Russia Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రెండో ప్రపంచ యుద్ధం అనంతరం ఐరోపాలో అతిపెద్ద సంక్షోభాన్ని సృష్టించింది. 1970లలో ఐరోపా దేశాల సరిహద్దులను సర్వామోదనీయంగా నిర్దేశిస్తూ ఒప్పందాలు కుదిరాయి. ఆపైన బెర్లిన్ గోడ పతనం, సోవియట్ యూనియన్ కుప్పకూలడం తదితరాల తరవాత సరిహద్దుల్లో మళ్ళీ మార్పులు వచ్చాయి. ఇటీవలి వరకు అవి పేచీ లేకుండానే కొనసాగాయి. వాటిని ఆమోదించడానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒప్పుకోవడం లేదు. ప్రస్తుత సరిహద్దులు ప్రచ్ఛన్న యుద్ధానంతరం రుద్దినవని భావిస్తూ, వాటిని అంగీకరించబోమంటున్నారు. తమ సరిహద్దుల్లో తామే సార్వభౌములమని ఉక్రెయిన్లు తేల్చిచెబుతున్నారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని డొనెత్స్క్, లుహాన్స్క్‌లను 2014లో రష్యా అనుకూల వేర్పాటువాదులు అదుపులోకి తీసుకోవడం ప్రస్తుత సంక్షోభానికి బీజం వేసింది. బొగ్గు క్షేత్రాలతో సుసంపన్నమైన ఆ రెండు ప్రాంతాలను 18వ శతాబ్దిలో జార్ చక్రవర్తుల ఏలుబడిలోని రష్యా సొంతం చేసుకుంది. ఇప్పుడు ఏకంగా ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తినా అమెరికా, నాటో కూటమి ప్రత్యక్షంగా జోక్యం చేసుకోలేకపోతున్నాయి. అమెరికా తన మిత్రులను ఏ మేరకు ఆదుకోగలదో తాజా సంక్షోభం బయటపెడుతోంది. మరోవైపు, మాస్కోపై ముసురుకొంటున్న ఆంక్షలు ప్రపంచార్థికంపై విస్తృత ప్రభావం చూపనున్నాయి.
గోధుమల నుంచి చమురు వరకు
కొవిడ్ గడ్డు కాలాన్ని తట్టుకోవడానికి వివిధ దేశాల ప్రభుత్వాలు ఉద్దీపన కార్యక్రమాలకు భారీగా ధన వ్యయం చేశాయి. అదిప్పుడు ద్రవ్యోల్బణానికి దారితీస్తోంది. కొవిడ్ కాలంలో విచ్ఛిన్నమైన సరఫరా గొలుసులు నేటికీ పూర్తిగా పునరుద్ధరణ కాలేదు. గోరుచుట్టుపై రోకటి పోటులా ఇంతలోనే ఉక్రెయిన్ సంక్షోభం వచ్చిపడింది. యుద్ధం ఎంత కాలం సాగితే ప్రపంచానికి అంతగా ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. వేగంగా యుద్ధాన్ని ప్రారంభించి, అంతే వడిగా తాను అనుకున్నది సాధించి, సమరాన్ని ముగించేయాలని పుతిన్ ఆశించి ఉండవచ్చు. కానీ, కదనాన్ని మొదలుపెట్టడమే తన చేతుల్లో ఉంటుంది తప్ప అది ఎప్పటికి ముగుస్తుందనేది అనూహ్యమని ఆయనకు త్వరలోనే అవగతం కావచ్చు. చరిత్రలో ఇలాంటి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. యుద్ధం దీర్ఘకాలం సాగితే రష్యాతో పాటు ఐరోపా దేశాలూ ఆర్థికంగా నష్టపోతాయి.
రష్యా, ఉక్రెయిన్‌లు ప్రపంచంలోనే అతిపెద్ద గోధుమ ఎగుమతిదారులు. ప్రపంచవ్యాప్త అతిపెద్ద చమురు, సహజవాయు ఉత్పత్తిదారుల్లో రష్యా ముఖ్యమైనది. ఐరోపా చమురు, గ్యాస్ అవసరాల్లో సగభాగం రష్యా ద్వారానే తీరుతున్నాయి. జర్మనీకి గ్యాస్ సరఫరాలను పెంచడానికి ఉద్దేశించిన నార్డ్‌స్ట్రీమ్-2 పైపులైను నిర్మాణం పూర్తయినా తాజా సంక్షోభం వల్ల అది మూలన పడిపోయింది. రష్యా నుంచి పలు ఐరోపా దేశాలకు గ్యాస్ తీసుకెళ్ళే పైపులైన్లు ఉక్రెయిన్ భూభాగం మీదుగానే నిర్మితమయ్యాయి. యుద్ధం వల్ల అంతర్జాతీయ గోధమ ధరలు ఇప్పటికే పది శాతం పెరిగాయి. రష్యా, ఉక్రెయిన్ గోధుమ ఎగుమతుల్లో ఇరవై శాతం ఇంకా నౌకలకు ఎక్కలేదు. ఐరోపా గోధుమ, బార్లీ, మొక్కజొన్న అవసరాలు ప్రధానంగా ఉక్రెయిన్ ద్వారానే తీరుతున్నాయి. ఇంకా ఇండొనేసియా(30 లక్షల టన్నులు), ఈజిప్ట్(24 లక్షల టన్నులు), టర్కీ(15 లక్షల టన్నులు), పాకిస్థాన్(11 లక్షల టన్నులు) వంటివి ఉక్రెయిన్ గోధుమలను పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటున్నాయి.