Sharad Pawar PM Modi Pune award function : విపక్ష కూటమి మూడో విడత సమావేశం జరిగే మహారాష్ట్రలో ఆసక్తికరమైన పరిస్థితులు నెలకొన్నాయి. విపక్ష శిబిరంలో కీలకంగా ఉన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వేదిక పంచుకోనుండటం చర్చనీయాంశంగా మారింది. పుణెలో ఆగస్టు 1న జరగనున్న ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీకి.. ఓ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. మణిపుర్ సమస్య సహా అనేక విషయాల్లో పాలక విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
Sharad Pawar modi news : బీజేపీ పట్ల అత్యంత కఠినంగా ఉండాల్సిన శరద్ పవార్.. ఏకంగా మోదీ అవార్డు ప్రదానోత్సవానికి చీఫ్ గెస్ట్‌గా వెళ్లడంపై కాంగ్రెస్ వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 'బీజేపీపై ఆగ్రహంతో ఉండటానికి శరద్ పవార్‌కు ఎన్నో కారణాలు ఉంటాయి. ఎన్సీపీని ఇటీవల నిట్టనిలువునా చీల్చింది బీజేపీనే. గతేడాది మహా వికాస్ అఘాడీని గద్దె దించింది కూడా బీజేపీనే. ఆ కూటమి ఏర్పాటుకు కీలకంగా వ్యవహరించారు పవార్. విపక్షాల కొత్త కూటమి 'ఇండియా'లోనూ ఆయన ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా ఈ కూటమి పని చేస్తుంది. కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఆందోళన కలిగిస్తోంది' అని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పుకొచ్చారు.
శరద్ పవార్, మోదీ మీటింగ్ ఏంటి?
Tilak Smarak award 2023 : 'ది తిలక్ స్మారక్ మందిర్ ట్రస్ట్' (హింద్ స్వరాజ్ సంఘ్) అనే సంస్థ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్మాన్య తిలక్ నేషనల్ అవార్డు ప్రకటించింది. ఆగస్టు 1న లోక్మాన్య తిలక్ 103వ వర్ధంతి సందర్భంగా ఈ అవార్డును మోదీకి ప్రదానం చేయనున్నట్లు తెలిపింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌ను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినట్లు ట్రస్ట్ అధ్యక్షుడు దీపక్ తిలక్ వెల్లడించారు. మోదీ నాయకత్వ పటిమకు, పౌరుల్లో దేశభక్తిని పెంపొందించినందుకు గుర్తింపుగా ఈ అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్సీపీ రెబెల్ నాయకుడు అజిత్ పవార్‌ను సైతం ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు చెప్పారు.
విపక్ష సమావేశం అక్కడే...
Opposition meeting Mumbai 2023 : మోదీకి ఈ ప్రైవేటు అవార్డు ప్రదానం చేసేందుకు శరద్ పవార్ వెళ్లనుండటం ఇండియా కూటమి వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇదే రాష్ట్రంలో విపక్ష కూటమి మూడో సమావేశం జరగనుంది. శివసేన (ఉద్ధవ్ బాల్ ఠాక్రే) ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శరద్ పవార్ వ్యవహార శైలిపై విపక్ష కూటమి నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
"పవార్ వ్యవహారంపై మేం చాలా ఆందోళనతో ఉన్నాం. ఆయన మనసులో ఏం మెదులుతుందో అర్థం చేసుకోలేకపోతున్నాం. విపక్ష కూటమి సమావేశం మహారాష్ట్రలో ఉన్నా, లేకపోయినా.. ఇది ఆందోళనకరమైన పరిణామమే. అకస్మాత్తుగా ఆయన పోరాటం ఆపేశారు. ఆయన లొంగిపోయారా? ఆయనపై ఒత్తిడి ఏదైనా ఉందా అన్నది మాకు తెలియదు. ఈ అవార్డు కార్యక్రమం పార్టీలో ఆందోళనలు రేకెత్తించింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం హైకమాండే."
-ఏఐసీసీ నాయకుడు
'కూటమి ఐక్యతపై ప్రభావం ఉండదు'
అయితే, అవార్డు ఫంక్షన్‌కు శరద్ పవార్ హాజరు కావడంపై తమకు ఎలాంటి ఆందోళనలు లేవని మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ చెప్పుకొచ్చారు. 'అదో ప్రైవేటు అవార్డు కార్యక్రమం. దాన్ని నిర్వహించేది కూడా ప్రైవేటు సంస్థే. దానిపై నేను స్పందించాలని అనుకోవట్లేదు. ఈ సమావేశం విపక్ష కూటమి ఐక్యతపై ఏమాత్రం ప్రభావం చూపదు. మహావికాస్ అఘాడీ కూటమి పార్టీలు 'ఇండియా' సమావేశానికి హాజరవుతాయి' అని నసీమ్ ఖాన్ ఈటీవీ భారత్‌తో చెప్పారు.
కాంగ్రెస్ సన్నిహిత ట్రస్టీలే!
మరోవైపు, ప్రధానికి అవార్డు ప్రదానం చేసే ట్రస్ట్ నిర్వాహకులు గతంలో కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉండేవారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ శిందే గతంలో ఈ సంస్థకు ట్రస్టీగా ఉన్నారని గుర్తు చేస్తున్నాయి. 'అవార్డు ప్రదానోత్సవం గురించి ట్రస్టీలు ప్రధానికి లేఖ రాశారు. కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. కానీ మోదీ మొదట అందుకు ఒప్పుకోలేదు. ఆ తర్వాత ట్రస్టీలు శరద్ పవార్‌ను రంగంలోకి దించారు. ఆయనే మోదీని అవార్డు స్వీకరించేలా ఒప్పించారు' అని పార్టీ వర్గాలు వివరించాయి.
అవార్డు ఇచ్చేది పవార్ కాదు!
అయితే, ప్రధానికి శరద్ పవార్ మీదుగా అవార్డు ప్రదానం చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ట్రస్టీ సభ్యుల్లో ఒకరు అవార్డును మోదీకి అందించనున్నట్లు సమాచారం. అయితే, శరద్ పవార్, సుశీల్ కుమార్ శిందే మాత్రం కార్యక్రమానికి హాజరవుతారని తెలిసింది. ఓ ప్రైవేటు అవార్డు అందుకునేందుకు మోదీ రావడంపై మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ విమర్శలు గుప్పించారు. 'ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి ప్రైవేటు ట్రస్ట్ నుంచి అవార్డు తీసుకునేందుకు ఒప్పుకోవడం నేను చూడలేదు. అవార్డు స్వీకరించడం వెనక ఉద్దేశం ఏంటో? పబ్లిసిటీ కోసం అంతగా ఆరాటపడుతున్నారా? లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో సీట్లు కోల్పోతామని భయపడుతున్నారా?' అని ఈటీవీ భారత్‌తో మాట్లాడుతూ ప్రశ్నలు గుప్పించారు.
పుణె టికెట్ కోసమేనా?
అయితే, మోదీకి అవార్డు ప్రదానం చేయడానికి గల కారణాలపై ఓ విషయం ఆసక్తికరంగా మారింది. పుణె లోక్‌సభ నుంచి పోటీ చేసేందుకు ట్రస్ట్ వర్గాలు.. బీజేపీ టికెట్ ఆశిస్తున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. పుణె ఎంపీ గిరీశ్ బాపట్ మృతి చెందడం వల్ల ఈ పార్లమెంట్ స్థానం మే 29 నుంచి ఖాళీగా ఉంది. ఈ స్థానానికి ఉప ఎన్నిక విషయంపై ఎన్నికల సంఘం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.