తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Sand Mining Effects : ఆ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున 'ఇసుక' తవ్వకాలు.. భవిష్యత్తులో తీవ్ర నష్టం తప్పదు!

Sand Mining Effects : దేశంలోని నదీ పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీరాల్లో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పర్యావరణ వ్యవస్థలకు తీరని నష్టం వాటిల్లుతోంది. వరదలు, విపత్తులు సంభవించి ప్రజల్ని కష్టాల్లో పడేస్తున్నాయి. ఇసుక వంటి సహజ వనరులను వెలికితీస్తే వాటిని పునరుద్ధరించడం కష్టం.

effects of sand mining in india
effects of sand mining in india

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 1:42 PM IST

Sand Mining Effects : మిగతా ఖనిజ వనరులతో పోలిస్తే దేశంలో అత్యధికంగా ఇసుకనే వెలికి తీస్తున్నారు. సరైన పర్యావరణ అనుమతులతోనే ఇసుక తవ్వకాలు చేపట్టేలా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నిర్దుష్ట మార్గదర్శకాలను అమలులోకి తెచ్చింది. వీటిని అమలుపరచే విషయంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. అడపాదడపా హరిత ట్రైబ్యునల్‌, సుప్రీంకోర్టులు కొరడా ఝళిపిస్తున్నా ప్రయోజనం కరవైంది. ఏపీలో పర్యావరణ అనుమతులు పొందకుండా సాగిస్తున్న ఇసుక అక్రమ తవ్వకాలను నిలిపి వేయాలంటూ ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశించింది.

అమలుకాని మార్గదర్శకాలు
Sand Mining Guidelines : ప్రస్తుతం పేదలు నిర్మించుకునే పక్కా గృహాల నుంచి పరిశ్రమలు, స్థిరాస్తి సంస్థల భారీ బహుళ అంతస్తుల భవనాలదాకా నిర్మాణాల్లో కాంక్రీటు వాడకం తప్పనిసరైంది. దాంతో నదులు, జలాశయాలు, పరీవాహక ప్రాంతాలు, సముద్ర తీరాల్లో ఇసుక తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. మితిమీరిన ఇసుక తవ్వకాల మూలాన కొన్నేళ్లుగా వరదల తాకిడి అధికమైంది. నదుల్లో కాలుష్యమూ పెరిగింది. జలాశయాలు కుంచించుకుపోవడంతో పాటు కరవు పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. మన దేశంలో మొత్తం ఖనిజ తవ్వకాల వినియోగంలో ఇసుక వనరుల వాటా 12 శాతంగా ఉంది. గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1957 ప్రకారం ఇసుకను చిన్నతరహా ఖనిజాల జాబితాలో చేర్చారు. అయిదు హెక్టార్ల విస్తీర్ణం దాటితే పర్యావరణ పరిరక్షణ చట్టం-1986 పరిధిలోని పర్యావరణ ప్రభావ మదింపు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ అయిదేళ్లక్రితం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఈ మేరకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సుస్థిర ఇసుక తవ్వకాలు, యాజమాన్య పద్ధతుల నిర్వహణ కోసం 2016లో మార్గదర్శకాలను రూపొందించింది.

తవ్వకాలు జరిగే రీచుల్లో..
Sand Mining Effects On Environment : ఇసుక, కంకర సహా చిన్న ఖనిజాల కోసం జిల్లా మేజిస్ట్రేట్‌ నేతృత్వంలో జిల్లా స్థాయిలో పర్యావరణ ప్రభావ మదింపు అథారిటీ నష్టతీవ్రతను అంచనా వేయాలి. తవ్వకాల అనంతరం నష్ట ప్రభావాన్ని తగ్గించే చర్యలు చేపట్టేలా జాగ్రత్త వహించాలి. తవ్వకాల పర్యవేక్షణకు సరిపడా సిబ్బంది లేకపోవడం, పర్యవేక్షణ క్లిష్టతరం కావడంతో మార్గదర్శకాల అమలులో రాష్ట్రాలు విఫలమవుతున్నాయి. ట్రైబ్యునల్‌ ఆదేశాల ఫలితాలపై జస్టిస్‌ ఎస్‌.వి.ఎస్‌.రాఠోడ్‌ నేతృత్వంలోని పర్యవేక్షక కమిటీ కొన్నేళ్ల క్రితమే తన నివేదికలో రాష్ట్రాల వైఫల్యాలను వెల్లడించింది. తవ్వకాల కోసం ప్రతి జిల్లాలో జిల్లా సర్వే నివేదికను జాగ్రత్తగా రూపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇసుక వనరుల వెలికితీత ప్రణాళిక, పర్యావరణ యాజమాన్య ప్రణాళికలను అమలు చేయాలని సూచించింది. తవ్వకాలు జరిగే రీచుల్లో పర్యావరణ నిపుణులతో ఏటా ఆడిట్‌ నిర్వహించి లోపాలు సవరించాలని పేర్కొంది.

అడుగడుగున అవినీతి, అక్రమాలు!
Disadvantages Of Sand Mining : ప్రకృతి వ్యవస్థలకు జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు, రాయల్టీ ఆదాయం నుంచి నిధులను కేటాయించాలని సిఫారసు చేసింది. అడుగడుగున అవినీతి, అక్రమాలు, రాజకీయ ప్రాబల్యం అధికమై ఇసుక తవ్వకాలకు సంబంధించిన మార్గదర్శకాలు, సిఫార్సులు అమలు కావడం లేదనే విమర్శలున్నాయి. ఏపీ ప్రభుత్వం గడిచిన నాలుగేళ్లలో ఇసుక తవ్వకాల కోసం రెండుసార్లు అమలులోకి తీసుకొచ్చిన విధానాలూ వివాదాస్పదమయ్యాయి. రాష్ట్రంలో నిర్దేశిత ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను ఒకే ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఈ సంస్థ పర్యావరణ సంరక్షణ చట్టం ప్రకారం అనుమతులు తీసుకోకుండా అనేక ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తుండటాన్ని ట్రైబ్యునల్‌ తీవ్రంగా పరిగణించింది. గోదావరిలో ఇసుక తవ్వకాలపై తెలంగాణ సర్కారును గతంలో హరిత ట్రైబ్యునల్‌ ఆక్షేపించింది. నిరుడు నవంబర్‌లో అనుమతులు లేకుండా తవ్వకాలు సాగిస్తున్న హరియాణాకు చెందిన మూడు సంస్థలకు హరిత ట్రైబ్యునల్‌ రూ.18కోట్ల జరిమానా విధించింది. ఈ ఏడాది జూన్‌లో గంగానదీ పరీవాహక ప్రాంతంలో అనుమతి లేకుండా ఇసుక వెలికితీస్తున్న కంపెనీకి ఉత్తర్‌ప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి రూ.4.29కోట్ల నష్ట పరిహారాన్ని విధించింది. దేశవ్యాప్తంగా నదీ పరీవాహక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండళ్ల అనుమతి లేకుండా తవ్వకాలకు అనుమతించేది లేదని ఆదేశాలివ్వడం గమనార్హం.

ప్రత్యామ్నాయాలకు ప్రోత్సాహం
Sand Mining Negative Effects : రాష్ట్ర ప్రభుత్వాలు ఇసుక తవ్వకాలను కేవలం ఆదాయ వనరుగా పరిగణించకూడదు. ప్రకృతి సమతుల్యతను పరిరక్షించే విషయంలో నిర్దేశిత మార్గదర్శకాలను కచ్చితంగా అనుసరించాలి. రెవిన్యూ, పోలీసు, నీటి పారుదల, పంచాయతీరాజ్‌ విభాగాల సిబ్బందితో ముడివడి ఉన్న ఇసుక తవ్వకాల్లో పారదర్శకతతోపాటు జవాబుదారీతనాన్ని పెంచాలి. ఇసుకకు ప్రత్యామ్నాయంగా లైమ్‌స్టోన్‌, రాగి వంటి ఖనిజ వనరుల శుద్ధి ద్వారా లభించే రాతి ఇసుక, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విడుదలయ్యే బూడిద, నిర్మాణ వ్యర్థాలు, పునర్వినియోగ ప్లాస్టిక్‌, వెదురు, కలప వంటి ప్రత్యామ్నాయ వనరులను వినియోగించవచ్చు.

అడ్డగోలు తవ్వకాల్ని పరిహరించి..
Why Is Sand Mining Bad : ఇసుకతో పోలిస్తే వీటివ్యయం ఎక్కువైనా భవిష్యత్తు దృష్ట్యా వినియోగాన్ని పెంచడం మేలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు నిర్మించే జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదార్లలో ఘనవ్యర్థాల వినియోగాన్ని పెంచాలి. ఇసుకకు ప్రత్యామ్నాయ వనరుల యూనిట్ల ఏర్పాటులో ఔత్సాహికులు, యువతను ప్రోత్సహించడం ద్వారా ఇసుక వినియోగం తగ్గించాలి. ఇసుక తవ్వకాలతో దెబ్బతిన్న నదీ పరీవాహక ప్రాంతాలు, తీర, అటవీ ప్రదేశాల పునరుద్ధరణకు కృషిచేయాలి. అక్రమ తవ్వకాల నియంత్రణలో పౌరసమాజం భాగస్వామ్యాన్ని పెంచాలి. అడ్డగోలు తవ్వకాల్ని పరిహరించి, పొదుపు పాటించేలా సర్కారీ యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి చేయాలి.

తీవ్ర దుష్పరిణామాలు
Effects Of Sand Mining In India: దేశంలోని యమున, గంగ, కావేరి, గోదావరి, కృష్ణలతో పాటు అనేక చిన్నా,పెద్దా నదీ పరీవాహక ప్రాంతాల్లో పెద్దయెత్తున ఇసుక తవ్వేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ వ్యవస్థలకు, జీవవైవిధ్య వనరులకు తీవ్ర నష్టం తప్పదు. ఇసుక వంటి సహజ వనరుల తవ్వకాల్లో సుస్థిర పద్ధతిలో పొదుపు పాటించకపోతే దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నదుల ప్రవాహ స్థితిగతులు, దిశ మారిపోయి వరదల వేళ జలప్రవాహాలు జనావాసాలపై విరుచుకుపడతాయి. భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తాయి. తవ్వకాల సమీపంలోని వంతెనలు తదితర నిర్మాణాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది. తీరంలో ఇసుక తవ్వకాలవల్ల అరుదైన జీవులు, పగడపు దిబ్బలు, సున్నితమైన తీర వ్యవస్థల మనుగడ దెబ్బ తింటుంది.

ABOUT THE AUTHOR

...view details