తెలంగాణ

telangana

ETV Bharat / opinion

గిరిజనాన్ని వేధిస్తున్న కొడవలి కణాలు - సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి

గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కొడవలి కణ రక్తహీనత (సికిల్ సెల్​ ఎనీమియా) కనిపిస్తుంది. ఇది జన్యుసంబంధమైన వ్యాధి. దేశంలో ఆశా వర్కర్లు, పంచాయతీ సభ్యులు, గ్రామ ఆరోగ్య కమిటీలను బలోపేతం చేసి, వ్యాధిపట్ల వారిలో అవగాహన కల్పించాలి. అప్పుడే గిరిజనులకు కబళిస్తున్న కొడవలి కణ జబ్బు నియంత్రణలోకి వచ్చేది!

sickle cell
సికిల్ సెల్​ ఎనీమియా

By

Published : Aug 4, 2020, 8:02 AM IST

కరోనా అత్యంత వేగంగా ప్రబలుతున్న సమయంలోనే జీవనశైలి, జన్యుపరమైన అనుబంధ వ్యాధులపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నాయి. వీటిలో ‘సికిల్‌ సెల్‌ ఎనీమియా’ (కొడవలి కణ రక్తహీనత) ఒకటి. ఇది వంశపారంపర్య వ్యాధి. మలేరియా ప్రబలంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మలేరియాను ఎదుర్కొనేందుకు రక్తంలోని గుండ్రని తెల్ల రక్తకణాలు కొడవలి ఆకారంలో ఏర్పడతాయి.

ఈ సికిల్‌ రక్తకణాలు త్వరగా నశించి, కొత్త ఎర్ర రక్తకణాలు వేగంగా ఉత్పత్తి కాకపోవడం ఈ వ్యాధి లక్షణం. ఫలితంగా ఈ రోగులు రక్తహీనతకు గురవుతారు. సికిల్‌ రక్తకణాలు వంపు తిరిగి ఉండటంవల్ల సన్నటి రక్తనాళాల్లో సరిగ్గా ప్రవహించలేక శరీర భాగాలకు ఆక్సిజన్‌ అందడం తగ్గిపోతుంది. తగిన చికిత్స అందకపోతే ఈ వ్యాధి పీడితులు పది, పదిహేనేళ్లలోపు చనిపోతారు. జన్యుపరమైన మార్పులవల్ల వచ్చే ఈ రక్తహీనత జబ్బుకు సరైన మందులు లేవు.

రెండో పెద్ద దేశంగా..

ఐక్యరాజ్యసమితి ఈ వ్యాధిని 2008లో ప్రజారోగ్య సమస్యగా గుర్తించింది. మొత్తం ప్రపంచ జనాభాలో అయిదు శాతం ఈ జన్యువును కలిగి ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. వ్యాధి అధికంగా గల సబ్‌సహారన్‌ ఆఫ్రికా, స్పానిష్‌ మాట్లాడే ప్రాంతాలైన దక్షిణ అమెరికా, కరీబియన్‌, మధ్య అమెరికా, సౌదీ అరేబియా, ఇండియా, టర్కీ, గ్రీస్‌, ఇటలీ దేశాల్లో విస్తరించి ఉంది. కొడవలి కణాలు గల నవజాత శిశువుల్లో రెండో పెద్ద దేశంగా భారత్‌ ఉండనుందన్న భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్‌ఆర్‌) గణాంకాలు ఆందోళన కలిగించేవే.

మధ్యప్రదేశ్‌ 9,61,492 హెటిరో, 67,861 హోమోజైగోట్స్‌తో దేశంలో తొలిస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర, కేరళ, గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు తరవాతి స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, తూర్పు గోదావరి, విశాఖ; తెలంగాణలోని ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోని గిరిజన ప్రాంతాలలో ప్రధానులు (34.65శాతం), వాల్మీకిలు (20.20), రాజ్‌ గోండులు (14.28) ఎక్కువగా ఈ వ్యాధి బారినపడ్డారు. ఐసీఎమ్‌ఆర్‌ సర్వే ప్రకారం రెండేళ్లలోపు పిల్లల మరణాల రేటు 20శాతం ఉంది. యుక్తవయసు వచ్చేలోపు మరణిస్తున్నవారు 30శాతం దాకా ఉన్నారు.

మూఢనమ్మకాలూ..

జేమ్స్‌ హర్రిక్‌ అనే శాస్త్రవేత్త 1910లో తొలిసారి సెడాలోని ఓ వైద్య విద్యార్థి రక్తకణాల్లో ఈ జన్యువును కనిపెట్టారు. మనదేశంలో లీమన్‌, కట్బుష్‌ అనే శాస్త్రజ్ఞులు నీలగిరి పర్వత ప్రాంతాల్లో 1952లో తొలిసారి గుర్తించారు.

తలరాత, చేతబడులు, సామాజిక కట్టుబాట్ల ఉల్లంఘన, దైవాగ్రహం కారణంగా ఈ వ్యాధి వస్తుందని విశ్వసించే గిరిజనులూ లేకపోలేదు. రోగం బారిన పడకుండా వింత ఆచారాలు, పూజలు, జంతుబలులు, నాటు మందులపై ఆధారపడతారు. గిరిజనుల అమాయకత్వాన్ని కొందరు మోసగాళ్లు డబ్బు చేసుకుంటున్నారు. వాస్తవానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. శరీరానికి నీరు అందించాలి. క్రమం తప్పకుండా ఫోలిక్‌ యాసిడ్‌ మందులు వాడాలి. చిన్నపిల్లలకు ‘ప్రినేటల్‌’ పరీక్షల ద్వారా జన్యువును గుర్తించి వ్యాక్సిన్లను అందించడం ద్వారా వారిలో రోగ నిరోధక శక్తిని పెంపొందించి కాపాడవచ్ఛు

చికిత్స అవసరం..

సికిల్‌ సెల్‌ వ్యాధిగ్రస్తులకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అవసరమవుతుంది. అందువల్లే గిరిజన ప్రాంతాల్లో కరోనా మహమ్మారి విస్తరిస్తే ప్రమాద తీవ్రత రెండింతలుగా ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందువల్ల సికిల్‌ పీడితులను ముందే గుర్తించి మందులు సమకూర్చాలి. సీసీఎమ్‌బీ, సీఎన్‌ఏఆర్‌, ఐసీఎమ్‌ఆర్‌, రెడ్‌క్రాస్‌ ఇండియా సొసైటీ వంటి సంస్థలు ఈ వ్యాధి గురించి పరిశోధనలు సాగిస్తున్నాయి.

వ్యాధిపీడితులకు కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడు నుంచి ఆరు శాతం, విద్యాసంస్థల్లో మూడు నుంచి అయిదు శాతం రిజర్వేషన్‌ కల్పించింది. తెలంగాణ, కేరళ ప్రభుత్వాలు జీవనోపాధి కోసం లక్ష రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చి ఆదుకుంటున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం రాయపుర్‌లో 2008లో సికిల్‌ సెల్‌ ఇన్‌స్టిట్యూట్‌ను స్థాపించింది. గిరిజన ప్రాంతాల్లో పరీక్షలు జరిపి వ్యాధిగ్రస్తులకు ఉచిత రక్తమార్పిడి ఫోలిక్‌ యాసిడ్‌ మందులు, ఉచిత ప్రయాణం, విద్యాలయ ప్రవేశాలు కల్పిస్తోంది. వైద్యం ఖర్చులకు ఆర్థిక సాయమూ అందిస్తోంది.

ప్రాథమిక వైద్యకేంద్రాల్లో సత్వర స్క్రీనింగ్‌ నిర్వహించి మందులు అందజేయడం వ్యాధి అదుపులో భాగం కావాలి. ఈ జన్యువులున్న వారిమధ్య వివాహాలను నిషేధించాలి. ఆశా వర్కర్లు, పంచాయతీ సభ్యులు, గ్రామ ఆరోగ్య కమిటీలను బలోపేతం చేసి, వ్యాధిపట్ల వారిలో అవగాహన కల్పించాలి. అప్పుడే గిరిజనులకు కబళిస్తున్న కొడవలి కణ జబ్బు నియంత్రణలోకి వచ్చేది!

(రచయిత- డాక్టర్‌ దన్నారపు వెంకట ప్రసాద్‌)

ABOUT THE AUTHOR

...view details