తెలంగాణ

telangana

By

Published : Jun 15, 2021, 8:47 AM IST

ETV Bharat / opinion

పండుటాకులకు భరోసా ఏదీ?

ముదిమి వయసు తల్లిదండ్రులను ఇంటి నుంచి గెంటివేయడం వంటి వార్తలు తరచూ మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి. ఇది అత్యంత దారుణ విషయం. వృద్దులపై జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపివేయాలని ప్రజలకు, యువతకు పిలుపివ్వాలి. వయోధికులకు వారికిగల హక్కుల గురించి తెలుపుతూ వేధింపులనుంచి రక్షణ కల్పించాలి. ముసలి తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

senior citizens victims of abuse
వృద్ధులపై వేధింపులు

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ముదిమి వయసు తల్లిదండ్రులపై సంతానమే దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం, ఇంటి నుంచి వారిని గెంటివేయడం వంటి వార్తలు తరచూ మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉంటాయి. సాధారణంగా వయోధికులు తెలివైనవారు, అనుభవశీలురు. శారీరకంగా, మానసికంగా దుర్బలురు. సమస్యలను పరిస్థితులను అర్థం చేసుకొని పిల్లలతో సయోధ్యకు ప్రయత్నించేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. అయినా వారి మాటలను వినిపించుకోకుండా- పిల్లలు వారిని వేధిస్తున్న ఉదంతాలెన్నో. బయటికి చెబితే పరువు పోతుందనే భావనతో పలువురు వృద్ధులు- బంధువులు, స్నేహితులు, పొరుగువారివద్ద ఈ విషయాలను దాస్తున్నారు. తద్వారా వారు రకరకాల మానసిక, శారీరక వ్యాకులతలకు గురై అంతిమంగా ప్రాణాలు కోల్పోతున్నారు. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రులకు ఉన్నతమైన స్థానం ఉంది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెక్కుచెదరనంతవరకు మనదేశంలో వృద్ధులు గౌరవంగానే జీవించారు. ప్రపంచీకరణ నూతన ఆర్థిక, సామాజిక అంశాలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశాయి. ఉద్యోగాల వేటలో పిల్లలు తల్లిదండ్రులకు దూరమై, చిన్న కుటుంబాలు ఏర్పాటయ్యాయి. కొందరు తల్లిదండ్రులతో కలిసే జీవిస్తున్నా నేటి ఆధునిక నాగరికత వారిమధ్య విభజనరేఖ గీసింది. ఇంకొందరయితే తల్లిదండ్రులను బలవంతంగా వృద్ధాశ్రమాల్లో చేర్పించి చేతులు దులిపేసుకుంటున్నారు. వారిని రెండు మూడు నెలలకు ఒక్కసారైనా పలకరించిన పాపాన పోవడంలేదు. పెద్దవారు ఇంట్లో ఉంటే పిల్లలకు తోడుగా ఉంటారు. వారికి చిన్నతనం నుంచే మన సనాతనధర్మం, ఆచార వ్యవహారాలు, నైతిక విలువల గురించి చెబుతారు. వారి సందేహాలను తీరుస్తారు. తద్వారా ఆ చిన్నారులు పెరిగి బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. వారి అపార జ్ఞానం తరవాతి తరాలకు చేరే పరిస్థితులను నేటి యువ సమాజం కల్పించాలి.

అప్పుడే కళ్లెం పడేది!

పెద్దవారిని ఈసడించుకోవడం, తిట్టడం వంటివి మానసిక వేధింపులు. కొట్టడం, తోసివేయడం, హింసించడం, భోజన వసతి, దుస్తులు, వైద్యసేవలు కల్పించకపోవడం, స్వేచ్ఛను హరించడంలాంటివి శారీరక వేధింపులు. వారి అభీష్టానికి భిన్నంగా బెదిరించి మోసగించి వారి వద్ద ఉన్న ధనం, ఆభరణాలు, స్థలం, ఇల్లు, పొలం, భూములు, వ్యాపారాలను బలవంతంగా లాక్కోవడం వంటివి ఆర్థికపరమైన వేధింపులు. వయసుమీరిన ఒంటరి మహిళలపై లైంగిక వేధింపులూ చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ చట్టరీత్యా శిక్షార్హమైనవే. వయోధికులపై వేధింపులను సామాజిక రుగ్మత, సాంఘిక దురాచారంగా పరిగణించాలి. ఈ తరహా అవగాహన వృద్ధులకు, యువతకు కల్పించడానికి ఐక్యరాజ్యసమితి జూన్‌ 15న వయోజనులపై వేధింపులను కట్టడిచేసే దిశగా అవగాహన కల్పించే దినం(వరల్డ్‌ ఎల్డర్‌ అబ్యూజ్‌ అవేర్‌నెస్‌ డే)గా పరిగణించాలని 2011లో పిలుపిచ్చింది. ఈ సందర్భంగా అన్ని దేశాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటుచేసి వృద్ధులకు యువతకు అవగాహన కల్పించాలని కోరింది. వయోధికులపై వేధింపులను అరికట్టేందుకు భారతదేశం అనేక చట్టాలను చేసింది. వాటిలో 'తల్లిదండ్రులు, వృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం 2007' ముఖ్యమైంది. ఈ చట్టంలోని రెండో సెక్షన్‌ ప్రకారం వృద్ధులు, తల్లిదండ్రుల పోషణ బాధ్యత వారి పిల్లలది. సంతానం లేకపోతే సమీప వారసత్వ బంధువులది. సెక్షన్‌ 4 ప్రకారం తల్లిదండ్రులు, వృద్ధులు తమ పోషణ ఖర్చులను ఇవ్వాల్సిందిగా తమ పిల్లలను లేదా వారసత్వ బంధువులను అడిగే హక్కుంది. ఈ హక్కు కోసం రెవిన్యూ డివిజనల్‌ అధికారి నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. దరఖాస్తు వచ్చిన 90 రోజుల్లోపు పోషణ ఖర్చుల చెల్లింపునకు ఆ ట్రైబ్యునల్‌ ఆదేశాలు ఇవ్వవలసి ఉంటుంది. ఈ చట్టంలోని 21వ సెక్షన్‌ ప్రకారం పోలీసులు వృద్ధుల ప్రాణాలకు, ఆస్తులకు సంపూర్ణమైన రక్షణ కల్పించాలి. చట్టాలు ఉన్నా- అధికార యంత్రాంగాల నిర్లక్ష్యం వల్ల పూర్తి స్థాయిలో అమలు కావడంలేదు. దీంతో వృద్ధుల హక్కులకు గ్రహణం పట్టింది. చాలామంది వయోజనులకు చట్టాలపై అవగాహన లేకపోవడంతో తమపై జరుగుతున్న దౌర్జన్యాలను ఎవరితోనూ చెప్పుకోలేక బాధితులుగా మిగిలిపోతున్నారు. అందుకే వయోధిక సంఘాలు ముందువరసలో ఉండి, సాంఘిక సంస్థలను, యువతను కలుపుకొని ఒక సామాజిక ఉద్యమాన్ని నడపవలసిన అవసరం ఉంది. అందుకోసం ప్రతి వయోధికుడు సన్నద్ధం కావాలి. గ్రామాలు, పట్టణాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి వృద్దులపై జరుగుతున్న వేధింపులను తక్షణమే ఆపివేయాలని ప్రజలకు, యువతకు పిలుపివ్వాలి. వయోధికులకు వారికిగల హక్కుల గురించి తెలుపుతూ వేధింపులనుంచి రక్షణ కల్పించాలి. ముసలి తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వృద్ధులపై జరుగుతున్న దాడులు, దౌర్జన్యాలకు కళ్లెం పడేది!

- పి.నరసింహారావు
(తెలంగాణ సీనియర్‌ సిటిజన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)

ఇవీ చదవండి:దాతలు లేక తరుగుతున్న నెత్తురు నిల్వలు

ABOUT THE AUTHOR

...view details