తెలంగాణ

telangana

ETV Bharat / opinion

రిజర్వేషన్ల నిగ్గుతేల్చనున్న సుప్రీంకోర్టు - supreme on ews reservations

ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో 10 శాతం కోటా ఇవ్వడానికి కేంద్రం, రాష్ట్రాలను అనుమతిస్తున్న 103వ రాజ్యాంగ సవరణను సుప్రీం కోర్టు పరిశీలించనుంది. అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం దీని చట్టబద్ధతను తేల్చనుంది. 1992 నాటి ఇందిరా సాహ్ని కేసులో నిర్దేశించిన 50 శాతం కోటాను 103వ రాజ్యాంగ సవరణ ఉల్లంఘిస్తుందా అనే అంశంపైనా నిర్ణయం వెలువరిస్తుంది.

SC set to review the entire gamut of quota laws
రిజర్వేషన్ల నిగ్గుతేల్చనున్న సుప్రీంకోర్టు

By

Published : Mar 14, 2021, 6:41 AM IST

ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి వివిధ పార్శ్వాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు ఇటీవల తీసుకున్న నిర్ణయం- మూడు దశాబ్దాలుగా దేశంలో అమలవుతున్న రిజర్వేషన్‌ విధానంలో విస్తృత మార్పులు తీసుకురావచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని మూడు దశాబ్దాల క్రితం ఇచ్చిన తీర్పును సమీక్షించాల్సిన అవసరం ఉందా; వెనకబడిన కులాలేవో గుర్తించడానికి రాష్ట్రాలకు ఉన్న అధికారాలను 102వ రాజ్యాంగ సవరణ అతిక్రమిస్తోందా; మరాఠాలకు కోటాలు మంజూరు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన చట్టం రాజ్యాంగ బద్ధమా కాదా- అనే అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఆర్థికంగా బలహీన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల సీట్లలో 10 శాతం కోటా ఇవ్వడానికి కేంద్రం, రాష్ట్రాలను అనుమతిస్తున్న 103వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధతను అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తేల్చనుంది. ఇందిరా సాహ్ని కేసులో నిర్దేశించిన 50 శాతం కోటాను 103వ రాజ్యాంగ సవరణ ఉల్లంఘిస్తున్నదా అనే అంశంపైనా నిర్ణయం వెలువరిస్తుంది.

పూర్వాపరాలు

మహారాష్ట్రలో బలీయమైన మరాఠా వర్గానికి ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో 16 శాతం కోటా ఇస్తున్న చట్టాన్ని కొందరు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు 2019లో సుప్రీంలో సవాలు చేసిన దరిమిలా పై అంశాలపై సమీక్ష జరగనుంది. 2019 జూన్‌లో బాంబే హైకోర్టు ఈ చట్టాన్ని సమర్థిస్తూనే ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటాను 13 శాతానికి, విద్యా సంస్థల్లో 12 శాతానికి పరిమితం చేసింది. సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన (ఎస్‌ఈబీసీ)వర్గాలకు ఈ రెండు రకాల కోటాలను ఇస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2018 నవంబరులో చట్టం చేసింది. కేవలం ఒక్క కులానికి రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇస్తున్న సమానత్వ సూత్రానికి పూర్తి విరుద్ధమని పిటిషనర్లు సవాలు చేశారు.

50 శాతానికి మించకూడదని..

జస్టిస్‌ లావు నాగేశ్వరరావు అధ్యక్షతలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2020 సెప్టెంబరులో మరాఠా రిజర్వేషన్ల చట్టం అమలుపై స్టే ఇచ్చింది. 1992నాటి ఇందిరా సాహ్నీ వెర్సస్‌ భారత ప్రభుత్వం కేసులో తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు ఈ స్టే ఉత్తర్వుకు ప్రాతిపదికగా నిలిచింది. ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో కోటాలు 50 శాతానికి మించకూడదని ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీం తీర్పు ఇచ్చింది. ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు మాత్రం ఈ పరిమితి వర్తించదని మినహాయింపు ఇచ్చింది. మరాఠాలు ఈ వర్గం కిందికి రానందున ఈ మినహాయింపు వారికి వర్తించదని 2020 సెప్టెంబరు నాటి స్టే ఉత్తర్వులో స్పష్టం చేసింది.

ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం రిజర్వేషన్లను ఇస్తున్న 103వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధతనూ సుప్రీం పరిశీలించాలని పిటిషనర్లు కోరారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ 10 శాతం కోటాను అమలు చేశాయి. దీన్ని అనుమతిస్తున్న 103వ రాజ్యాంగ సవరణ 1992లో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం కోటా పరిమితిని అతిక్రమిస్తోంది. మైనారిటీ విద్యాసంస్థల్లో తప్ప ఇతర సంస్థల్లో అన్య వర్గాలకు ప్రస్తుత రిజర్వేషన్‌ పరిమితికి మించి 10 శాతం కోటా ఇవ్వడానికి 15(6) అధికరణ కేంద్రం, రాష్ట్రాలను అనుమతిస్తున్న మాట నిజం. అలాగే 16(6) అధికరణ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్‌ వర్గానికి 10 శాతం కోటాను అనుమతిస్తోంది. దీనికి సంబంధించిన 103వ రాజ్యాంగ సవరణను జనహిత అభియాన్‌ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ కేసు కూడా సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వద్ద ఉంది. మరాఠా కోటా చట్టాన్ని సవాలు చేసిన పిటిషనర్లు 102, 103 రాజ్యాంగ సవరణల దరిమిలా 14,15,16,338బి, 342ఎ అధికరణల మధ్య పరస్పర సంబంధం ఎలా ఉంటుందో సుప్రీం పరిశీలించాల్సి ఉందన్నారు.

తీర్పు కీలకం

ఈ వ్యవహారంలో తమ అభిప్రాయాలను వ్యక్తీకరించాలని అన్ని రాష్ట్రాలను అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం కోరింది. ఏయే వర్గాలను సాంఘికంగా విద్యాపరంగా వెనకబడిన వర్గాలుగా గుర్తించవచ్చో తేల్చుకునే అధికారం, అందుకు తగిన చట్టాలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉంది. దీనికి 342ఎ అధికరణ భంగం కలిగిస్తుందా అనే ప్రశ్న సుప్రీం ముందున్నది. కాబట్టి ఈ అంశాలపై రాష్ట్రాల అభిప్రాయాలను ధర్మాసనం కోరుతోంది. జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదాను ఇచ్చే 102వ రాజ్యాంగ సవరణకు ఎలా భాష్యం చెప్పాలన్నదీ సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించాల్సి ఉంది. 1992లో ఇందిరా సాహ్ని కేసులో సుప్రీం తీర్పు వెలువడిన తరవాత అనేక రాజ్యాంగ సవరణలు, కోర్టు తీర్పులు వచ్చాయి. సమాజంలోనూ విస్తృత మార్పులు వచ్చాయి. ఈ పరిణామాల వెలుగులో ఇందిరా సాహ్ని కేసు తీర్పును సుప్రీంకోర్టు ఎలా పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరిస్తుందన్నది కీలకంగా మారింది. విద్య, ఉద్యోగాల్లో కోటాకు సంబంధించి కొత్త రాజ్యాంగ సవరణలు పరిస్థితిలో గుణాత్మక మార్పు తెచ్చాయి. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నాయకత్వంలోని అయిదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఈ వ్యవహారంపై మార్చి 15 నుంచి విచారణ మొదలుపెట్టి మార్చి 25వరకు వాదప్రతివాదాలను వింటుంది.

రాజ్యాంగ సవరణపై సమీక్ష

కేంద్ర ప్రభుత్వం 2018, 2019 సంవత్సరాల్లో చేసిన రాజ్యాంగ సవరణల చెల్లుబాటును పరిశీలించే అంశమూ సుప్రీంకోర్టు ముందు పెండింగులో ఉంది. 2018 ఆగస్టులో అమలులోకి వచ్చిన 102వ రాజ్యాంగ సవరణ జాతీయ వెనకబడిన తరగతుల సంఘం (ఎన్‌సీబీసీ)కి రాజ్యాంగ హోదా ఇచ్చింది. ఇందుకోసం రాజ్యాంగంలో కొత్తగా 338బి, 342ఎ అధికరణలను చేర్చింది. ఇదెంతవరకు రాజ్యాంగ బద్ధమనేది సుప్రీం తేల్చనున్న అంశం. విధానపరమైన ముఖ్యాంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్‌సీబీసీని సంప్రదించాలని 338బి(9) అధికరణ నిర్దేశిస్తోంది. గవర్నర్‌తో సంప్రదించిన మీదట రాష్ట్రపతి ఫలానా వర్గాలు సాంఘికంగా, విద్యాపరంగా వెనకబడినాయని నోటిఫై చేయవచ్చని 342ఎ అధికరణ పేర్కొంటోంది. 2018 ఆగస్టులో 102వ రాజ్యాంగ సవరణను ఆమోదించినప్పటి నుంచి ఏ వర్గం సామాజికంగా, విద్యాపరంగా వెనకబడినదో, ఏది అలా వెనకబడలేదో తేల్చే అధికారం రాష్ట్రపతికి దఖలు పడిందని పిటిషనర్లు పేర్కొన్నారు. 2018లో 102వ రాజ్యాంగ సవరణ తెచ్చిన తరవాత రెండు నెలలకు మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠా కోటా చట్టం చేసింది. మరాఠాలను సామాజికంగా, విద్యాపరంగా వెనకబడినవారిగా గుర్తించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పిటిషనర్లు వాదించారు.
-కె. త్రిపాఠి

ఇదీ చూడండి:ఎల్లలు దాటుతున్న భారతీయుల నైపుణ్యం

ABOUT THE AUTHOR

...view details