ప్రజల జీవితాలు లోగడ ఉన్నట్లు ఉండబోవడం లేదు. కొవిడ్ వ్యాధి మానవ జీవితంలో ప్రతి రంగాన్నీ రూపాంతరం చెందించనున్నది. మారిన పరిస్థితుల్లో ఆర్థిక కార్యకలాపాలను పునరుత్తేజితం చేసి ప్రజల వృత్తిఉపాధుల దిశ, దశ మార్చడం ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలపై ఉన్న గురుతర బాధ్యత. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి విధించిన లాక్‌డౌన్‌లతో అంతర్జాతీయ సరఫరా గొలుసులు విచ్ఛిన్నమయ్యాయి. దేశదేశాల ఆర్థిక వ్యవస్థల పునాదులు కదిలిపోయాయి. వివిధ రంగాల్లో వృత్తి ఉపాధులు గల్లంతయ్యాయి. ఈ సంక్షోభం స్వావలంబన ఆవశ్యకతను బలంగా చాటి చెప్పింది. భారీ లక్ష్యసాధనకు ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోదీజీ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని ప్రకటించారు. స్వల్పకాలంలో ఆర్థిక రంగాన్ని పునరుత్తేజితం చేయడం, దీర్ఘకాలంలో ఎటువంటి అంతర్జాతీయ ఆర్థిక మాంద్యాలనైనా తట్టుకునే సత్తాను భారత్‌కు సమకూర్చడం ఈ కార్యక్రమం జంట లక్ష్యాలు. మన దేశంలో అన్ని రంగాల్లో వస్తూత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించి స్థానిక ఉత్పత్తులకు స్వదేశంలోనూ, విదేశాల్లోనూ గిరాకీని ఇబ్బడిముబ్బడిగా పెంచాలని ఆత్మ నిర్భర్ యోజన ఉద్దేశిస్తోంది. స్థానిక ఉత్పత్తి ప్రాధాన్యాన్ని ఎలుగెత్తి చాటుతూనే అంతర్జాతీయ విపణిలో పోటీపడగల వస్తువులను భారత్‌లో తయారుచేసి ఎగుమతి చేయాలని లక్షిస్తోంది. అలాగని విదేశీ వస్తువులకు గేట్లు మూసేసి సొంత వాణిజ్యాన్ని సంరక్షించుకోవాలనే రక్షణ ధోరణికి ఈ కార్యక్రమం తావివ్వదు. భారత్‌లో మౌలిక వసతులను, ఉత్పత్తి సామర్థ్యాన్ని వృద్ధి చేసి దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతంగా మార్చి, దేశ ప్రజల వినియోగాన్ని, పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచాలని ఈ కార్యక్రమం ధ్యేయంగా పెట్టుకుంది. ఆర్థికాభివృద్ధికి ఎగుమతులపై ఆధారపడకుండా మన దేశ ప్రజల కొనుగోలు శక్తిని పెంచినప్పుడు వస్తుసేవల వినియోగం పెరుగుతుంది.
గ్రామాలు, పట్టణాల పునరుజ్జీవం
స్వావలంబనకు నైపుణ్యాలే సోపానాలుఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి అయిదు మూల స్తంభాలుగా నిలిచేవి- ఆర్థిక వ్యవస్థ, మౌలిక వసతులు, అధునాతన సాంకేతికత, వస్తుసేవలకు గిరాకీ, జవజీవాలు ఉట్టిపడే జనవర్గాలు. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఇటీవలి సంవత్సరాల్లో ముఖ్యమైన సంస్కరణలు తీసుకొచ్చింది. తాజాగా ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ రైతులు, కూలీల జీవనాధారాలను సంరక్షించడంతోపాటు కొవిడ్ వల్ల కుదేలైన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఇ) రంగాన్ని, భారీ పరిశ్రమలను పునరుత్తేజితం చేయడానికి పలు చర్యలను ప్రతిపాదించింది. వ్యవసాయంతోపాటు గ్రామీణ ఆర్థికానికి తిరిగి ఊపు తేవడానికి ఈ ఉద్దీపన ప్యాకేజీ కింద ముఖ్యమైన చర్యలను ప్రభుత్వం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాలు, మార్కెట్ మాయాజాలం నుంచి రైతును రక్షించడానికి వీలుగా వారు తమ పంటను నచ్చిన చోట అమ్ముకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. రైతులకు మంచి ధరను తెచ్చిపెట్టే కీలక సంస్కరణ ఇది. ఇంకా ఇనామ్, గిడ్డంగులు, శీతలీకరణ కేంద్రాలు, పంట కోత అనంతర వసతులను, సూక్ష్మ ఆహారోత్పత్తి యూనిట్లను సద్వినియోగం చేసుకోవడానికి కావలసిన నైపుణ్యాలను రైతులు అలవరచుకోవాలి. దీనికితోడు స్థానికంగా వ్యవస్థాపక సామర్థ్యాన్నీ పెంపొందించి యువతను సొంత వ్యాపారాలు, పరిశ్రమలను స్థాపించే స్థాయికి ఎదిగేలా చేయాలి. దీనికోసం గ్రామాలు, పట్టణాలు, నగరాల సమీపంలో స్థానిక వనరులను ఉపయోగించి వివిధ వస్తువులను తయారుచేసే పరిశ్రమల సముదాయాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు.
చురుకైన నవ భారతం
ఏ దేశ భవిష్యత్తుకైనా యువతరమే కీలకం. భారత జనాభాలో 65శాతం, 35ఏళ్ల లోపువారు. 50శాతం- 25ఏళ్ల లోపువారు. ఈ అపార మానవ వనరులు దేశాభివృద్ధికి చోదక శక్తులవుతాయి. నేడు మైక్రోసాఫ్ట్, గూగుల్ తదితర జగద్విఖ్యాత బహుళజాతి సంస్థలకు భారతీయులు సారథ్యం వహించడం ఈ దేశంలో విజ్ఞానం, ప్రతిభ పుష్కలమని చాటుతోంది. కొవిడ్ దెబ్బకు మానవ కార్యకలాపాలు, ముఖ్యంగా కార్యస్థానాలు సమూలంగా మారిపోతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు రంగం తమ కార్యశైలిని మార్చుకోక తప్పడం లేదు. ఐటీ రంగంతో సహా అనేక వ్యాపార, పారిశ్రామిక సంస్థలు కరోనా భయంతో సిబ్బంది సంఖ్యను కుదించుకుని ఇంటి నుంచి పని విధానానికి మళ్లకతప్పడం లేదు. ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవాలి.
‘నైపుణ్యాలతో యువశక్తి పునర్వైభవం’ అనే అంశాన్ని ఐక్యరాజ్య సమితి నేటి ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవ ఇతివృత్తంగా ప్రకటించింది. ప్రస్తుతం యువతకున్న నైపుణ్యాలకు భిన్నమైన నైపుణ్యాలు రేపటి వృత్తిఉద్యోగాలకు అవసరమవుతాయి. వాటిని అలవరచుకోవడంతోపాటు భవిష్యత్తులో ఎదురయ్యే ఎలాంటి కొత్త సంక్షోభాలనైనా తట్టుకుని నిలిచే మానసిక, భావోద్వేగ సత్తానూ యువత అందిపుచ్చుకోవాలి.