చీకటి వెనకే వెలుగు ఉంటుందంటారు. ప్రపంచమంతటా లక్షల ప్రాణాలను బలిగొన్న కొవిడ్ మహమ్మారి జైళ్ల సంస్కరణల ఆవశ్యకతను ముందుకు తీసుకురావడం దీనికి ఉదాహరణ. 118 దేశాల్లోని కారాగారాలు కిక్కిరిసిపోయి అపరిశుభ్రత, అరకొర వైద్య వసతులతో సతమతమవుతున్నాయని ఆన్‌లైన్ డేటాబేస్ 'వరల్డ్ ప్రిజన్ బ్రీఫ్' తెలిపింది. దీని ప్రకారం భారతీయ జైళ్లలో ఖైదీల ఆక్యుపెన్సీ 118.5 శాతం.
భారత జైళ్లలో 3,96,223 మంది ఖైదీలకే చోటు ఉండగా- 4,72,848 మందిని కుక్కినట్లు 2018లోనే భారతీయ కారాగార గణాంకాల (పీఎస్‌ఐ) నివేదిక తెలిపింది. కారాగారాల్లో కొవిడ్ స్వైర విహారాన్ని నిరోధించడానికి చాలా దేశాలు ఖైదీలను పెరోల్స్ బెయిలు వంటి పద్ధతుల్లో విడుదల చేస్తున్నాయి. ఇరాన్ 70,000 మందిని విడుదల చేయగా, ఇండొనేసియా 39,000 మందిని, టర్కీ 45,000 మందిని, మలేసియా 11,108 మందిని విడుదల చేశాయి. కామన్వెల్త్ మానవ హక్కుల సంరక్షణ సంస్థ (సీహెచ్‌ఆర్‌ఐ) గణాంకాల ప్రకారం- నిరుడు అక్టోబరు నాటికి భారత్‌లో 68,000 మందికి పైగా ఖైదీలను విడుదల చేశారు. కొన్ని దేశాల్లో వారిని పునరావాస కేంద్రాలకు పంపుతున్నారు.
సర్వోన్నత న్యాయస్థానం జోక్యం
జైళ్లలో రద్దీ తగ్గించాలని సుప్రీంకోర్టు గత ఏడాది మార్చి 23న రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. తాత్కాలిక బెయిలు లేదా పెరోల్‌పై విడిచిపెట్టడం, కొన్నాళ్లపాటు కారాగారాల నుంచి సెలవు ఇవ్వడం వంటి అంశాలను తేల్చేందుకు ఓ ఉన్నతాధికార సంఘాన్ని ఏర్పాటు చేయాలని స్పష్టంచేసింది. దిల్లీ హైకోర్టు సైతం ఇలాంటి ఆదేశాలనే ఇచ్చింది. నిరుడు సెప్టెంబరు నాటికి ఒడిశాలోని 86 జైళ్ల నుంచి 16,789 మందిని విడుదల చేయగా, బిహార్‌లో 18 జైళ్లను పూర్తిగా ఖైదీలకు క్వారంటైన్ కేంద్రాలుగా కేటాయించారు. మన నగరాలు, పట్టణాల్లోని జైళ్లలో ఖైదీల రద్దీ చాలా ఎక్కువ. ముంబయి కేంద్ర కారాగారంలో కేవలం 804 మందికే చోటు ఉంటే, నిరుడు జులై 31 నాటికి అక్కడున్న ఖైదీల సంఖ్య 1843.
దిల్లీలో తిహార్‌తో సహా అన్ని జైళ్లలో 10,026 మంది ఖైదీలకే చోటు ఉండగా- ఏకంగా 14,000 మందిని అక్కడ ఉంచుతున్నారు. మరో నాలుగువేల మంది బెయిలు, పెరోల్ మీద బయట ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బయట ఉన్న ఖైదీలను ఈ నెల ఏడోతేదీ నుంచి తిరిగి రావాలంటూ మాండోలీ జైలు అధికారులు ఆదేశించడం ఆందోళన కలిగిస్తోంది. తిరిగొచ్చే ఖైదీలందరికీ వైద్య వసతులు కల్పించే సామర్థ్యం మన జైళ్లకు లేదు. భారత కారాగారాల్లో 70శాతం విచారణలో ఉన్న ఖైదీలేనని గుర్తుంచుకుంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. విచారణలోని ఖైదీలందరి బెయిలు రద్దు చేస్తున్నట్లు దిల్లీ హైకోర్టు గత ఏడాది అక్టోబరు 20న జారీచేసిన ఉత్తర్వు కలకలం రేపింది. ఆ ఉత్తర్వును సుప్రీంకోర్టు నిలువరించడం ఊరట కలిగించే పరిణామం. 2019లో గుండె, మూత్ర పిండాలు, ఊపిరితిత్తుల వ్యాధులతో జైలులోనే మరణించిన ఖైదీల సంఖ్య 1775 అని భారత జైలు గణాంకాల (పీఎస్‌ఐ) సంస్థ నివేదిక పేర్కొంది. ఖైదీలకు చికిత్స అందించాలంటే వైద్య సిబ్బంది కొరత అడ్డువస్తోంది. 40 శాతం ఖాళీలున్నా భర్తీ చేయడంలేదు.
ఖైదీలకే కాదు, జైలు అధికారులకూ కరోనా పాకుతోంది. దాంతో వైరస్ సోకని సిబ్బంది, అధికారులను కూడా అనుమతి లేనిదే జైలు ప్రాంగణం నుంచి బయటకు కదలవద్దని ఆదేశించారు. జైలు సిబ్బందిలో అత్యధికులు కారాగార ప్రాంగణాల్లోనే నివసిస్తారు. అనుమతి తీసుకుని బయటకువెళ్లి వచ్చినవారిని వెంటనే పరీక్షించి కానీ, లోపలకు పంపడం లేదు. గత ఏడాది అక్టోబరు 25నాటికి భారత ఖైదీలు, జైలు సిబ్బందిలో 18,157 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని, వారిలో 17 మంది మరణించారని సీహెచ్‌ఆర్‌ఐ తెలిపింది. నిధుల కొరత, ప్రణాళికా లోపం వల్ల జైళ్లలో వైద్య, మౌలిక వసతుల అభివృద్ధి కుంటువడుతోంది. ఈ సమస్యలను అధిగమించడానికి సమయం, నిధులు అవసరం, కానీ, అందుబాటులో ఉండే వనరులు, వసతులతోనే జైళ్లలో రద్దీ తగ్గించవచ్చన్న సంగతి విస్మరించకూడదు.
మనుషులుగా చూడాలి
ఖైదీలు రెండోసారి కారాగారాలకు రావడాన్ని అరికట్టాలంటే వారికి పునరావాసం కల్పించడం మేలైన మార్గం. మలేసియా జైళ్ల శాఖ మైక్రోసాఫ్ట్ సంస్థ భాగస్వామ్యంతో బాల, యువ ఖైదీలకు డిజిటల్ నైపుణ్యాలు నేర్పే ప్రాజెక్టు నిర్వహిస్తోంది. వీరిలో 100 మంది విశ్వవిద్యాలయ కోర్సుల్లో ప్రవేశం పొంది, జైళ్ల నుంచి విడుదలయ్యారు. శిక్షించే ధోరణికన్నా పునరావాసం కల్పించాలన్న ఉదార వైఖరి మంచి ఫలితాలను ఇస్తుందని, ఖైదీలు తిరిగి నేరాలకు పాల్పడకుండా నివారిస్తుందని నార్వే, స్వీడన్ దేశాల విధానాలు నిరూపిస్తున్నాయి. ఖైదీలను నేరగాళ్లుగా కాకుండా మనుషులుగా చూడటం సత్ఫలితాలనిస్తుంది. ఇలాంటి విధానం విజయవంతం కావడంతో స్వీడన్‌లో నాలుగు జైళ్లను మూసేయడం విశేషం. ఇరాక్ నియంత సద్దాం హుసేన్ తనను స్వీడన్‌లో ఏదైనా జైలుకు పంపాలని కోరారంటే, అక్కడి కారాగారాలు ఎంత ఉదారమైనవో, ప్రగతిశీలమైనవో అర్థం చేసుకోవచ్చు. భారతీయ జైళ్లలోనూ ఆ స్థాయి ప్రమాణాల్ని పాదుకొల్పాల్సిన అవసరం ఉంది!
- ఆర్య
ఇదీ చదవండి:కేంద్రంపై రైతులు 'కిసాన్ మహా పంచాయత్' అస్త్రం