ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర రెండో ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీస్తోంది. దీనివల్ల ప్రపంచీకరణ, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక మార్పులకు లోనుకానున్నాయి. చరిత్రలో మొదటి ప్రపంచీకరణ 1600-1815 సంవత్సరాల మధ్య కాలంలో సంభవించింది. ఇది అనేక యుద్ధాలు, సంఘర్షణలను కొనితెచ్చింది. రెండోదశ ప్రపంచీకరణ 1870లలో ప్రారంభమై మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమయ్యే వరకు నడిచింది. ఇక 1980లలో ప్రారంభమైన మూడోదశ ప్రపంచీకరణకు కొవిడ్, ఉక్రెయిన్ యుద్ధం తెరదించుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం మూలంగా రెండో ప్రచ్ఛన్న యుద్ధం మొదలవుతుందని, అది క్రమంగా నాలుగో దశ ప్రపంచీకరణకు దారితీస్తుందని నిపుణుల అంచనా.
ఇంతకుముందే కొవిడ్ వల్ల సరఫరా గొలుసులు విచ్ఛిన్నమై, అన్ని దేశాల్లో ఆర్థికాభివృద్ధి కుంటువడింది. దానివల్ల ప్రపంచార్థికంలో వ్యవస్థాపరంగా పెను మార్పులు సంభవించాయి. ప్రపంచం వీటి నుంచి తేరుకుని మళ్ళీ వృద్ధి బాట పట్టడానికి చాలా సమయం పడుతుంది. ప్రపంచీకరణ, జాతీయ అంతర్జాతీయ ఘర్షణ పరిస్థితులు, వస్తుసేవల కొరతలు, పెరిగే వడ్డీరేట్లు, ద్రవ్యోల్బణం, సాంకేతిక మార్పులు, సామాజిక, ఆర్థిక, రాజకీయ మథనాల వల్ల గతంలో కూడా వ్యవస్థాపరంగా తీవ్ర మార్పులు వచ్చాయి. ప్రస్తుతం పాశ్చాత్య దేశాలతోపాటు ఆసియాలోనూ మళ్ళీ ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయి. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన 30 సంవత్సరాల బాండ్లపై వడ్డీ రేట్లు గడచిన మూడు నెలల్లోనే 1.5శాతం పెరిగాయి. 1970ల తరవాత ఇంతటి పెరుగుదల ఎన్నడూ లేదు. 2021 జనవరితో పోల్చినా అమెరికా బాండ్లపై వడ్డీ రెట్టింపు అయింది. రాగల దశాబ్దాల్లో ప్రపంచం వివిధ రకాల వ్యవస్థాపరమైన మార్పులు చవిచూడనుంది.
సాంకేతికత ప్రభావం:కొవిడ్ కాలంలో ప్రజల ఆదాయాలు తరిగిపోయి, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపారాలు దివాలా తీయగా- బడా కంపెనీల లాభాలు మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడం కీలక పరిణామం. 2021లో అమెరికా కంపెనీల లాభాలు 1950ల తరవాత ఎన్నడూ లేనంత గరిష్ఠ స్థాయిని అందుకున్నాయి. దీనికి సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులే కారణం. అమెరికాలో రోబోల వినియోగం ఏడాదికి 30శాతం చొప్పున పెరుగుతోంది. ఇప్పుడు చిన్న కంపెనీలు సైతం రోబోలను లీజుకు ఇస్తున్నాయి. కొంత ఫీజుపై ఆటొమేషన్ సేవలను అందించే ధోరణి పెరుగుతోంది. రోబోటిక్స్, ఆటొమేషన్ వల్ల అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్‌లలో సిబ్బంది ఉత్పాదకత, కంపెనీల లాభదాయకత పెరుగుతున్నాయి. అసలు రోబోలే వినియోగంలో లేని 2015తో పోలిస్తే నేడు దక్షిణ కొరియా, సింగపూర్‌లలో ప్రతి 100 మంది కార్మికులకు ఆరు నుంచి పది రోబోలు రంగంలో ఉన్నాయి. ఒకప్పుడు ఆధునిక టైప్ రైటర్‌గా మాత్రమే పరిగణన పొందిన కంప్యూటర్ నేడు ప్రధాన పనిముట్టు అయింది. దీనికి ఇంటర్నెట్ తోడై ఎక్కడి నుంచైనా పని చేసే వెసులుబాటు ఏర్పడింది. డిజిటల్ చెల్లింపులు, ఈ-కామర్స్, బ్లాక్ చెయిన్ ఆధారిత క్రిప్టో కరెన్సీలు, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, 6జీ వంటి అత్యాధునిక టెక్నాలజీలు ప్రపంచ దిశ, దశలను మార్చేస్తున్నాయి. కొత్త ప్రపంచంలో నెగ్గుకురావాలంటే కొత్త సాంకేతికతలు నేర్చుకోవలసిందే. ఈ రంగాల్లో చైనా, దక్షిణ కొరియా, అమెరికాలు వేగంగా దూసుకెళుతున్నాయి. భారతదేశం ఆ వేగాన్ని అందుకోవాలి.
తీవ్రమవుతున్న ఆహార కొరత:మొదట కొవిడ్, తాజాగా ఉక్రెయిన్ యుద్ధం- ప్రపంచమంతటా చమురు, ఆహార ధాన్యాలు, వ్యాపార సరకుల ఉత్పత్తి, సరఫరా తీరును మార్చేస్తున్నాయి. ప్రపంచీకరణను వెనక్కుతిప్పే ధోరణి డొనాల్డ్ ట్రంప్ హయాములోనే మొదలై తాజాగా మరింత ఊపందుకుంది. యుద్ధం, ఆంక్షల వల్ల రష్యా, ఉక్రెయిన్‌ల నుంచి ఆహార ఎగుమతులు నిలిచిపోవడంతో ప్రపంచమంతటా ఆహారం, దాణా ధరలు రెండేళ్ల క్రితంతో పోలిస్తే 40శాతం పెరిగాయి. ఇవి ఇంకా 8-22శాతం మేర పెరుగుతాయని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) హెచ్చరించింది. ఉక్రెయిన్‌లో యుద్ధంవల్ల శీతాకాల పంటలు 20-30 శాతంవరకు దెబ్బతిన్నాయి. అంటే, ఇప్పటికే ఏర్పడిన ఆహార కొరత మరింత తీవ్రమై పేదల ఆకలి కేకలు మిన్నంటనున్నాయి. రష్యా చమురు ఎగుమతులపై ఆంక్షలు ప్రపంచ విపణికి చమురు సరఫరాను దెబ్బతీస్తున్నాయి. కర్బన ఉద్గారాలకు, తద్వారా భూతాపానికి దారితీసే చమురు, బొగ్గు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, హరిత ఇంధనాలకు మళ్ళాలని ప్రపంచం కంకణబద్ధమవుతున్న వేళ ఉక్రెయిన్ యుద్ధం వచ్చి అంతా తలకిందులు చేసేస్తోంది. ప్రపంచ దేశాలు రానున్న మూడు నాలుగేళ్లపాటు ఆర్థిక వ్యవస్థలను చక్కదిద్దుకోవడానికే ప్రాధాన్యమిచ్చి, వాతావరణ మార్పుల నిరోధ కృషిని పక్కనపెట్టవచ్చు. దీనివల్ల భూఉష్ణోగ్రత మరింత పెరిగిపోతుంది. ఫలితంగా ధ్రువాల్లో మంచు కరగడంతో సముద్ర మట్టాలు పెరిగి తీరప్రాంత నగరాలను ముంచెత్తనున్నాయి. ఆ నగరాల్లోని 753 విమానాశ్రయాలు ముంపునకు గురై పనికిరాకుండా పోతాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. భూతాప నివారణకు ఎలెక్ట్రిక్ వాహనాలు ఉపకరిస్తాయనే నమ్మకం బలంగానే ఉన్నా, ఈ వాహనాల వల్ల కొత్త రకం సమస్యలు పుట్టుకొస్తాయి. ఈ వాహనాల్లో వాడే బ్యాటరీల కాలం తీరిపోయాక, వాటిని పర్యావరణానికి హాని చేయని రీతిలో ఎలా వదిలించుకోవాలనేది పెద్ద చిక్కు ప్రశ్న. ఎలెక్ట్రిక్ వాహనాలకు అవసరమైన అరుదైన లోహాలను వెలికితీసి బ్యాటరీలు, ఇతర విడిభాగాలను తయారుచేయడమనేది ఎంతో ఖరీదైన వ్యవహారమే కాదు... కాలుష్య కారక కార్యక్రమం కూడా!
అమెరికా ఆధిపత్యానికి తెర?:గత ప్రచ్ఛన్నయుద్ధ కాలంలో ప్రపంచం అమెరికా, సోవియట్ కూటములుగా విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రారంభం కానున్న రెండో ప్రచ్ఛన్నయుద్ధంలో అమెరికా, దాని మిత్రదేశాలు ఒకపక్క; రష్యా, చైనా, వాటి మిత్రులు రెండో పక్క మోహరించనున్నాయి. ఇది ప్రపంచమంతటా ఉద్రిక్తతలు, పరోక్ష యుద్ధాలు పెరగడానికి కారణమవుతుంది. నేడు ప్రపంచంలో అత్యధిక ఆంక్షలకు గురైన దేశం రష్యాయే. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి రష్యా పాలకులు కొత్త దుస్సాహసాలకు తెగించే ప్రమాదం ఉంది. చైనా కూడా భారత సరిహద్దు వెంబడి మరింత దూకుడుగా వ్యవహరించే ముప్పూ ఉంది. 1990లలో సోవియట్ యూనియన్ కుప్పకూలిన తరవాత నుంచి నిన్నమొన్నటి వరకు అమెరికా ఎదురులేని అగ్రరాజ్యంగా నిలిచింది. రెండో ప్రచ్ఛన్న యుద్ధంవల్ల అమెరికా ఆధిపత్యానికి తెరపడవచ్చు. మరోవైపు తిరిగి రగలనున్న ఘర్షణ పరిస్థితుల వల్ల ఆయుధ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లనుంది. ఇది ప్రధానంగా ఆయుధ దిగుమతులపై ఆధారపడిన భారతదేశంపై తీవ్ర ఆర్థిక భారం మోపనున్నది. మేక్ ఇన్ ఇండియా పథకం కింద స్వదేశంలో ఆయుధోత్పత్తిని పెంచడం భారత్‌కు అత్యావశ్యకం.
ఇదీ చూడండి:Ukraine Crisis: రష్యా క్షిపణుల ప్రయోగం.. నేలమట్టమైన భవనాలు 13 మంది మృతి