తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పొంచి ఉన్న వ్యాధులు.. స్వీయ పరిరక్షణ అవసరం

లాక్‌డౌన్‌ సడలింపుల తరవాత దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరింత వేగవంతమయింది. వర్షాకాలమూ ప్రారంభం కావడంతో వాన ముసురుకు ఇతర సాంక్రామిక వ్యాధులూ ప్రబలే ప్రమాదం హెచ్చింది. ఈ తరుణంలో వైరల్‌ జ్వరాల బారినపడకుండా, స్వీయ ఆరోగ్య క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Self-care is essential to avoid Infectious Diseases
పొంచి ఉన్న వ్యాధులు.. స్వీయ ఆరోగ్య పరిరక్షణ అవసరం

By

Published : Jun 26, 2020, 9:33 AM IST

జురోజుకూ కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ తరుణంలోనే వర్షాకాలమూ ప్రారంభం కావడంతో వాన ముసురుకు ఇతర సాంక్రామిక వ్యాధులూ ప్రబలే ప్రమాదం హెచ్చింది. ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉరుముకొస్తోంది. తెలుగురాష్ట్రాల్లో కరోనాపై ముందువరసలో ఉంటూ పోరాటం చేస్తున్న వైద్యులు, పోలీసులు సైతం పెద్దయెత్తున వైరస్‌ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపుల తరవాత దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి మరింత వేగవంతమయింది. ఈ తరుణంలో వైరల్‌ జ్వరాల బారినపడకుండా, స్వీయ ఆరోగ్య క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, రోగనిరోధక శక్తిని మెరుగుపరచే పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

ఇంటి పరిసరాల్లో చుట్టూరా ఉండే ఖాళీస్థలాల్లో వర్షపునీరు నిలవడానికి అవకాశమున్న ప్రాంతాలు దోమలు, ఈగలకు ఆవాసాలుగా మారుతాయి. ఇంట్లో ఉండే ఖాళీ డ్రమ్ములు, ట్యాంకులు, పాతసామగ్రి, కూలర్లు, సైకిళ్లు, ద్విచక్రవాహనాల టైర్లు, పూలకుండీల్లో నీళ్లు నిల్వ ఉండే ప్రమాదం ఉంది. వీటిలో నీళ్లు చేరకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచి పొడిగా ఉండేలా చూడాలి. లేకపోతే తేమ వాతావరణం పెరిగి, చీకట్లో దోమలు తిష్ఠవేసే ప్రమాదం ఉంటుంది. ఇంట్లోకి గాలి, వెలుతురు ప్రసరించేలా చూడాలి. మురుగునీటి పారుదల నిర్వహణలో జాగ్రత్త వహించాలి. వీధులు, ఖాళీస్థలాలు, ఇళ్ల మధ్య చెత్తాచెదారాలను వేయడం ద్వారా పారిశుద్ధ్యం లోపించి ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. వానాకాలం కావడం వల్ల సహజంగానే చల్లని, తేమతో కూడిన వాతావరణం వల్ల ‘ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు’ సోకే అవకాశాలు ఎక్కువ. చర్మ సంబంధిత వ్యాధులకూ ఆస్కారం ఉంది. వాతావరణ మార్పులవల్ల న్యుమోనియా, ఆస్తమా, సైనసైటిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందువల్ల తగిన జాగ్రత్తలు పాటించాలి.

రెండు మూడు రోజుల్లో..

ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో రెండు, మూడు రోజులకు మించి జలుబు, జ్వరం, దగ్గు వంటివి వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ముఖ్యం. ఎందుకంటే అత్యధిక శాతం కేసుల్లో మనదగ్గర కరోనా లక్షణాలు బహిర్గతం కాకుండానే వైరస్‌ విజృంభిస్తోంది. లక్షణాలు కనిపిస్తే ముందే జాగ్రత్తపడి, వెంటనే చికిత్స మొదలుపెట్టే అవకాశం దొరుకుతుంది. వానాకాలం కావడంతో తాగునీరు, తినే ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డయేరియా, టైఫాయిడ్‌, పచ్చకామెర్లు, కలరా వంటి వ్యాధులు అపరిశుభ్రమైన, కలుషితమైన నీటిని తాగడం ద్వారానే సంక్రమించే అవకాశం ఉంది. వేడిచేసి, చల్లార్చి వడబోసిన నీటిని మాత్రమే తాగడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. భోజనంలో భాగంగా వేడిగా ఉన్న, ఆహార పదార్థాలను తీసుకోవాలి. కలుషితమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు కలుగుతాయి. కలరా, అతిసారం వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయి. వండటానికి ముందే ఆకుకూరలు, కూరగాయలను శుభ్రంగా కడగాలి. తాగునీరు, ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు వ్యక్తిగత, పరిసరాల శుభ్రత, స్వీయ జాగ్రత్తలు, ఆరోగ్య క్రమశిక్షణను పాటించడం కీలకం.

అవి తప్పనిసరి..

బయటకు వెళ్లొచ్చిన ప్రతిసారీ కాళ్లు, చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. మాస్కు, శానిటైజర్లను దైనందిన జీవితంలో భాగంగా తప్పనిసరిగా వినియోగించాలి. విందులు, శుభకార్యాలు వంటి సామూహిక కార్యక్రమాలను కొంతకాలంపాటు వాయిదా వేసుకోవడం మంచిది. అత్యవసరమైతే పరిమిత సంఖ్యలో నిర్వహించుకోవాలి. కార్యాలయాలు, ఇతర పనిప్రదేశాల్లోనూ కలిసి భోజనం చేయడం, సభలు, సమావేశాలు నిర్వహించడాన్ని నియంత్రించడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చు. కూరగాయలు, నిత్యావసర సరకుల కొనుగోలు సమయంలో విధిగా భౌతిక దూరాన్ని పాటించడం, వ్యాధి లక్షణాలున్న వ్యక్తులతో దూరంగా ఉండటం ద్వారా వైరల్‌ జ్వరాలు, అంటు వ్యాధులు ప్రబలకుండా కాపాడుకోవచ్చు. ఆస్పత్రులు, వైద్య సదుపాయాలపై ఒత్తిళ్లు పెరుగుతున్న నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలు, పౌష్టికాహారం, పరిశుభ్రతలను పాటించడం, స్వీయ నిర్బంధంలో గడపడం ద్వారా వైరస్‌ విస్తృతికి కళ్ళెం వేయొచ్చు. జీవన శైలి వ్యాధులతో బాధపడుతున్న వారు సరైన సమయంలో మందులు తీసుకోవడం, ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలను పాటించడంతో పాటు వీలైతే యోగా, ధ్యానం చేసుకోవడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా పరిరక్షించుకోవచ్చు. ఒకవేళ కొవిడ్‌ వ్యాధి నిర్ధారణ అయితే- సరైన చర్యలు చేపట్టి, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా వైద్య నిపుణుల సూచనలు పాటించడం ద్వారా కరోనా మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయవచ్చు.

-- డాక్టర్‌ జీవీఎల్‌ విజయ్‌కుమార్‌, భూ విజ్ఞానశాస్త్ర నిపుణులు.

ABOUT THE AUTHOR

...view details