మానవుడి దైనందిన జీవితంతో ప్లాస్టిక్ వినియోగం పెనవేసుకుపోయింది. దీనివల్ల క్యాన్సర్‌వంటి ప్రాణాంతక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నా- ప్లాస్టిక్ వాడకం అనివార్యంగా మారింది. ప్లాస్టిక్ వస్తువుల మన్నిక, లభ్యత బాగా ఉండటం, జీవనశైలి మార్పులు, తక్కువ ధర, నిర్వహణ వంటివే ఇందుకు కారణాలు. దేశంలోని పట్టణ జనాభా ఇప్పుడున్న 38 కోట్ల నుంచి 2030 నాటికి 60 కోట్లకు పెరుగుతుందని అంచనా. పట్టణీకరణవల్ల వ్యర్థాల ఉత్పత్తి 2030కల్లా మూడు రెట్లవుతుందని నిపుణులు అంటున్నారు. అధిక జనాభాకు అనుగుణంగా వస్తువుల డిమాండ్, వినియోగం పెరిగి- వ్యర్థాలు పోగుపడుతున్నాయి. పర్యావరణ పరిరక్షణకు అవరోధంగా మారి గాలి, నీరు, నేల కలుషితమై జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో- ప్లాస్టిక్ నియంత్రణ ఆవశ్యకం. లేకుంటే విపరీతంగా పెరుగుతూ పర్యావరణంలో కలిసిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల దాటికి మానవాళితో పాటు, జంతుజాలం అంతరించే ప్రమాదం ఉంది. కాబట్టి, ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణే ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిరుడు ‘పరిశుభ్రతే సేవ’ పేరుతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది.
70శాతం వ్యర్థాలు అక్కడి నుంచే..
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు 2017-18 నివేదిక ప్రకారం దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు రోజుకు సుమారు 26,000 టన్నుల మేర ఉత్పత్తవుతున్నాయి. దాదాపు 70శాతం ప్యాకేజింగ్ ఉత్పత్తులు అనతి కాలంలోనే ప్లాస్టిక్ వ్యర్థాలుగా మారుతున్నాయి. ఇవి భూమిలో కలిసి, ప్రవాహాలను, భూగర్భ జలాలను కలుషితం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయిన మొత్తం ప్లాస్టిక్‌లో 10శాతం లోపే సమగ్రంగా పునర్వినియోగానికి నోచుకుంటున్నాయి. కొన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసి కుళ్లిపోవడానికి 450 సంవత్సరాలు పడుతుందని నివేదికలు తెలుపుతున్నాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్రాల్లో కలిసిపోతున్నాయి. ఇప్పటివరకూ 15 కోట్ల టన్నుల వ్యర్థాలు సముద్రాల్లో పోగుపడినట్లు అంచనా. ఇది ఇలాగే కొనసాగితే 2050 నాటికి సముద్రాల్లో చేపల కంటే ప్లాస్టిక్ అధికంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో తాగునీటిలోనూ ప్లాస్టిక్ ఉంటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. అప్పుడే పుట్టిన శిశువు రక్తంలో సైతం ప్లాస్టిక్ ఉండటం విస్మయానికి గురి చేస్తోంది. దీనివల్ల క్యాన్సర్, హార్మోన్లలో మార్పులు, గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి.
నిబంధనలు గాలికి