దీపావళి అంటేనే భారతీయ లోగిళ్లలో వెలుగుపూలు నింపే పండగ. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు కాల్చి సందడిగా గడుపుతారు. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిలో దీపావళి రోజు రాత్రి, ఆ మరునాడు వాయుకాలుష్య సూచీలు మిన్నంటుతాయి. టపాసుల అమ్మకాలపై న్యాయస్థానాలు ప్రతిసారీ ఆంక్షలు విధించడం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వాటిని సరిగ్గా అమలు చేయకపోవడం మామూలైపోయింది. ఈసారి మాత్రం దేశ సర్వోన్నత న్యాయస్థానం విభిన్నంగా స్పందించింది. మొత్తం మతాబులన్నింటినీ నిషేధించకుండా హరిత టపాసులను (sc on ban on firecrackers) అమ్మేలా చూడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తద్వారా మామూలు టపాసుల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలని సూచించింది.
ఆరోగ్యానికి హాని
దీపావళి అంటే టపాసుల పండగగా మారిపోయిందిగానీ, దాని అసలు (climate pollution causes) ఉద్దేశం అంధకార తిమిరాన్ని జయించేందుకు దీపాల వరసలు పెట్టడం. మొదట్లో ఉప్పుపొట్లాలవంటి సాధారణ టపాసులతో మొదలైన సందడి, పోనుపోను రసాయనాల వాడకంతో వచ్చే కాంతి, శబ్దాలకు అంతా ఆకర్షితులు కావడంతో పెద్ద మతాబుల పరిశ్రమగా మారిపోయింది. రెండేళ్ల క్రితం ఇండియాలో అయిదేళ్లలోపు చిన్నారుల్లో 1.16 లక్షల మంది అకాల మృత్యువాతపడ్డారు. అందులో సగానికి పైగా మరణాలకు వాయుకాలుష్యమే కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది. కేవలం దీపావళి టపాసుల వల్లే మొత్తం వాయుకాలుష్యం సంభవిస్తోందని చెప్పలేముగానీ, అందుకు ఇదీ ఒక కారణం. టపాసుల నుంచి సల్ఫర్, నైట్రోజన్ డయాక్సైడులు, మాంగనీస్, బెరీలియం వంటి 15 రకాల విషపూరిత పదార్థాలు వెలువడతాయి. ఇవి ఊపిరితిత్తులు, గుండె, కళ్లు... ఇలా అన్ని అవయవాలపై ప్రభావం చూపుతాయి. టపాసుల నుంచి వెలువడే అతి సూక్ష్మ ధూళికణాలు (పీఎం2.5) ఆరోగ్యానికి మరింత కీడుచేస్తాయి. ఇన్ఫెక్షన్లు, అలర్జీలతో బాధపడేవారికి దీపావళి టపాసుల వల్ల కలిగే కాలుష్యం మరింత హానిచేస్తుంది. టపాసుల వల్ల వెలువడే శబ్ద కాలుష్యం గుండె సమస్యలు ఉన్నవారిని మరింత ఇబ్బందిపెడుతుంది. భారీ శబ్దాలను చిన్నపిల్లలు తట్టుకోలేరు. ఇటీవలి కాలంలో రంగురంగుల కాంతులను వెదజల్లే టపాసులు వస్తున్నాయి. అవి పేలినప్పుడు రేడియోధార్మిక పదార్థాలు వెలువడతాయి. వాటివల్ల క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. మతాబులను కాల్చే సమయంలో గర్భిణులు బయటకు రాకపోవడం మంచిదన్నది వైద్యవర్గాల సూచన. ఆ సమయంలో గాలిలోకి వెలువడే రసాయనాల వల్ల గర్భస్థ శిశువు ఎదుగుదలపైనా ప్రభావం పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
దీపావళి టపాసుల నిషేధం విషయంలో తాము ఎవరికీ వ్యతిరేకం కాదని సర్వోన్నత న్యాయస్థానం తాజాగా స్పష్టం చేసింది. కేంద్రంతో పాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తన ఉత్తర్వులను కచ్చితంగా అమలుచేయాలని పేర్కొంది. నిషేధిత టపాసులను ఎక్కడ అమ్మినా అందుకు ఆయా ప్రాంతాల పోలీసు కమిషనర్లు, సూపరింటెండెంట్లు బాధ్యులవుతారని కఠినంగా హెచ్చరించింది. దీపావళి సమీపిస్తున్న సమయంలో కాకుండా, అంతకు చాలా రోజుల ముందు నుంచే తగిన చర్యలు తీసుకుంటే టపాసులను నివారించడానికి అవకాశం దక్కుతుంది.