ప్రస్తుత కరోనా సంక్షోభంలో భౌతిక దూరం అత్యంత ప్రాధాన్య అంశంగా స్థిరపడింది. బయట తిరిగేవారు.. ముఖ్యంగా నిత్యావసరాల కోసం దుకాణాలకు వెళ్లి- భౌతిక దూరాన్ని విస్మరిస్తున్న చాలామంది వైరస్ బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులెవరూ ఉండని దుకాణాలు ఏర్పాటైతే- కొనుగోలుదారులు నేరుగా వెళ్లి తమకు అవసరమైన సరకులు తీసుకొని డబ్బులు ఉంచి వస్తే ఎలా ఉంటుంది? ఇదంతా సాధ్యమయ్యే పని కాదనిపిస్తున్నా.. ప్రపంచంలో చాలాచోట్ల చాలామంది దీనిని సుసాధ్యం చేసి చూపుతున్నారు.
కోల్‌కతాలోని ఓ బస్టాప్ సమీపంలోని వార్తాపత్రికలు అమ్మే స్టాండ్‌లో మనుషులెవరూ ఉండరు. వినియోగదారులు వచ్చి అవసరమైన వార్తాపత్రికలు తీసుకొని, అక్కడే ఓ మూలగా ఉన్న ఓ పళ్లెంలో డబ్బుల్ని ఉంచి వెళ్తారు. ఇదేమిటని అడిగితే- మరో వ్యాపకంలో ఉన్న తనకు దుకాణం చూసుకునే తీరిక ఉండదని- తాను లేకున్నా వార్తాపత్రికల డబ్బులు అక్కడ ఉంచి వెళ్తారని, ఇబ్బందేమీ ఉండదని యజమాని చెబుతారు. ప్రపంచంలో చాలామంది నిజాయతీగానే ఉంటారనేందుకు నిదర్శనమిది. మిజోరం ఐజ్వాల్ నుంచి 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'సెలింగ్ హైవే'పై స్థానికులు కొత్త తరహా వాణిజ్యానికి రూపమిచ్చారు. ఇది మనుషుల నిజాయతీపై ఆధారపడి పనిచేస్తుంది. రోడ్డు వెంబడి వెదురు బొంగులతో రూపొందించిన మనషులెవరూ ఉండని గుడిసెల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిలో కూరగాయలు, పండ్లు, పూలు, పండ్లరసాలు, ఎండు చేపలు, నత్తలు అమ్మకానికి పెడతారు. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులపై సరకులు, వాటి ధరలను రాసి ఉంచుతారు. వినియోగదారులు తమకు అవసరమైన సరకుల్ని తీసుకొని, డబ్బుల్ని అక్కడే ఉన్న డబ్బాలో వేస్తారు. అవసరమైతే ఆ డబ్బాలో నుంచి చిల్లర కూడా తీసుకుంటారు. ఇక్కడ నమ్మకమనే సూత్రమే పని చేస్తుంది. మిజోరంలో నిర్వహిస్తున్న ఈ తరహా వ్యాపారం- 'మైహోమ్ ఇండియా' అనే ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన ట్వీట్‌తో వెలుగులోకి వచ్చింది. మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగ దీనిపై స్పందిస్తూ.. చాలామంది అమ్మకందారులు, కొనుగోలుదారులు సురక్షిత భౌతిక దూరం పాటించేందుకు ఈ పద్ధతి చాలా సౌకర్యంగా ఉందని పేర్కొన్నారు.
నాగాలాండ్‌లో లెషెమి గ్రామానికి చెందిన రెతులూ ఇలాంటి పద్ధతిని ఆచరిస్తున్నారు. బెంగళూరులోని 'ట్రస్ట్ షాప్' గొలుసు దుకాణాలు వినియోగదారులకు నిరంతరం అందుబాటులో ఉంటాయి. తమిళనాడులోని పాపనాశంలో గత 20 ఏళ్లుగా గాంధీజయంతి రోజు కాపాలదారులెవ్వరూ లేని దుకాణం ఏర్పాటవుతోంది. స్థానిక రోటరీ క్లబ్ దీన్ని నిర్వహిస్తోంది. దివ్యాంగుల సంక్షేమ కార్యకలాపాలు సాగించే జనశక్తి ఛారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సంస్థ కేరళలో తీరగ్రామమైన అజికోడ్‌లో ఇలాంటి స్వయంసేవ దుకాణాన్ని ఏర్పాటు చేసింది. సీసీటీవీ కెమెరాలను సైతం అమర్చారు. చండీగఢ్‌లోని ధనాస్ ప్రభుత్వ మోడల్ సీనియర్ సెకండరీ పాఠశాలలో నోటుబుక్కులు, కలాలు, పెన్సిళ్లు, వంటివాటితో ఏర్పాటు చేసిన దుకాణంలో కాపలాదారుగానీ, సీసీటీవీ కెమెరాలుగానీ ఉండవు. 'నిజాయతీగా చెల్లించండి' అనే బోర్డు మాత్రమే ఉంటుంది.