కొవిడ్ రెండోదశ ఉద్ధృతి తగ్గుముఖం పడుతూ ఉండటం కొంత ఊరట కలిగిస్తోంది. మరోవైపు మూడోదశ వ్యాప్తి కమ్ముకొస్తుందంటున్న నిపుణుల అంచనాలకు తోడు- వానాకాలం కూడా మొదలు కావడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. వానాకాలం వచ్చిందంటే పారిశుద్ధ్య నిర్వహణ సవాలుగా మారుతుంది. మురుగునీటి పారుదల సమస్యలతో వ్యాధులు, విషజ్వరాలు ప్రబలడం ఏటా దేశంలో సర్వసాధారణమవుతోంది. ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు కేటాయించి, ఖర్చు చేస్తున్నా ఫలితాలు మాత్రం ఆశాజనకంగా ఉండటంలేదు. ముఖ్యంగా మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో, మహానగరాల్లోని మురికివాడల్లో, లోతట్టు ప్రదేశాల్లో కొన్ని రకాల సీజనల్ వ్యాధులు పునరావృతమవుతూనే ఉన్నాయి. 2019 జూన్‌లో ఒడిశాలోని కటక్ పట్టణంలో పారిశుద్ధ్య లోపం కారణంగా ఒకేచోట 38 మందికి పచ్చకామెర్లు సోకి తీవ్ర అస్వస్థతకు గురి కావడం తెలిసిందే.
వర్షకాలంలోనే అధికం..
సాధారణ పరిస్థితులతో పోలిస్తే వర్షాకాలంలో ప్రజలు అనేక వ్యాధికారక బ్యాక్టీరియాలు, వైరస్‌ల బారినపడే అవకాశాలు రెట్టింపవుతాయి. చల్లని వాతావరణం, అధిక తేమ శాతంతో కూడిన గాలి- వైరస్, వివిధ రకాల సూక్ష్మక్రిములు విజృంభించడానికి దోహదం చేస్తాయి. ఫలితంగా అనేక వ్యాధులు సంక్రమిస్తుంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మసంబంధిత వ్యాధులకూ ఆస్కారం ఎక్కువే. వాతావరణ మార్పుల వల్ల న్యూమోనియా, ఆస్థమా, సైనసైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరిన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు వర్షాకాలంలోనే ఎక్కువ. సాధారణంగా కలుషిత ఆహారం, నీరు తీసుకోవడంవల్ల రోగాలకు గురవుతుంటారు. వర్షాకాలంలో ప్రధానంగా దోమకాటువల్ల వ్యాధులు సోకుతున్నాయి. దోమకాటు ద్వారా సంభవించే మలేరియా, డెంగీ, చికున్ గన్యా వ్యాధులు భారత్‌లోనే అధికం.
వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా..
ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషణ ప్రకారం ప్రపంచంలోని మొత్తం డెంగీ కేసుల్లో 34శాతం, మలేరియా కేసుల్లో 11శాతం ఇండియాలోనే నమోదవుతున్నాయి. గాలి ద్వారా సంక్రమించే జలుబు, ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజా అత్యంత సులభంగా వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారత్‌లో ఇప్పటివరకు 34 లక్షల మందికిపైగా ప్రజలు కలుషిత నీటిని తాగడంవల్ల వ్యాధిగ్రస్తులయ్యారు. నీటి ద్వారా సోకే అతిసాధారణ వ్యాధులు- టైఫాయిడ్, కలరా, డయేరియా, పచ్చకామెర్లు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలవుతున్నా, నేటికీ స్వచ్ఛమైన సురక్షిత తాగునీటికి సైతం నోచుకోని ఆవాసాలు, ప్రాంతాలు, మురికివాడలు.. ఇలాంటి సీజనల్ వ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయి. దేశంలో ప్రభుత్వం ఏటా ప్రజారోగ్యం మీద వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా- క్షేత్రస్థాయిలోని దుర్భర పరిస్థితులు వ్యవస్థాగత లోపాలను కళ్లకు కడుతున్నాయి.