Russia Ukraine Crisis: రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ గొంతుపై కత్తిపెట్టి మరీ చర్చలు జరిపి డిమాండ్లను సాధించుకొనేందుకు సిద్ధమైన క్రెమ్లిన్- ఆ దేశంపై దాడులు చేసేందుకు అవసరమైన బలగాలను క్రిమియా, బెలారస్ సరిహద్దులకు తరలించింది. ఆ మోహరింపులు ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో నాటో కూటమి నిర్వహించిన అతిపెద్ద యుద్ధ విన్యాసాలైన 'రీఫోర్జర్' కంటే పెద్దవి.
ఆ పరిణామాలను విశ్లేషించిన అమెరికా ఫిబ్రవరి 16 నుంచి ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలవుతాయని ప్రకటించింది. దానికి ఒక రోజు ముందు పాక్షిక సైనిక విరమణను ప్రకటించిన రష్యా- అమెరికా ప్రచారాన్ని తప్పుగా నిరూపించే యత్నం చేసింది. మరోవైపు రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. రష్యా మాటలు, చేతలను పాశ్చాత్య దేశాలు విశ్వసించడంలేదు. అతి త్వరలోనే ఉక్రెయిన్‌పై క్రెమ్లిన్ దాడికి దిగే ప్రమాదం ఉందని తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు.
తిరుగుబాటుదారులకు సహకారం
ప్రస్తుతం నాటో విస్తరణ మాస్కోను అధికంగా భయపెడుతోంది. అటు ఐరోపా సమాఖ్యతో, ఇటు రష్యాతో సరిహద్దు పంచుకొనే ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే- భవిష్యత్తులో క్రిమియాను సైతం చేజార్చుకోవాల్సి వస్తుందన్నది పుతిన్ భయం.
వాస్తవానికి ఉక్రెయిన్ రష్యాలో భాగమేనని గతేడాది క్రెమ్లిన్ అధికారిక వెబ్‌సైట్‌లో రాసిన వ్యాసంలో పుతిన్ స్పష్టం చేశారు. 2014లో క్రిమియా విలీనం సమయంలోనే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన డాన్‌బాస్‌లో (దొనెట్క్స్, లుహాన్స్క్) వేర్పాటువాదాన్ని క్రెమ్లిన్ ప్రోత్సహించింది. అక్కడ హింసకు ముగింపు పలికేందుకు 2015లో బెలారస్ రాజధాని మిన్స్క్‌లో ఉక్రెయిన్, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు చర్చలు జరిపి ఒక ఒప్పందానికి వచ్చారు. మిన్స్క్ ఒప్పందాన్ని ఉక్రెయిన్, మాస్కోలు వేర్వేరుగా అన్వయించుకోవడం సమస్యకు మూలంగా నిలుస్తోంది. ఆ రెండు ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని మాస్కో డిమాండు చేస్తోంది. కొన్ని నామమాత్రపు అధికారాలు కేటాయించి తిరిగి డాన్‌బాస్ ప్రాంతంపై పట్టు సాధించడానికి ఆ ఒప్పందం ఉపయోగపడుతుందని ఉక్రెయిన్ భావిస్తోంది.
మరోవైపు ఉత్తర క్రిమియా కాల్వకు నీటి సరఫరాను ఉక్రెయిన్ తొక్కిపట్టడం క్రెమ్లిన్‌కు ఆగ్రహం కలిగించింది. క్రిమియాలో తగిన జల వనరులు లేవు. దాంతో రష్యాలోని నీపెర్ నది నుంచి ఉక్రెయిన్ మీదుగా ‘ఉత్తర క్రిమియా కాల్వ’ ద్వారా నీటిని తరలిస్తారు. 2014 తరవాత నీటి సరఫరాలో ఉక్రెయిన్ సమస్యలు సృష్టించడంతో క్రిమియాలో కరవు పరిస్థితి నెలకొంది.
ఉక్రెయిన్‌కు మద్దతు గురించి యోచించడానికి సైతం మిత్రదేశాలు భయపడేలా చేసేందుకే పుతిన్ తాజాగా సైనిక మోహరింపులు చేపట్టారని ర్యాండ్ కార్పొరేషన్‌కు చెందిన రాజకీయ విశ్లేషకులు శామ్యూల్ అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లోని తిరుగుబాటుదారులను బలోపేతం చేయడం, నాటో-అమెరికాను అడ్డుకోవడం పుతిన్ ప్రధాన లక్ష్యాలుగా కనిపిస్తోంది. ఈ క్రమంలో గత డిసెంబరులో బైడెన్‌తో జరిగిన భేటీలో పుతిన్ పలు డిమాండ్లను బయటపెట్టారు.
తూర్పు ఐరోపాలో నాటో కార్యకలాపాలను నిలిపివేసి 1997 నాటి స్థితికి నాటో వెళ్లాలని; పోలండ్, రొమేనియాల్లో మోహరించిన క్షిపణులను తొలగించాలని రష్యా కోరింది. ఇష్టం ఉన్నా లేకపోయినా, మిన్స్క్ ఒప్పందం ప్రకారం దొనెత్స్క్, లుహాన్స్క్ ప్రాంతాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని క్రెమ్లిన్ డిమాండు చేసింది. పైగా సరిహద్దు ఇవతలి నుంచి తిరుగుబాటుదారులకు సహకారం అందిస్తోంది. ఈ చర్యలు ఉక్రెయిన్‌లోని తిరుగుబాటుదారులు మరిన్ని ప్రాంతాలను ఆక్రమించేందుకు దారులు తెరవవచ్చు.