అంతర్జాలం ఆధారంగా మోసాలు పేట్రేగుతున్నాయి. గూగుల్, యూట్యూబ్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమ వేదికల్లో ప్రభుత్వాల పేరు ఉపయోగించుకొని రకరకాల పథకాలను విరివిగా ప్రచారంలో పెడుతున్నారు. 'ఫ్రీ లాప్‌టాప్ స్కీం', 'పీఎం స్కూటీ యోజన', 'పీఎం కిసాన్ ట్రాక్టర్ యోజన', 'పీఎం సోలార్ పానెల్ యోజన', 'పీఎం కన్యా ఆశీర్వాద్ యోజన' వంటి నకిలీ పథకాలు మోతెక్కిపోతున్నాయి.
ఉచిత వాహనాలనుంచి ఉద్యోగాల వరకు ఈ పథకాల ద్వారా పొందవచ్చని చెబుతూ అనేక పోస్టులు కనిపిస్తాయి. లేని ప్రభుత్వ పథకాలతో ఈ తరహా మోసాలు ఈ మధ్యే మొదలైనవి కావు. కానీ, కరోనా సమయంలో ఇవి బాగా పెరిగిపోయాయి. మోసగాళ్లు తప్పుడు పథకాల పేర్లతో ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించడమే కాకుండా, వారిని ఆర్థికంగానూ దెబ్బతీస్తున్నారు.
ఆనవాళ్లూ దొరక్కుండా...
తప్పుడు పథకాలతో మోసం చేసే విధానం ఒకే తరహాలో ఉంటోంది. ఉపాధి, రుణ పథకాల పేర్లతో చేసే మోసాల్లో- ప్రభుత్వ పథకం(చాలా సందర్భాల్లో అలాంటి పథకమే ఉండదు) లబ్ధిదారులుగా ఎంపికైనట్లు ప్రజల చరవాణులకు సందేశం వస్తుంది. ఆ పథకాన్ని అందుకోవాలంటే- ముందుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం కొంత రుసుము చెల్లించాలని కోరుతారు. ఆ రుసుము చెల్లించేవరకూ మోసగాళ్లు అందుబాటులోనే ఉంటారు, కానీ ఆ రుసుము కట్టగానే మాయమైపోతారు.
డిజిటల్ జాడ లేకుండా..
ఉదాహరణకు 'గ్రామ్ వికాస్ రోజ్‌గార్ యోజన' (ఒక నకిలీ ఉపాధి పథకం)ను పరిశీలిస్తే- ఆ పథకానికి సంబంధించిన ఉత్తరాలను తెలంగాణ, పంజాబ్, మేఘాలయ సహా వివిధ రాష్ట్రాలలోని గ్రామ సర్పంచ్‌లకు నేరుగా పంపించి, తమ గ్రామం నుంచి కొందరు అభ్యర్థులను ఎన్నుకొని, ఆ పథకం కింద వారిని చేర్చుకోవడానికి అభ్యర్థికి 1,200 రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ పంపమని కోరారు. అధికారులతో ధ్రువీకరించుకోకుండా చాలామంది డబ్బులు పంపారు. ఈ మోసం మొత్తం డిజిటల్ ఆనవాళ్లుగానీ, కనీసం ఫోన్ నంబర్లు గానీ లేకుండా జరిగిపోయింది. కేవలం ఉత్తరాలు, చిరునామాలు మాత్రమే మిగిలాయి.
ఈ నకిలీ పథకాల్లో తమను నమోదు చేయమని అధికారులను కోరుతూ కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల ముందు బారులు తీరారు. చాలా సందర్భాల్లో రాజకీయ నాయకులు ముందుకు వచ్చి అలాంటి ప్రభుత్వ పథకాలు ఏమీ లేవని చెప్పాల్సి వచ్చింది. ఉదాహరణకు 'పీఎం స్కూటీ యోజన' అనే నకిలీ పథకం వైరల్ అయినప్పుడు, భాజపా నాయకులు మీడియా ముందుకు వచ్చి ఆ పేరుతో కేంద్ర ప్రభుత్వ పథకమేదీ లేదని చెప్పాల్సి వచ్చింది.
చదువుకున్నవారే..
సామాజిక మాధ్యమాల్లో మత, సామాజిక, రాజకీయ వ్యవహారాలకు సంబంధించి తప్పుడు వార్తలను సృష్టించడం పెద్దయెత్తున జరుగుతోంది. ఈ తరహా తప్పుడు వార్తలు చాలామంది దృష్టినీ ఆకర్షిస్తాయి. నకిలీ వెబ్‌సైట్ లింకులు, వాట్సాప్ సందేశాలు, యూట్యూబ్ వీడియోల ద్వారా ఈ తప్పుడు పథకాలు వ్యాప్తి చెందుతుంటాయి. చదువుకున్నవారే పెద్దయెత్తున ఈ తరహ తప్పుడు ప్రచారాల బారినపడుతున్నారు. నకిలీ పథకాలకు సంబంధించిన అనేక యూట్యూబ్ వీడియోల కింద ఎంతో మంది తమ చరవాణి సంఖ్యలు, ఆధార్ నంబర్లు, బ్యాంకు ఖాతా వివరాలు వ్యాఖ్యల శీర్షికలో పొందుపరుస్తున్నారు. ఈ పథకాల కింద అనేకులు డబ్బుతోపాటు, వ్యక్తిగత గోప్యతనూ కోల్పోతున్నారు.
ఫిర్యాదుల పరిష్కార విధానం సరిగా లేకపోవడంవల్ల- మోసపోయిన వారు ఏమి చెయ్యాలో తెలియక మిన్నకుంటున్నారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోతోపాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ అవకతవకలకు సంబంధించిన నిజ నిర్ధరణ విభాగాలు ప్రారంభించాయి. అయితే వీటి విస్తృతి బాగా పరిమితం. నకిలీ పథకాలు, తప్పుడు ప్రచారాల ప్రమాదాన్ని సమర్థంగా ఎదుర్కోవాలంటే వివిధ సంస్థలు కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. సైబర్ నేరాల కట్టడికోసం ఉన్నట్లుగానే కేంద్రీకృతమైన ప్రభుత్వ పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి.
ప్రత్యేక విధానాలు అవసరం
ప్రజలు తమకు వచ్చే సందేశాల్లోని నిజానిజాలను కనుక్కొని- వాటిపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఒక 'టోల్ ఫ్రీ' నంబర్‌ను ప్రారంభించాలి. ఆ పోర్టల్‌లో ఫిర్యాదులు సంబంధిత రాష్ట్ర పోలీసు విభాగాలకు వెళ్ళేలా చూసి, మోసపూరిత చర్యలకు తక్షణం ముకుతాడు వేసేలా పోలీసు సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. ద్వేషపూరిత పోస్టులు పెట్టేవారిపై తగిన చర్యలు తీసుకోవడానికి సామాజిక మాధ్యమాలు, టెక్నాలజీ కంపెనీలు ప్రత్యేక విధానాలు తీసుకువచ్చాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేవారిని, నకిలీ పథకాల పేరిట మోసం చేస్తున్నవారిపై తగిన చర్యలు తీసుకోవడానికి ప్రత్యేక విధానాలు తీసుకురావాలి. ప్రభుత్వ వెబ్‌సైట్లను పోలిన విధంగా ఉండే అంతర్జాల వేదికలపై ఈ నకిలీ పథకాలను ప్రచారానికి పెడుతున్నారు. ఈ తంతుకు కచ్చితమైన నిఘాతోనే అడ్డుకట్ట వేయాలి. నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ పథకాల తరహాలో కనిపించే నకిలీ వెబ్‌సైట్లపై కొరడా ఝళిపించాలి.
ప్రభుత్వ పథకాల పేర్లను పోలినట్లు ఉన్న బ్యాంకు ఖాతాలపై గట్టి నిఘా తప్పనిసరి. నకిలీ పథకాలపట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని తెలియజెబుతూ ప్రభుత్వం తరచూ ప్రకటనలు ఇవ్వాలి. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఒకే దగ్గర పొందగలిగేలా ఒక వెబ్‌సైట్ ఏర్పాటు చేయాలి. అదే వెబ్‌సైట్లో అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు కల్పించాలి. ఈ 'ఫేక్' పథకాల సమస్యను ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు, మీడియా, 'ఫ్యాక్ట్-చెకింగ్' వ్యవస్థలు, స్వచ్ఛంద సంస్థలతోపాటు పౌర సమాజమూ మమేకమై పనిచేయాలి.
(రచయిత- రాకేష్ దుబ్బుడు, 'ఫ్యాక్ట్ చెక్' నిపుణులు)