ఫ్లోరైడ్ వంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే, ఉపరితల జల వనరులను వినియోగించడమే శ్రేష్ఠమని కేంద్ర జలశక్తి సంఘం గతంలోనే సూచించింది. ఆ మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సుదూర ప్రాంతాల్లోని నదీజలాలను నగరాలకు తరలించి శుద్ధి చేసి అందిస్తున్నాయి. కానీ, ఆయా నదుల్లో చేరుతున్న కాలుష్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. దేశంలో సుమారు 20 నదీ పరీవాహక ప్రాంతాలు భార లోహాల కాలుష్య కోరల్లో ఉన్నాయి. ఫలితంగా వాటిపై ఆధారపడ్డ వృక్ష, జంతుజాతుల మనుగడ ప్రశ్నార్థకమవుతున్నదని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (ఐయూసీఎన్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎనిమిది భార లోహాలను విషపూరితమైనవిగా అమెరికా పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రకటించింది. అందులో సీసం, క్రోమియం, ఆర్సెనికం, జింకు, కాడ్మియం, రాగి, పాదరసం, నికెల్ ఉన్నాయి. ఇవి తక్కువ మోతాదుల్లో పర్యావరణంలో కలిసినా జీవజాలం, మొక్కలపై తీవ్ర దుష్పరిణామాలు తప్పవు. ఈ ప్రభావాలను గుర్తించే నదీజలాల్లో వీటి మోతాదు తెలుసుకునేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) దేశంలో ప్రధాన నదులపై 531 ప్రాంతాల్లో నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. గంగానదీ పరీవాహక ప్రాంతం పరిధిలో 145 కేంద్రాలతో పర్యవేక్షిస్తోంది.
ఇలాంటి కేంద్రాలు గోదావరి పరిధిలో 39, కృష్ణా పరిధిలో 36 ఉన్నాయి. సీడబ్ల్యూసీ నివేదిక ప్రకారం-447 ఉపరితల నీటి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల నుంచి 2,959 నమూనాలు సేకరించి పరీక్షిస్తే.. 287 ప్రదేశాల్లోని నీటిలో మోతాదుకు మించి భార లోహాలున్నట్లు తేలింది. 101 నమూనాల్లో రెండు భారలోహ ధాతువులు అధిక మొత్తంలో ఉన్నట్లు గుర్తించింది. సాధారణంగా అన్ని నదుల్లో కనిపించే కాలుష్య కారక లోహం ఇనుముగా తేల్చింది. ఆ తరవాతి స్థానంలో ఆర్సెనికం, జింకు, సీసం, కాడ్మియం, నికెల్, క్రోమియం వంటి విషప్రభావం కలిగినవి ఉన్నాయి.
నదుల్లోకి చేరుతున్నదిలా..
నిరంతర గనుల తవ్వకం, కాగితం, తోలు శుద్ధి, బ్యాటరీల పరిశ్రమలు, వ్యవసాయ సంబంధ రసాయనిక ఎరువుల విచ్చలవిడి వినియోగం, గృహ మురుగు నీటి వ్యర్థాల వల్ల ఈ ధాతువులు నదుల్లోకి చేరుతున్నాయి. వీటివల్ల భూమి సారం కోల్పోయి, మొక్కల్లో ఆహార గొలుసు దెబ్బతింటుంది. ఒక టన్ను రాగి ఉత్పత్తి చేసేందుకు చేపట్టే తవ్వకాలతో అంతకు మూడు రెట్ల వ్యర్థాలు వెలువడుతున్నట్లు జాతీయ సైన్స్ అకాడమీ ఒక అధ్యయనంలో వెల్లడించింది. ఉపరితల గనుల తవ్వకం భూగర్భ తవ్వకాలతో పోల్చితే ఎనిమిది రెట్ల వ్యర్థాలకు కారణమవుతోంది.