తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Rural Debt: రుణగ్రస్తం.. గ్రామీణ భారతం!

భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను, కొవిడ్‌ వల్ల పరిస్థితులు తీవ్రతరమైన తీరును ఇటీవలే పలు నివేదికలు వెలుగులోకి తెచ్చాయి. ఆ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే దేశం ఆర్థికంగా మరింత పతనమయ్యే ప్రమాదం ఉంది. భారతీయ గ్రామీణ ప్రజలు (India's Debt) అప్పులపాలైపోయారని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలు తేల్చిచెప్పాయి. ప్రజలు అప్పుల (Rural Debt) ఊబి నుంచి బయటపడాలంటే దేశార్థికం వేగంగా తేరుకుని పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలి. వారి చేతిలో డబ్బు ఆడకపోతే వస్తుసేవలకు గిరాకీ పడిపోయి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడప్పుడే పైకి లేవలేని దుస్థితి ఏర్పడుతుంది.

By

Published : Oct 26, 2021, 5:06 AM IST

Rural Debt
indian economy

దేశంలో ఇటీవల మూడు కీలక పరిణామాలు సంభవించాయి. అవి- ఇండియాలో అమెరికన్‌ కార్ల కంపెనీ ఫోర్డ్‌ తన దుకాణాన్ని మూసివేయడం (Ford Company Closed in India); జాతీయ నమూనా సర్వే కార్యాలయం (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) నిర్వహించిన అఖిల భారత రుణాలు, పెట్టుబడుల సర్వే (ఏఐడీఎస్‌-2019) విడుదల; గ్రామాల్లో వ్యవసాయ భూకమతాలపై మరొక ఎన్‌ఎస్‌ఎస్‌ఓ నివేదిక వెల్లడి. ఆ మూడింటికీ సంబంధం లేనట్లు కనిపించినా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను, కొవిడ్‌ వల్ల పరిస్థితులు తీవ్రతరమైన తీరును అవి వెలుగులోకి తెచ్చాయి. ఆ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే దేశం ఆర్థికంగా మరింత అధోగతిలోకి జారిపోయే ప్రమాదం ఉంది. భారతీయ గ్రామీణ ప్రజలు (Rural Debt) అప్పులపాలైపోయారని ఎన్‌ఎస్‌ఎస్‌ఓ సర్వేలు తేల్చిచెప్పాయి. ప్రజలు అప్పుల ఊబి నుంచి బయటపడాలంటే దేశార్థికం వేగంగా తేరుకుని పెద్దయెత్తున ఉపాధి అవకాశాలు సృష్టించాలి. వారి చేతిలో డబ్బు ఆడకపోతే వస్తుసేవలకు గిరాకీ పడిపోయి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడప్పుడే పైకి లేవలేని దుస్థితి ఏర్పడుతుంది. ఇండియాలో తమ కార్లకు గిరాకీ తగ్గిపోవడం వల్లనే అక్కడ ఉత్పత్తి కార్యకలాపాలను మూసివేస్తున్నామని ఫోర్డ్‌ కంపెనీ ప్రకటించింది. భారతీయుల కొనుగోలు శక్తి క్షీణించిందనడానికి అదే నిదర్శనం.

అరకొర ఆదాయాలతో సతమతం

ప్రజలు ఆదాయం పెంచుకోవడానికి అప్పులు చేస్తే అది వారి భవిష్యత్తుకు, దేశ ఆర్థికాభివృద్ధికి మేలు చేస్తుంది. కానీ, దేశంలో 60శాతం రుణ గ్రహీతలు ఆదాయం పెంపునకు కాకుండా ఇళ్లు కొనడానికి, వస్తుసేవల వినియోగానికి అప్పులు చేశారని ఏఐడీఎస్‌ వెల్లడించింది. 2012లో గ్రామీణ కుటుంబ సగటు రుణాలు రూ.32,522; అవి 2019కల్లా రూ.74వేలకు ఎగబాకాయి. పలు రాష్ట్రాల్లో గ్రామీణులు సంస్థాగత రుణాలతోపాటు వడ్డీ వ్యాపారుల నుంచీ రుణాలు తీసుకోక తప్పడం లేదు. బ్యాంకులు, సహకార సంస్థల ద్వారా రుణాలిస్తే

సామాన్యులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళాల్సిన అగత్యం తప్పుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వాలు చేపడుతున్న పథకాల వల్ల ప్రయోజనం ఉండటం లేదు. పల్లె ప్రజలు ఎక్కడపడితే అక్కడ అప్పులు చేయనిదే కుటుంబం నడవని పరిస్థితి ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. వాళ్ల అరకొర సంపాదనలో సింహభాగాన్ని వడ్డీ వ్యాపారుల కిస్తీలకు ధారపోయాల్సి వస్తున్నందువల్ల వస్తుసేవల కొనుగోలుకు చేతిలో ఏమీ మిగలడం లేదు. వస్తు గిరాకీ, వినియోగం తగ్గిపోయినప్పుడు ఉత్పత్తి మందగిస్తుంది. ఉపాధి అవకాశాలు కోసుకుపోతాయి. కొవిడ్‌ సమయంలో ఆసుపత్రి ఖర్చుల కోసం అప్పులు చేయక తప్పని అగత్యం నెలకొంది. పిల్లల చదువులు, గృహ నిర్మాణం కోసం అప్పులు చేయడం ఎటూ ఉన్నదే. దేశ జనాభాలో దిగువ శ్రేణికి చెందిన 70శాతం ఇప్పటికే గరిష్ఠ స్థాయిలో రుణాలు తీసుకున్నారని రిజర్వు బ్యాంకు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక వారికి కొత్తగా అప్పులు చేసే స్తోమత లేదు. కొవిడ్‌ వల్ల దెబ్బతిన్న దేశార్థికం మళ్ళీ కోలుకొని ఉపాధి అవకాశాలు, వ్యాపారాలు గణనీయంగా పెరిగితేనే జనం చేతిలో డబ్బు ఆడి, అప్పుల నుంచి బయటపడగలుగుతారు. కొవిడ్‌ కాలంలో ఉద్యోగాలు కోల్పోయిన లక్షల మంది మళ్ళీ ఇంతవరకు ఉద్యోగాల్లో కుదురుకోలేదు. గతంలో పనుల కోసం పట్టణాలకు వలస వెళ్ళినవారిలో రెండు నుంచి అయిదు కోట్లమంది కొవిడ్‌ దెబ్బకు మళ్ళీ పల్లెలకు తిరిగివచ్చారు. వారందరికీ ఉపాధి చూపగల శక్తి వ్యవసాయ రంగానికి లేదు. ఉన్న పనుల కోసం పోటీ ఎక్కువై వేతనాలు పడిపోయాయి. పట్టణాల నుంచి తిరిగివచ్చిన వారు వ్యవసాయేతర పనులు చేసుకుంటూనో, కోళ్లు పశువుల పెంపకం ద్వారానో జీవనం గడపాల్సి వస్తోంది. చిన్నాచితకా పనులు, అరకొర ఆదాయాలతో గ్రామీణులు సతమతమవుతున్నారు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలో గిరాకీ తగ్గిపోయింది.

ఉపాధి పెరిగితేనే...

ద్విచక్ర వాహన విక్రయాలు తగ్గడం- దేశార్థిక స్థితిగతులకు సంబంధించి ఒక కీలక సంకేతం. ఈ ఏడాది జులైకన్నా ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు తక్కువగా ఉండటానికి ఒక కారణం- మోటారు వాహన విక్రయాలు పడిపోవడమే. సాధారణంగా గ్రామీణులు, మధ్యతరగతివారు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు కొంటారు. జీఎస్టీ కింద పన్నులు పెరగడమూ గిరాకీ తగ్గడానికి కారణమవుతోంది. గడచిన పదేళ్లలో పేదరికం నుంచి బయటపడిన వారిలో 20శాతం కొవిడ్‌ వల్ల మళ్ళీ పేదలుగా మారారు. మరో 20శాతం ప్రజలకు ఆదాయాలు కోసుకుపోయాయి. ఫలితంగా వారందరి కొనుగోలు శక్తి క్షీణించి భారతీయ విపణికి తీరని నష్టం సంభవిస్తోంది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారే ఎక్కువగా అప్పులు తీసుకున్నారని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. కొవిడ్‌ కాలంలో ఆదాయాలు క్షీణించడం, ఆసుపత్రి ఖర్చులు పెరగడం వంటి కారణాలతో వారు వినియోగాన్ని తగ్గించుకున్నారు. ఫలితంగా గిరాకీ, ఉత్పత్తి తగ్గిపోయి వృత్తి ఉపాధులు తిరిగి పుంజుకోలేకపోతున్నాయి. వ్యక్తుల స్థాయిలో జరుగుతున్న నష్టాన్ని భర్తీ చేయడానికి ప్రభుత్వం పూనుకోవాలి. మౌలిక వసతుల కల్పనకు, ఉత్పత్తి, ఉపాధి పెంచడానికి ఎక్కువ నిధులు వెచ్చించాలి. కానీ, ప్రభుత్వాలు ఆ పని చేయకుండా ఓట్ల కొనుగోలుకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల మీద ఆధారపడుతున్నాయి. ఈ పద్ధతికి ఇకనైనా స్వస్తి చెప్పాలి. అప్పులు చేసి ఉత్పత్తి పెంచితే, రేపు ఆ రుణాలను తీర్చగల ఆర్థిక స్తోమతను సంపాదించవచ్చు. వ్యక్తులకు, ప్రభుత్వాలకు సమంగా వర్తించే ఆర్థిక సత్యమిది!

కుంచించుకుపోతున్న భూకమతాలు

ఒకవైపు గ్రామాల్లో అప్పుల భారం పెరుగుతుంటే మరోవైపు భూకమతాల విస్తీర్ణం తరిగిపోతోంది. 2003లో సగటు భూకమత విస్తీర్ణం 1.79 ఎకరాలైతే- 2019లో అది 1.26 ఎకరాలకు తగ్గిపోయింది. ఒక హెక్టారు (సుమారు 2.47 ఎకరాలు) కన్నా తక్కువ భూకమతాలు 69.6శాతం నుంచి 76.5శాతానికి చేరుకున్నాయి. వ్యవసాయదారుల జనాభాలో చిన్నకారు, సన్నకారు రైతులే ఎక్కువ. 2003లో 80.4 శాతంగా ఉన్న ఈ వర్గం రైతులు 2019లో 85.8 శాతానికి పెరిగారు. మొత్తం రైతుల్లో కౌలుదారుల వాటా 9.9శాతం నుంచి 17.3 శాతానికి చేరింది. భూములు ఉన్న రైతులు పిల్లల చదువులు, వృత్తివ్యాపారాల కోసం పట్టణాలకు వలస పోతున్నారు. వారి పొలాలను కౌలుకు ఇస్తుండటంతో ఈ వర్గం రైతుల సంఖ్య పెరిగింది. కౌలుకు విత్తనాలు, ఎరువుల వంటి ఉత్పత్తి సాధనాల ఖర్చునూ కలిపితే సాగు వ్యయం గతంకన్నా పెరిగినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ఓ గణాంకాలు సూచిస్తున్నాయి. అవి కొవిడ్‌ విరుచుకుపడటానికి ముందు, 2018-19లో సేకరించినవని గ్రహిస్తే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. కొవిడ్‌ దెబ్బకు పరిస్థితి మరింత దిగజారి ఉంటుందనడంలో సందేహం లేదు.

-డాక్టర్ ఎస్. అనంత్

(రచయిత- ఆర్థిక, సామాజిక రంగ నిపుణులు)

ఇదీ చూడండి:ఆదాయం చాలదు... రుణం తీరదు!

ABOUT THE AUTHOR

...view details