తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2020, 10:11 AM IST

ETV Bharat / opinion

కరోనా మహమ్మారికి స్వీయనిర్బంధమే పెద్ద మందు

ఒకర్ని కరోనా రోగిగా గుర్తించడానికి సరైన నియమాలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు సాగిన ప్రచారం కారణంగా పాజిటివ్‌ నిర్ధరణ కాగానే భయోత్పాతానికి గురై అందరూ ఆస్పత్రుల బాటపడుతుండటమే సమస్యాత్మకమవుతోంది. బాధితులు ఇంటివద్దే స్వీయనిర్బంధం (సెల్ఫ్‌ ఐసోలేషన్‌) విధిగా పాటించి, వైద్యులు సూచించే ప్రాథమిక సూచనలు అనుసరిస్తే- సత్వరం నూరుశాతం కోలుకుంటారు.

SELF ISOLATION
స్వీయనిర్బంధం

లాక్‌డౌన్‌ ఎత్తేసిన తరవాత దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెచ్చరిల్లి, గ్రామగ్రామానికీ విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య, సౌకర్యాలు పరిమితమన్న విషయం నిర్వివాదం. కార్పొరేట్‌ ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటే లక్షల రూపాయల్లో బిల్లులు వడ్డిస్తున్నారు. వాస్తవానికి పాజిటివ్‌ వచ్చినవారిని బాధితులుగానే చూడాలి. రోగులుగా కాదు.

ఒకర్ని కరోనా రోగిగా గుర్తించడానికి సరైన నియమాలు రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటివరకు సాగిన ప్రచారం కారణంగా పాజిటివ్‌ నిర్ధరణ కాగానే భయోత్పాతానికి గురై అందరూ ఆస్పత్రుల బాటపడుతుండటమే సమస్యాత్మకమవుతోంది. బాధితులు ఇంటివద్దే స్వీయనిర్బంధం (సెల్ఫ్‌ ఐసోలేషన్‌) విధిగా పాటించి, వైద్యులు సూచించే ప్రాథమిక సూచనలు అనుసరిస్తే- సత్వరం నూరుశాతం కోలుకుంటారు.

ఉదాసీనతే శాపం

వైరస్‌ సోకినవారిలో 80 నుంచి 85 శాతానికి ఎటువంటి వ్యాధి లక్షణాలు ఉండటం లేదు, లేదా స్వల్పంగా ఉంటున్నాయి. ఇవి ప్రాణహాని కలిగించవు. బాధితుల్లో కేవలం పది శాతమే ఆస్పత్రిలో చేరాల్సి ఉంటుంది. వీరిలోనూ ఐసీయూ చికిత్స అవసరమైనవారు అయిదారుగురు మాత్రమే ఉంటారు. ఈ కొద్దిమందిని మాత్రమే ప్రాణాపాయ స్థితి నుంచి బయటకు తీసుకురావాల్సి ఉంటుంది.

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ చికిత్స గణాంకాలు ఇందుకు నిదర్శనాలు. మరెందుకు సమాజంలో ఇంత అలజడి ఏర్పడుతుంది? ‘పాజిటివ్‌’ అనగానే కలుగుతున్న భీతి దీనికి కారణం. భయమే ప్రాణాంతకమవుతోందన్నది నిష్ఠుర సత్యం. ముందుగా ఈ భయాన్ని పోగొట్టాలి. ఇందుకు ప్రజల నుంచీ సహకారం అవసరం. మనోధైర్యమే ఇప్పుడు కరోనాకు అసలైన మందు!

ఇంటిలోనే ఐసోలేషన్..

ఉద్యోగ ఉపాధుల కోసం బయటకు వెళ్లేవారు సాధ్యమైన మేర ఎడంగా ‘ఐసోలేషన్‌’ ఉండటం కుటుంబ క్షేమానికి ఎంతో అవసరం. రెండు గదులున్న కుటుంబాలవారు ఒక గదిని ఇందుకోసం ప్రత్యేకించుకోవడం ఎంతైనా అవసరం. ఒకరికి సోకినా కుటుంబ సభ్యులకూ పాజిటివ్‌ రావడానికి వెనకగల కారణమిదే! ఇలాంటి అంశాలపై ప్రజల్లో కచ్చితమైన అవగాహన కలిగించగలిగితే ప్రభుత్వ ఆస్పత్రులపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. సామాజికవ్యాప్తి ద్వారా పల్లెపల్లెలకు కొవిడ్‌ విస్తరిస్తున్న నేపథ్యంలో నిరంతర వైద్యసలహా కేంద్రాల విధానాన్ని ప్రభుత్వాలు మెరుగుపరచాలి.

ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎక్కడ పరీక్షలు నిర్వహించినా కరోనా బాధితుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉండాలి. నిర్ణీత కాలవ్యవధుల్లో వీరి ఆరోగ్యాన్ని సేవా కేంద్రాల్లోని కార్యకర్తలు పర్యవేక్షిస్తుండాలి. బాధితుడి పరిస్థితిని వీరు పర్యవేక్షిస్తూ వైద్యుణ్ని సంప్రతించే ఏర్పాటు అవసరం. ఇళ్లలో విడిగా గదులు లేని బాధితులను కమ్యూనిటీ హాళ్లలో నిర్ణీత సంఖ్యలో ఉంచి, పోషకాహారం అందజేయాలి. వలస జీవులు తరలివెళ్లేటప్పుడు ఆహారం అందజేసిన స్వచ్ఛంద సంస్థలు, సేవాభిలాషుల వితరణ మున్ముందు ప్రభుత్వానికి అక్కరకు రావచ్చు. జిల్లా, మండల స్థాయుల్లోనూ ప్రత్యేక కొవిడ్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేయాలి.

రోగి కాదు.. రోగంతోనే పోరాటం..

ప్రతి గ్రామంలో ఓ ఐసోలేషన్‌ కేంద్రాన్ని సిద్ధపరచాలి. రోగంతో పోరాడాలే తప్ఫ.. రోగితో కాదన్న నినాదానికి అనుగుణంగా చర్యలు ఉండాలి. మధుమేహం, రక్తపోటు, న్యుమోనియా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలి. రోగనిరోధకత పెంచే ఆహారాన్ని తీసుకోవాలి. శారీరక వ్యాయామం అవసరాన్ని గుర్తించాలి. ఇళ్లలో గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలి. ప్రభుత్వాల స్థాయిలోనే కాదు- సామాజికంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగా అందరూ అవగాహన కలిగిఉండటమే- మహమ్మారిపై పోరాటంలో అసలైన అస్త్రం!

మనం చేస్తున్న పొరపాట్లే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయి. భౌతిక దూరం విధిగా పాటించాలని చెబుతుంటే అనేకచోట్ల ఖాతరు చేయడం లేదు. ఒకరికి పాజిటివ్‌ రాగానే కుటుంబం మొత్తానిన పరోక్షంగా వెలివేసే పెడధోరణులు ప్రబలిపోవడం నిజంగా బాధాకరం. భౌతికదూరం పాటిస్తూ బాధితులకు సేవలు అందజేయడం వల్ల ఎలాంటి హానీ కలుగదు. ప్రపంచంలో అనేక దేశాలు స్వీయనిర్బంధ విధానాలకు పదును పెట్టుకున్నాయి.

అధిక జనాభా, దిగువ మధ్యతరగతి వర్గాలు అధికంగా ఉండే భారత్‌లో ఇది మరింత అవసరం. కనుక బాధితులను ఆదుకోవడానికి స్వయంసహాయక బృందాలుగా స్థానికులు ఏర్పడాలి. గ్రామాలు, అపార్ట్‌మెంట్లలో పాజిటివ్‌ బాధితులు, రోగులు, కుటుంబాల పట్ల దుర్విచక్షణ ప్రదర్శించకుండా ఈ బృందాలు ఆయా కుటుంబాలకు అన్ని రకాలుగా సహకారం అందజేయగలిగితే దానివల్ల లాభాలు అనేకం. ప్రశాంతమైన మనసు, చక్కని నిద్ర సైతం రోగనిరోధక శక్తిని పెంచుతాయి. టెలిమెడిసిన్‌ ద్వారా అందుబాటులో ఉన్న వైద్యులను సంప్రతించి స్వీయగృహనిర్బంధంలోని సాటివారికి తోడ్పడాలి. సామాజిక వెలి భయంతోనే అనేకమంది విషయాన్ని బయటకు చెప్పకుండా బయట తిరుగుతూ తమకు తాము కష్టాలు కొనితెచ్చుకుంటున్నారు. ఎందరినో ప్రాణాపాయంలోకి నెడుతున్నారు.

వలసలతో చేటు

ఉపాధి కోల్పోయిన అనేకమంది స్వగ్రామాలకు తరలివెళ్లిపోయారు. ప్రస్తుతం తెలంగాణలో కేసుల సంఖ్య తక్కువగా ఉండి ఏపీలో ఉద్ధృతం కావడాన్ని ఈ దృక్కోణంలో చూడాలి. తెలంగాణలోకన్నా ఏపీలో లక్ష కేసులు ఎక్కువగా నమోదుకావడానికి ఈ పరిస్థితే కారణం. అందువల్లే బాధితుడి సంచారంపై ప్రభుత్వపరమైన నిఘా తప్పనిసరిగా ఉండాలి. అనేకమంది తప్పుడు చిరునామాలతో టెస్టులకు వెళ్లడమూ ప్రమాదకరమవుతోంది. యాంటీజెన్‌ కిట్లు ఎవరికి వాడుతున్నామో పక్కా రికార్డు తప్పనిసరి. ఎవరెవరు ఎన్నిసార్లు పరీక్షలు చేయించుకుంటున్నారో కూడా నమోదుకావాలి. ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు కొరవడితే ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నా అవన్నీ వృథాప్రయాసగా మిగులుతాయి!

(రచయిత- డాక్టర్ శ్రీభూషణ్ రాజు, నెఫ్రాలజీ విభాగాధిపతి, హైదరాబాద్ నిమ్స్)

ABOUT THE AUTHOR

...view details