మలివిడతలో కొవిడ్ విజృంభణ తీవ్రస్థాయిలో ఉంది. కాలు బయటపెడితే కరోనా భూతం ఎక్కడ విరుచుకుపడుతుందోనన్న భయం సామాన్యుల్లో పెరిగిపోతోంది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో కేసులు నమోదవుతున్నా, 'లాక్‌డౌన్' వంటి ఆంక్షల వైపు పాలకులు మొగ్గుచూపలేకపోతున్నారు. రెండోదశలో రోజూ నమోదవుతున్న కేసుల్లో దాదాపు నాలుగోవంతు మహారాష్ట్రలోనే వస్తున్నాయి. గత సంవత్సరం విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ యావత్తూ కుప్పకూలింది. రాష్ట్రాలు ఆదాయం లేక అల్లాడిపోయాయి.
అందుకే ఈసారి మళ్లీ లాక్‌డౌన్ విధించేవరకూ పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. కానీ మహారాష్ట్రలో పరిస్థితి మరీ విషమిస్తుండటంతో కఠిన ఆంక్షలు విధించక తప్పలేదంటూనే.. కొన్ని సడలింపులను ప్రకటించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయిదు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ విధించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సర్వోన్నత న్యాయస్థానం పక్కన పెట్టి ఉండొచ్చు గానీ- హైకోర్టు ఆదేశాలు ఆ రాష్ట్రంలో పరిస్థితి తీవ్రతను వెల్లడిస్తున్నాయి. అలాగని కేవలం మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లే కాదు- యావద్దేశం కరోనా కోరలమధ్య విలవిల్లాడుతోంది. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్ల కోసం వైరస్ బాధితుల బంధువులు నిరీక్షిస్తున్నారు.
కరోనా కోరల్లో రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఆస్పత్రులలో కరోనా పడకలు దొరకడం దాదాపు దుర్లభంగానే కనిపిస్తోంది. తొలి దశలో భారీస్థాయిలో ఏర్పాట్లు చేయడంతో రోగుల సంఖ్య ఎంత ఎక్కువగా వచ్చినా- వారిలో ఆస్పత్రుల్లో చేర్చాల్సిన వారందరికీ పడకలు చూపించగలిగాయి రాష్ట్ర ప్రభుత్వాలు. కానీ రెండోదశ పరిస్థితి అలా లేదు. ఒకవైపు అతి తక్కువ వ్యవధిలోనే అత్యంత ఎక్కువ సంఖ్యలో కేసులు పెరిగిపోతుండగా, ప్రభుత్వాలు చేస్తున్న ఏర్పాట్లు ఏ మూలకూ సరిపోవడం లేదు. పరిస్థితి చేయి దాటిపోయేవరకూ ఊరుకుని అప్పుడు ఆస్పత్రిలో చేరాలని ప్రయత్నించడం కూడా మరణాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత సంవత్సరం పాజిటివ్ వచ్చినవారు చాలావరకూ టెలి కన్సల్టేషన్లు తీసుకోవడం, ఆరోగ్యంపై ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే ఆస్పత్రిలో చేరడం ద్వారా త్వరగా కోలుకోగలిగారు. ఇప్పుడా టెలివైద్యం ఊసే వినిపించడం లేదు.
ఆ వెసులుబాటే కారణమా?