తెలంగాణ

telangana

ETV Bharat / opinion

పౌర స్వేచ్ఛకు విఘాతం.. సెక్షన్​ 124-ఎ

కొన్నాళ్లుగా పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, నిరసనకారులు, రైతులు తదితరులపై రాజద్రోహం కేసులు బనాయిస్తుండటంపట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆ మధ్య హరియాణాలో 100 మంది రైతులపైనా రాజద్రోహ నేరాభియోగాలు మోపిన ఘటన వెలుగు చూసింది. పౌర స్వేచ్ఛను క్రూరంగా చిదిమేయడమే లక్ష్యంగా ఐపీసీలో చొప్పించిన చట్టాల్లోకెల్లా అత్యంత పాశవికమైనదని బాపూజీ ఆనాడే ఛీత్కరించిన సెక్షన్‌ను ఇటీవలికాలంలో కొందరు గౌరవ న్యాయాధీశులూ తప్పుపట్టారు.

sedition act
రాజద్రోహం

By

Published : Jul 20, 2021, 6:54 AM IST

నిరసన తెలుపుతూ గళమెత్తడం వేరు, విద్రోహ కార్యకలాపాలకు తెగబడి శాంతిభద్రతలకు చిచ్చుపెట్టడం వేరు. ఆ రెంటికీ మధ్య అంతరాన్ని చెరిపేస్తూ అసమ్మతివాదుల నోరు నొక్కేందుకు ఐపీసీ 124-ఎ (రాజద్రోహం) నిబంధనను దుర్వినియోగపరుస్తున్న ఉదంతాలు దేశ సమకాలీన చరిత్రలో కోకొల్లలు. తిలక్‌, గాంధీజీ ప్రభృత స్వాతంత్య్రోద్యమ నేతలపై వలస పాలకులు ప్రయోగించిన రాజద్రోహ నిబంధన ఇప్పటికీ కొనసాగడమేమిటంటూ సర్వోన్నత న్యాయస్థానం సంధించిన సూటిప్రశ్న- ప్రజాస్వామ్య హితైషుల మనోగతానికి ప్రతిధ్వని.

పౌర స్వేచ్ఛకు విఘాతం..

కాలదోషం పట్టిన ఎన్నో చట్టాలను ఆవలకు నెట్టేస్తుండగా, పదేపదే దుర్వినియోగమవుతున్న 124-ఎ ఏడున్నర దశాబ్దాల స్వపరిపాలన తరవాతా కొనసాగడమేమిటని మాన్య న్యాయమూర్తులు నిగ్గదీయడంలోని అంతర ధ్వని సుస్పష్టం. కొన్నాళ్లుగా పాత్రికేయులు, సామాజిక కార్యకర్తలు, నిరసనకారులు, రైతులు తదితరులపై రాజద్రోహం కేసులు బనాయిస్తుండటంపట్ల తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆమధ్య హరియాణాలో వందమంది రైతులపైనా రాజద్రోహ నేరాభియోగాలు మోపిన ఘటన వెలుగు చూసింది.

పౌరస్వేచ్ఛను క్రూరంగా చిదిమేయడమే లక్ష్యంగా ఐపీసీలో చొప్పించిన చట్టాల్లోకెల్లా అత్యంత పాశవికమైనదని బాపూజీ ఆనాడే ఛీత్కరించిన సెక్షన్‌ను ఇటీవలికాలంలో కొందరు గౌరవ న్యాయాధీశులూ తప్పుపట్టారు. దానిపై వేటు వేస్తే అది తప్పుడు నిర్ణయమవుతుందన్న మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ భిన్నగళం విస్మయపరుస్తోంది. ఇటీవల రెండు తెలుగు వార్తాఛానళ్లపై రాజద్రోహ ఆరోపణలకు సంబంధించి స్టే ఇస్తూ, ఆ నేర పరిధుల్ని స్పష్టంగా నిర్వచించాల్సి ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇప్పుడదే న్యాయస్థానం మరో అడుగు ముందుకేసి రద్దు అంశాన్ని ప్రస్తావించిన దరిమిలా, కేంద్రం చురుగ్గా స్పందించాలి. పౌర స్వేచ్ఛకు విఘాతకరంగా పరిణమించిన 124-ఎ సెక్షన్‌తోపాటు అహేతుక నిబంధనలన్నింటిపైనా సత్వరం సముచిత కార్యాచరణను పట్టాలకు ఎక్కించడమే- న్యాయం!

ఆ స్ఫూర్తికే గొడ్డలిపెట్టు

'ప్రజల వలన ప్రజల చేత ప్రజల కొరకు'గా భాసించాల్సిన భారత పార్లమెంటరీ పరిపాలన వ్యవస్థలో సర్కారీ విధానాలను ప్రశ్నించడం, విమర్శించడం పౌరులకు ప్రజాస్వామ్యబద్ధంగా సంక్రమించిన ప్రాథమిక హక్కు. వాస్తవంలో, 124-ఎ స్వరూప స్వభావాలు ఆ స్ఫూర్తికే గొడ్డలిపెట్టు. వారంట్‌తో నిమిత్తం లేకుండా పోలీసులు నేరుగా వెళ్ళి వ్యక్తుల్ని అరెస్ట్‌ చేయడానికి, యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికి వీలు కల్పిస్తున్న ఐపీసీ సెక్షన్‌ 124-ఎను 1958లో అలహాబాద్‌ హైకోర్టు అడ్డంగా కొట్టేసింది.

నాలుగేళ్ల అనంతరం కేదారనాథ్‌ కేసులో ఆ సెక్షన్‌కు తిరిగి ఊపిరులూదిన సర్వోన్నత న్యాయస్థానమే నేడు దాని అహేతుకతను బోనెక్కించడం, ఏ మలుపులకు దారి తీస్తుందో చూడాలి. విడ్డూరం ఏమిటంటే, రాజద్రోహ చట్టానికి బ్రిటన్‌ 2009లో కొరత వేసినా, మాతృకను అనుసరించిన ఇండియాలో ఇంకా నిక్షేపంగా కొనసాగుతోంది! దేశంలో పెచ్చరిల్లుతున్న మూక దాడుల్ని అసహనాన్ని కట్టడి చేయాల్సిందిగా ప్రధానమంత్రికి లేఖ రాసిన 42 మంది ప్రముఖులపైనా రాజద్రోహం కేసులు పెట్టడమేమిటి? ఎడాపెడా బనాయిస్తున్నవాటిలో కేవలం మూడు శాతం కేసులలోనే నేర నిర్ధారణ జరుగుతున్న తీరు- ఇష్టారాజ్యంగా ఆరోపణలు మోపుతున్న వైనాన్ని కళ్లకు కడుతోంది.

రాజద్రోహ నిబంధన దన్నుతో అసమ్మతిని అణచివేస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని ఉత్తరాఖండ్‌ హైకోర్టు నిరుడిచ్చిన తీర్పు, సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యలు- ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి. ఆ మేరకు మార్పు ఎండమావిగా రుజువైతే- ఐపీసీ సెక్షన్‌ 377, ఐటీ చట్టంలోని సెక్షన్‌ 66ఎ లపై వేటు వేసిన తరహాలో రాజద్రోహ నేర ప్రకరణాన్నీ న్యాయపాలిక తుడిచిపెట్టాలి. అసమ్మతి తెలిపే హక్కును పరిరక్షించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి రక్షాకవచమై నిలవాలి!

ABOUT THE AUTHOR

...view details