యానికి కశ్మీర్‌పై ఆలోచనా ధోరణి మారాలి.