తెలుగుతేజం శిరీష బండ్ల అంతరిక్షయానం తరవాత మహిళా వ్యోమగాములపై అంతర్జాతీయంగా విస్తృత చర్చలు జరుగుతున్నాయి. వివిధ కారణాలను ఏకరువు పెడుతూ రోదసియానంలో స్త్రీలను పెద్దగా ప్రోత్సహించని పరిశోధన సంస్థలు, దేశాలు ఇప్పుడిప్పుడే ఆ సంకెళ్లను సడలిస్తున్నాయి. 1963లో మొదటి మహిళ అంతరిక్షంలోకి అడుగు పెట్టిన దరిమిలా... ఈ అయిదు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా 65 మంది మహిళలు రోదసిలోకి ప్రవేశించారు. మరోవైపు అంతరిక్షంలోకి మానవుడు ప్రవేశించి ఇప్పటికి అరవై ఏళ్లు కావస్తోంది. ఇప్పటివరకూ 566 మంది రోదసియానం చేస్తే అందులో మహిళల వాటా 11.5శాతమే. ఒకప్పటి సోవియట్ యూనియన్, కెనడా, జపాన్, రష్యా, చైనాల నుంచి ఇద్దరు; యూకే, ఫ్రాన్స్, ఇటలీ, దక్షిణ కొరియా, ఇరాన్, స్వీడన్‌ల నుంచి ఒక్కరు చొప్పున అంతరిక్ష యాత్ర చేశారు. అమెరికా నుంచి 49 మంది వెళ్లారు. భారత్ విషయానికొస్తే కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ వ్యోమగాములుగా, తాజాగా శిరీష బండ్ల యాత్రికురాలిగా అంతరిక్ష యానం చేశారు. వీరందరూ భారత సంతతికి చెందిన వారే అయినా- వాస్తవానికి అమెరికా ఖాతాలోకే వస్తారు.
ఆరంభం బాగున్నా...
మొదటి మానవ సహిత అంతరిక్ష యాత్రను సోవియట్ యూనియన్ 1961 ఏప్రిల్‌లో చేపట్టింది. ఆ తరవాత రెండేళ్లకు వాలెంతినా వ్లాదిమిరోనా తెరెస్కోవా 1963 జూన్ 16న రోదసిలోకి ప్రవేశించారు. ఆమె భూమి చుట్టూ 48 ప్రదక్షిణలు చేసి, జూన్ 18న భూమి మీదకు తిరిగొచ్చారు. అప్పటి సోవియట్ అధినేత నికితా కృశ్చేవ్ మహిళా సాధికారతకు, సమానత్వానికి దీన్ని సూచికగా అభివర్ణించారు. ఆ తరవాత రెండో మహిళ ప్రయాణానికి దాదాపుగా ఇరవై ఏళ్లు పట్టింది. 1982 జులైలో స్వెత్లానా సావిస్కయా అంతరిక్షంలో అడుగు పెట్టారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు. ఆపై రెండేళ్లకే ఆమె రెండో అంతరిక్షయానంలో స్పేస్‌వాక్ చేసి- ఆ ఘనత సాధించిన తొలి మహిళ అయ్యారు. అయితే స్వెత్లానా తిరిగొచ్చాక తోటి వ్యోమగాములు స్వాగతం పలికి. 'ఆప్రాన్'ను బహుమతిగా అందించారు. అమెరికా నుంచి వెళ్లిన మరొకరికి ఇదే పరిస్థితి ఎదురైందని చెబుతారు. మొత్తంగా స్త్రీలకు 'తగిన స్థానం' ఏమిటో సూచించే పురుషాధిక్యతా చిహ్నంగా దాన్ని బహూకరించారు! దశాబ్దాల పాటు ఈ చిన్నచూపు ఇలాగే కొనసాగింది. రెండేళ్ల క్రితమైతే అమ్మాయిల స్పేస్‌వాక్‌ను నిలిపేశారు. వాళ్లకు సరిపోయే స్పేస్ సూట్‌లు లేకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నామని నాసా కారణం చెప్పింది! ఒక వ్యోమగామికి ఉండాల్సిన కొలతలు మగవాళ్లకే పరిమితమనీ, సన్నగా, చిన్నగా ఉండే అమ్మాయిలు దీనికి సరిపోరని వాదించింది. అమ్మాయిల ఆరోగ్యం అంతరిక్ష వాతావరణానికి సరిపోవడం లేదని, వాళ్లలో రక్తం గడ్డ కడుతోందని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. నెలసరినీ అడ్డంకిగా చెబుతున్నారు. సాధారణంగా అంతరిక్షంలో నీటిని వృథా చేయరు. చాలా పొదుపుగా ఉపయోగిస్తారు. ఆఖరికి మూత్రాన్నీ వివిధ అంచెల్లో శుభ్రపరిచి తాగునీటిగా మారుస్తారు. నెలసరి సమయంలో అలా శుభ్రపరచడం యంత్రాలకు సాధ్యం కావడం లేదు. నెలసరి రాకుండా తీసుకునే మాత్రలు, అధిక స్థాయి రేడియేషన్ స్త్రీలను మాతృత్వానికి దూరం చేస్తాయన్న అభిప్రాయాలూ లేకపోలేదు.
పరిశోధనల్లో సానుకూల ఫలితాలు..