తెలంగాణ

telangana

ETV Bharat / opinion

బిహార్​ బరి: 'కోసీ'పై 'బాహుబలి' పట్టు నిలిచేనా? - చేతన్​ ఆనంద్​

బిహార్​ ఎన్నికలు దగ్గరపడ్డాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ ప్రణాళికలు సిద్ధం చేసుకుని.. ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. మాస్ రాజకీయాలకు, పోటీలో బలమైన నాయకులు నిలబడే ఒరవడికి వేదికగా నిలిచే బిహార్​ రాజకీయాల్లో.. ఓ ప్రాంతానికి ప్రత్యేకత ఉంది. అర్థ బలం, అంగ బలగం, సామాజిక వర్గాల సమీకరణలు.. వీటితో ఇద్దరు నేతలు ఆ ప్రాంతాన్ని దశాబ్దాలుగా ఏలేస్తున్నారు. ఏంటా ప్రాంతం? ఎవరా నేతలు?

Bihar politics
బిహార్​ బరి: కోసి ప్రాంతాన్ని ఏలేసిన అంగ-అర్థ బలం !

By

Published : Oct 16, 2020, 5:42 PM IST

కోసీ... బిహార్​లోని ఒక ప్రాంతం. ఇతర ప్రాంతాల్లానే ఇక్కడా ఎన్నికలు జరుగుతున్నా.. పట్టు మాత్రం ఇద్దరు బడా నేతలకే సొంతం. ముఠా రాజకీయాలకు వేదకగా ఉన్న కోసీలో రాజ్యాంగబద్ధ ఎన్నికలపై ఈ ఇద్దరు రాజకీయ బాహుబలుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంటుంది. వారిలో ఒకరు ఆనంద్ మోహన్. మరొకరు పప్పూ యాదవ్​.

రాజకీయ ముఠాల ప్రభావం..

డబ్బు, పరపతి, బలగం, కులం.. ఇవి బిహార్​ రాజకీయాల్లో ఎన్నో ఏళ్లుగా కీలకాంశాలు. ఇవన్నీ ఉన్న బలమైన నేతలు వారి ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. పార్టీలు సైతం వీరిని చేర్చుకునేందుకు, టికెట్లు ఇచ్చేందుకు ఉత్సాహం చూపిస్తాయి. ఇప్పుడు కాస్త మార్పొచ్చినా... 80వ దశకంలో బిహార్​ రాజకీయాలు వీరికి స్వర్గధామంలా ఉండేవి. గెలిస్తే నియోజకవర్గాల పాలనకే పరిమితం కాకుండా.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేసే విధంగా వ్యవహరించేవారు. అంతటితో ఆగకుండా ఇతర నేతల భవిష్యత్తు శాసించేవి ఈ రాజకీయ మాఫియా ముఠాలు.

వీరిరువురిదే హవా..

ఈ తరహా రాజకీయాల్లోంచే 1980వ దశకంలో ఉద్భవించారు.. ఆనంద్​ మోహన్​, పప్పూ యాదవ్​. కోసీ ప్రాంతంలో వీరిరువురి హవా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలను, ప్రత్యర్థులను హడలెత్తించే స్థాయిలో రాజకీయ బీభత్సం సృష్టించి అధికారం అనుభవించిన నేతలు వీరిరువురు. ఆనంద్​ మోహన్​ కోసిలో గుత్తాధిపత్యం చెలాయిస్తే.. పప్పూ యాదవ్​ సహర్స, మధేపుర, పూర్ణియా ప్రాంతాల్లో కీలకంగా ఉండేవారు.

లాలూ ప్రసాద్​ యాదవ్, నితీశ్ కుమార్​, రామ్ విలాస్ పాసవాన్​ వంటి నేతల మద్దతుతో రాజకీయాలు, ఎన్నికల్లోనూ వీరి ప్రభావం స్పష్టంగా కనిపించేలా చేసుకున్నారు. మొదట్లో నేతలకు అండగా నిలబడేవారు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వీరే అడుగుపెట్టారు.

ప్రత్యక్ష రాజకీయాల్లోకి..

ఆనంద్​ మోహన్​ సింగ్​, అనతికాలంలోనే చాలా ప్రభావవంతమైన నేతగా ఎదిగారు. ఒకానొక దశలో లాలూ సైతం ఆనంద్​ మోహన్​ ఇలాఖాలో పర్యటించాలంటే ఆలోచించేవారు. అంతలా ఆ ప్రాంతాన్ని తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారు. అయితే, తర్వాత రాజకీయ చదరంగంలో పడి ప్రాభవం కోల్పోయారు.

1983లో ఆనంద్ మోహన్​ మొదటిసారిగా 3నెలలు కటకటాల పాలయ్యారు. తర్వాత 1990లో మహేశీ నియోజవర్గం నుంచి ఘన విజయం సాధించారు. జనతా దళ్​ టికెట్​పై ఆయన బరిలోకి దిగారు. అనంతరం, ఆ పార్టీలో ఇమడలేక.. బిహార్ పీపుల్స్​ పార్టీ స్థాపించారు. తర్వాత దశలో జార్జి ఫెర్నాండెజ్​, నితీశ్​ కుమార్ నాయకత్వంలోని సమతా పార్టీతో చేతులు కలిపారు. అప్పటి నుంచి రాజకీయాల్లో పరపతి పెంచుకున్న ఆయన.. మండల్​ కమిషన్​ తర్వాత రాజకీయాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు మార్చుకున్నారు. బలమైన నాయకులతో మైత్రి బంధం కొనసాగించారు.

మలుపు తిప్పిన హత్యకేసు..

గొపాల్​గంజ్​ జిల్లా కలెక్టర్ కృష్ణయ్య హత్యకేసులో ఆనంద్​ సూత్రధారిగా ఉన్నారు. నాటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్​.. ఆనంద్​ మోహన్ జైలుకెళ్లటంలో కీలకంగా వ్యవహరించారు. ఉత్తర బిహార్​లో పార్టీని బలోపేతం చేయటమే లక్ష్యంగా లాలూ వ్యవహరించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఆనంద్​ మోహన్​, 1996 ఎన్నికల్లో జైలు నుంచే లోక్​సభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం అతలాకుతలమైంది.

జిల్లా పాలనాధికారి హత్య కేసులో.. 2007లో ఆనంద్​కు మరణ శిక్ష పడింది. ఆ తర్వాత పట్నా హైకోర్టు దీనిని యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గించింది. ఈ వ్యవహారంలో లాలూ కీలకంగా వ్యవహరించారు. అయితే, రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరు. ఆనంద్​ మోహన్​ కుటుంబం తర్వాత లాలూ కుటుంబానికి విధేయంగా మారింది. శత్రుత్వం మరిచి సత్ససంబంధాలు నెరుపుతున్నారు.

ఆర్​జేడీలో కుటుంబం..

ప్రస్తుత శాసనసభ ఎన్నికల్లో.. ఆనంద్​ మోహన్​ కుటుంబం ఆర్​జేడీ నుంచి పోటీ చేస్తోంది. ఆయన సతీమణి, మాజీ ఎంపీ లవ్లీ ఆనంద్​ సహర్స స్థానంలోంచి బరిలోకి దిగగా.. కుమారుడు చేతన్​ ఆనంద్​ శివహర్ సీటు దక్కించుకున్నారు. నాడు కక్షలు, ప్రతీకారాలతో రగిలిపోయిన కుటుంబాలు నేడు కలిసి పోటీ చేస్తున్నాయి.

తండ్రిని జైలులోంచి బయటకు తీసుకురావటమే లక్ష్యంగా.. చేతన్ ఆనంద్​ ఏ పార్టీతోనైనా జట్టు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.

మారిన సమీకరణలు

ప్రస్తుతం బిహార్​ రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుత ఎన్నికల్లో కోసీ ప్రజల తీర్పు ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి మంత్రం జపిస్తున్నందున.. ఈ ప్రాంతంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పప్పూ యాదవ్ కొత్త పార్టీతో పోటీలోకి దిగారు.

అయితే ఇప్పటికీ.. రాష్ట్ర ఎన్నికల్లో డబ్బు, పరపతి విలువ వెలకట్టలేనిదే. ఈ నేపథ్యంలోనే సామాజిక వర్గాలు, ప్రాంతీయ సమీకరణల ప్రభావం ఎలా ఉంటుందనేది నవంబర్​ 10న ఫలితాల తర్వాత తేలనుంది.

మొత్తంగా, రాజకీయాల్లో కుటుంబాల మధ్య వైరం... సమయం సందర్భం బట్టి మారిపోతుంది. విజయ తీరాలకు చేరాలంటే మిత్రులనూ కలుపుకునిపోవాలనే సూత్రం.. ఎన్నికల్లో విజయ మంత్రంలా నిలుస్తుంది. వీటి లాభనష్టాల గురించి మాత్రం కాలమే సమాధానం చెబుతుంది.

ఇదీ చూడండి: బిహార్​ బరి: 'రాబిన్​ హుడ్'​​ ప్రభావమెంత ?

ఇదీ చూడండి: బిహార్‌ ఎన్నికల్లో జోస్యాలపైనా ఈసీ నిషేధం

ABOUT THE AUTHOR

...view details