కొవిడ్ మహమ్మారి కారణంగా బడులు మూసివేయడం వల్ల లైంగిక విద్యపై తీవ్ర ప్రభావం పడింది. ఉపాధ్యాయుడు- విద్యార్థి పరస్పర బోధన, తరగతి గదిలో బృంద చర్చ వంటివన్నీ నిలిచిపోయాయి. విద్యార్థులు ఇళ్లకు పరిమితం కావడంలో ఒత్తిడికి లోను కావడం, ఆన్‌లైన్ పాఠాల కోసం ఎలెక్ట్రానిక్ ఉపకరణాలకు కళ్లప్పగించి అతుక్కునిపోవడం కొనసాగుతోంది. తోటి విద్యార్థులు, స్నేహితులతో కలిసి ఆడుకోవడం, మాట్లాడటం వంటివేమీ లేకుండా పోయాయి. ఆన్‌లైన్‌లో ఎక్కువ కాలం గడిపే విద్యార్థుల్లో సైబర్ గిల్లికజ్జాలు, అంతర్జాల వేధింపుల ముప్పు పెరిగింది. అంతర్జాలంతో చాలా ఎక్కువగా అనుసంధానం కలిగి ఉండే ప్రస్తుత సమయంలో మహమ్మారి కారణంగా ఇంటి వద్దే సాగే చదువుల వల్ల దృక్పథాల్లో, పద్ధతుల్లో మార్పులు రావాల్సిన, సంప్రదాయ పద్ధతుల్లో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉంది. అప్పుడే లైంగిక విద్య నిజంగా సమ్మిళితంగా, ప్రగతిశీలంగా, లింగసమానతతో పరిఢవిల్లుతుంది.
అవగాహన లేమితో వేధింపుల ముప్పు
సరైన లైంగిక విద్య లేకపోవడం వల్లే దేశంలోని చాలా ప్రాంతాల్లో లైంగిక వేధింపులకు ఆస్కారం పెరుగుతోంది. సమ్మతి, ఉల్లంఘన, అత్యాచారం వంటి అంశాల మధ్య తేడాను చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యునిసెఫ్, ప్రయాస్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం- అయిదు నుంచి పన్నెండేళ్ల వయసున్న చిన్నారుల్లో 53 శాతం లైంగిక వేధింపులకు గురైనట్లు తేలడం దిగ్భ్రాంతికి గురిచేసే అంశం. చాలా కేసుల్లో నిందితులు బాధితుల సన్నిహిత బంధువులే కావడం గమనార్హం. ఇందులో సగానికిపైగా కేసులు బయటికి రాకుండా మగ్గిపోతున్నాయి. భారత్‌లో లైంగిక విద్య అంటే యుక్తవయసు గర్భధారణలు, హెచ్‌ఐవీ, ఎయిడ్స్ వంటి అంశాలకు పర్యాయపదంగా మారిపోయింది. రుతుక్రమం అంశాన్నీ నిర్దిష్టంగా అవగాహన చేసుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని మరింత విస్తృతంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇందులో మరో సమస్య ఏమిటంటే- దేశంలో ఇప్పటికీ ఎన్నో పాఠశాలలు, విద్యాసంస్థల్లోని పాఠ్యప్రణాళికల్లో ఎలాంటి లైంగిక విద్యాంశాలనూ చేర్చలేదు. 'లైంగిక, పునరుత్పత్తి హక్కుల కోసం యువ సమాఖ్య' అనే సంస్థ నివేదిక ప్రకారం చాలా వరకు రాష్ట్ర బోర్డులకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని పాఠ్య ప్రణాళికల్లో లైంగిక విద్య అంశాలు లేవని తేలింది.