తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Rupee Internationalisation RBI : రూపాయి అంతర్జాతీయీకరణ సాధ్యమేనా?

Rupee Internationalisation RBI : డాలర్‌.. ప్రపంచ దేశాల అంగీకారం పొందిన కరెన్సీ. ఇది సురక్షితమైనదనే విశ్వాసం అన్ని దేశాల్లో ఏర్పడింది. ఇటీవలి కాలంలో అమెరికా ఇతర దేశాలపై విధిస్తున్న ఆంక్షలతో పరిస్థితులు మారే అవకాశం కనిపిస్తోంది. ఇక మీదట డాలరుపై ఆధార పడటం అంతగా శ్రేయస్కరం కాదని పలు దేశాలు భావిస్తున్నాయి. భారత్‌ కూడా ఇదే బాటలో నడవాలని యోచిస్తోంది. మరి, మన రూపాయి అంతర్జాతీయీకరణకు జరుగుతున్న ప్రయత్నాలు సఫలమవుతాయా?

Rupee Internationalisation RBI
Rupee Internationalisation RBI

By ETV Bharat Telugu Team

Published : Sep 20, 2023, 1:02 PM IST

Rupee Internationalisation RBI : ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ వాణిజ్య చెల్లింపులు అమెరికా డాలర్లలోనే కొనసాగుతున్నాయి. సుమారు 90 శాతం దాకా విదేశ మారక లావాదేవీలు డాలర్లలోనే జరుగుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలవద్ద పోగుపడిన విదేశ మారక నిల్వల్లో 60 శాతం డాలర్ల రూపంలోనే ఉన్నాయి. ప్రపంచ దేశాలకు డాలర్ల అవసరం పెరిగినప్పుడల్లా, దాని మారకపు విలువ పెరుగుతోంది. ఆ ప్రభావం భారత్‌తోపాటు ఇతర దేశాల వాణిజ్య, దేశీయ మారక నిల్వలపై పడుతోంది. ఫలితంగా తమ స్థానిక కరెన్సీని అధిక పరిమాణంలో చెల్లించుకోవాల్సి వస్తోంది. దీని వల్ల ఆయా దేశాల నిల్వలు కూడా తరిగి పోతున్నాయి. ఈ కారణం వల్లే చాలా దేశాలు తమ విదేశీ వాణిజ్యం విషయంలో డాలరు ఆధిపత్యం నుంచి బయటపడి ఇతర మార్గాలను వెదుక్కునే పనిలో పడ్డాయి.

స్థానిక కరెన్సీలో వాణిజ్యం
అంతర్జాతీయ చెల్లింపుల ప్రక్రియలో 2013-19 మధ్యకాలంలో స్థానిక కరెన్సీల వినియోగం పెరిగింది. ఫలితంగా 2013-22 మధ్యకాలంలో రోజువారీ వాణిజ్యంలో డాలరు వినియోగం స్వల్పంగా మాత్రమే అధికమైంది. వర్ధమాన దేశాలకు సంబంధించి డాలరేతర కరెన్సీ రూపంలో వాణిజ్యం విశేషంగా పెరిగింది. ప్రస్తుతం చైనా-రష్యాల నడుమ సుమారు 70శాతందాకా వాణిజ్యం యువాన్‌ రూబుల్‌లో జరగడమే ఇందుకు తార్కాణం.

ప్రధాని మోదీ ఇటీవలి యూఏఈ పర్యటనలో ఇరు దేశాల వాణిజ్యం స్థానిక కరెన్సీలో జరగడానికి వీలుకల్పించేలా ఒప్పందం కుదిరింది. ఈ విషయంలో శ్రీలంక ఇప్పటికే తన సంసిద్ధతను ప్రకటించింది. త్వరలో ఇండొనేసియా కూడా ఈ ప్రక్రియలో చేరనుంది. ఈ క్రమంలోనే స్థానిక కరెన్సీ బాండ్ల మార్కెట్‌ కూడా త్వరితగతిన వ్యాప్తి చెందుతోంది. స్థానిక కరెన్సీని, స్థానిక కరెన్సీ బాండ్లను వినియోగించినంత మాత్రానే డాలరు విలువ, దాని పాత్ర తగ్గుతుందని చెప్పలేము.

భారత్‌ తన విదేశీ వాణిజ్యాన్ని, లావాదేవీలను రూపాయల్లో అభివృద్ధి చేసుకొనే క్రమంలో 2015లో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రాన్ని గుజరాత్‌లో కొత్తగా నిర్మిస్తున్న ‘గిఫ్ట్‌ సిటీ’లో ఏర్పాటు చేసింది. రష్యాతో వాణిజ్యాన్ని రూపాయల్లో జరపడానికి వీలుగా ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరుచుకోవడానికి భారత్‌ అనుమతించింది. 2013లోనే ఇలాంటి ప్రతిపాదనను రిజర్వు బ్యాంకు తీసుకొచ్చింది. ఈ ఏర్పాటు వల్ల ఇరుదేశాలకు లావాదేవీల ప్రక్రియలో అయ్యే ఖర్చులు తగ్గుతాయి. ధరల పారదర్శకత పెరుగుతుంది. సమయమూ ఆదా అవుతుంది. వాణిజ్య ప్రక్రియ సరళతరమవుతుంది.

విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల నుంచి దేశంలోకి చెల్లింపుల ప్రక్రియ సులభతరమవుతుంది. తాజాగా 2023 నూతన విదేశీ వాణిజ్య విధానం కూడా రూపాయల్లో వాణిజ్యానికి ప్రాధాన్యం కల్పించింది. భారత్‌ తన కరెన్సీని అంతర్జాతీయ మారకంగా తీర్చిదిద్దడానికి, తన కరెన్సీపై డాలరు మారకపు విలువలో ఎదురయ్యే ప్రతికూల కదలికల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి వీలుగా ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.

రూపాయి అంతర్జాతీయీకరణ సుసాధ్యం కావాలంటే అంతర్జాతీయ వాణిజ్యం, లావాదేవీలన్నీ రూపాయల్లోనే జరగాలి. ప్రపంచ మిగులు రూపాయల్లోగాని, రూపాయి విలువతో కూడిన ప్రభుత్వ బాండ్లలోగాని ఉండాలి. ప్రస్తుతం ఇవన్నీ డాలర్లలో ఉన్నాయి. అంతర్జాతీయీకరణ విజయవంతంగా కొనసాగాలంటే ముందుగా మన విదేశ వాణిజ్యం ఇతర దేశాలతో సమతౌల్యం సాధించాలి. అవతలి దేశంకన్నా అధికంగా ఉన్నా పర్వాలేదు కానీ వాణిజ్య లోటు ఉండకూడదు.

గతంలో ఇరాన్‌తో విదేశీ వ్యాపారంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య సమతుల్యత ఉండేది. ఇరాన్‌ నుంచి ముడిచమురును రూపాయలు చెల్లించి భారత్‌ కొనుగోలు చేస్తే, బదులుగా ఇరాన్‌ ఆ రూపాయలతో భారత్‌ నుంచి ఇతర సరకులు కొనుగోలు చేసేది. అంతర్జాతీయీకరణ వ్యవహారంలో మరో కీలక అంశం- రూపాయికి పూర్తిస్థాయిలో మార్చుకొనే అవకాశం ఉండాలి. అంటే రూపాయిని పూర్తిగా బంగారం కిందగాని, లేదంటే ఇతర కరెన్సీలోకిగాని మార్చుకొనే వెసులుబాటు కల్పించాలి. ఇది మన రూపాయికి పాక్షికంగా మాత్రమే ఉంది. పర్యాటకం, ప్రయాణం, విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లో మాత్రమే రూపాయిని డాలర్లలోకి మార్చుకొనే వీలుంది.

స్థిరత్వమే కీలకం
అంతర్జాతీయీకరణ ప్రక్రియలో మరో ముఖ్యాంశం- రూపాయి మారకపు విలువ ఎల్లప్పుడూ స్థిరంగా కొనసాగాలి. అంతేగాని ఒక్కసారిగా పడిపోవడం, ఆకస్మికంగా పెరగడం జరగకూడదు. రూపాయి మారకపు విలువ ఒక్కసారిగా క్షీణిస్తే- రూపాయి నిల్వలున్న దేశాలు నష్టపోతాయి. అంటే విదేశీ ప్రభుత్వాల్లో మన కరెన్సీపై పూర్తిస్థాయి విశ్వాసం, నమ్మకం ఉండాలి. ఇలాంటి సమస్యలను అధిగమించగలిగితేనే మన రూపాయి అంతర్జాతీయీకరణ సులభ సాధ్యమవుతుంది. భారత్‌ 2030 నాటికి ఎగుమతులను రెండు లక్షల కోట్ల డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకొంది. అది నెరవేరాలంటే రాబోయే ఏడేళ్ల కాలంలో అత్యధిక వృద్ధిరేటును సాధించాలి. దీనితోపాటు, రూపాయికి పూర్తిస్థాయిలో మార్చుకొనే అవకాశాన్ని, సామర్థ్యాన్ని సాధించాల్సి ఉంటుంది.

రష్యాతోనూ లోటు
రష్యాతోనూ భారత్‌ వాణిజ్యం లోటుతోనే కొనసాగుతోంది. రష్యా నుంచి ముడిచమురు చౌకగా దిగుమతి చేసుకోవడం మొదలు కావడంతో ఈ లోటు మరింతగా విస్తరించింది. రష్యా నుంచి రక్షణ పరికరాలను కూడా భారత్‌ భారీగా దిగుమతి చేసుకొంటోంది. ఫలితంగా మాస్కో వద్ద భారీ స్థాయిలో మన రూపాయలు పోగుపడ్డాయి. అందుకని, రష్యాతో భారత్‌కు రూపాయి వాణిజ్య ఒప్పందం కుదిరినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. రష్యాకు సైతం మనదేశం డాలర్లలోనే చెల్లించాల్సి వస్తోంది.

Sovereign Gold Bonds : సావరిన్​ గోల్డ్ బాండ్​ సబ్​స్క్రిప్షన్ షురూ.. మీరూ ఇన్వెస్ట్ చేస్తారా?

స్టాక్ మార్కెట్​ ఆల్​ టైమ్​ రికార్డ్.. దలాల్​ స్ట్రీట్​లో సంబరాలు

ABOUT THE AUTHOR

...view details