తూర్పు లద్దాఖ్‌లో ప్రతిష్టంభనను తొలగించేలా భారత్-చైనా అంగీకరించడం వల్ల పాంగాంగ్ సరస్సు వద్ద ప్రమాదకర స్థితిని నివారించినట్లైంది. ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభం కావడానికి(ఫిబ్రవరి 10) ముందు ఇరుదేశాల సైన్యాలు 30-40 మీటర్ల దూరంలో ఉండేవి. పదో విడత సైనిక చర్చల సమయానికి ఆ దూరం కాస్తా 500 మీటర్లకు పెరిగిందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారులు 'ఈటీవీ భారత్'కు తెలిపారు.
"ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమయ్యే సమయానికి ఇరుదేశాల సైనికులు ప్రమాదకర స్థితిలో ఉన్నారు. సైన్యం మధ్య దూరం 30-40 మీటర్లు మాత్రమే ఉండేది. అంత దగ్గరగా ఉండే ఏదైనా జరిగేది. కానీ ఇప్పుడు సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇద్దరి మధ్య 500 మీటర్ల దూరం ఉంది."
-అధికారులు
చర్చల్లో పురోగతి వల్ల గల్వాన్ లాంటి ఘటనలు మరోసారి జరగకుండా నివారించినట్లైందని అధికారులు పేర్కొన్నారు. అయితే ఖాళీ చేసిన సైన్యం అరగంటలోనే మళ్లీ ఆ ప్రాంతానికి చేరుకునే విధంగా మోహరించారని చెప్పారు. సరిహద్దు ప్రతిష్టంభనపై వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
"కమాండర్ స్థాయి సైనిక అధికారుల చర్చలు మాత్రమే కాకుండా.. డబ్ల్యూఎంసీసీ(వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ ఫర్ ఇండియా-చైనా బార్డర్ అఫైర్స్), జాతీయ భద్రతా సలహాదారుల ప్రతినిధుల స్థాయిల్లోనూ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా వివిధ వేదికల్లో రాజకీయ స్థాయిలోనూ చర్చలు జరుగుతున్నాయి."
-అధికారులు