జాతి ఆత్మ పల్లెపట్టుల్లో ఉందంటూ గ్రామ స్వరాజ్యంతో భావి భారత భాగ్యోదయాన్ని స్వప్నించారు మహాత్మాగాంధీ. పేరుగొప్ప పంచవర్ష ప్రణాళికలు గ్రామీణ వికాసానికి తగిన వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమైపోగా, పొట్టచేత పట్టుకొని పట్టణాలకు అభాగ్యుల వలసలు పోటెత్తడంతో- నగరాలూ నరకానికి నకళ్లుగా మారిపోతున్నాయి. 2011లో 121 కోట్లుగా ఉన్న దేశ జనాభా 2036నాటికి మరో పాతిక శాతం పెరిగి 152 కోట్లకు చేరుతుందని, అప్పటికి పట్టణవాసుల సంఖ్య 31.8నుంచి 38.2 శాతానికి పెరుగుతుందని జాతీయ జనాభా సంఘం సారథ్యంలోని సాంకేతిక బృందం తుది నివేదిక పేర్కొంది.
2011-21 దశాబ్దంలో జనాభా పెరుగుదల రేటు అత్యల్పంగా 12.5 శాతంగాను, తదుపరి దశాబ్దిలో మరింత తగ్గి 8.4శాతంగానూ నమోదవుతుందన్న నివేదిక- 2031లో జన సంఖ్యపరంగా ఇండియా చైనాను అధిగమిస్తుందని అంచనా వేస్తోంది. 2011-36 నడిమికాలంలో మొత్తం జనాభా 31.1 కోట్లు పెరిగితే, పట్టణ జన సంఖ్యలో ఎదుగుదలే 21.8 కోట్లు ఉంటుందన్న నివేదికాంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2036నాటికి కేరళ, తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రల్లో నగరీకరణ 50శాతం మించిపోతుందని, ఆంధ్రప్రదేశ్‌లో 2011లో 30.6శాతంగా ఉన్న పట్టణ జనాభా అప్పటికి 42.8 శాతానికి చేరుతుందన్నది నివేదిక సారాంశం.
గ్రామాల్లో నిస్తేజం..
కేవలం రెండు శాతం భూభాగానికే పరిమితమైన నగరాలూ పట్టణాలు స్థూల దేశీయోత్పత్తిలో 70శాతం సమకూరుస్తూ ప్రగతికి చోదకశక్తులుగా ఎదిగాయన్నది వాస్తవం. అదే సమయంలో సరైన ప్రణాళిక లేకుండా అడ్డదిడ్డంగా పెరిగిపోతున్న నగరాలు భారీ మురికివాడలకు నెలవవుతున్న నేపథ్యంలో వాటి రూపాంతరీకరణకు స్మార్ట్ సిటీ ప్రాజెక్టు వంటి పథకాల ద్వారా కేంద్రం వ్యయీకరించాలనుకొన్న మొత్తం నాలుగు లక్షల కోట్ల రూపాయలు. అంతంత భూరి మొత్తాలు వెచ్చించినా ఏటికేడు పోటెత్తే జనాభా అవసరాల్ని బట్టి అవి కొరగాకుండా పోయే ప్రమాదం దృష్ట్యా- తక్షణం పట్టాలకెక్కాలి ప్రత్యామ్నాయ ప్రణాళికలు!