తెలంగాణ

telangana

By

Published : Aug 3, 2020, 7:18 AM IST

ETV Bharat / opinion

జోరెత్తుతున్న ఎన్​పీఏలు.. ఆర్​బీఐ ముందున్న సవాళ్లు

కరోనా వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంది. బ్యాంకింగ్​ వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే బ్యాంకుల్లో నిరర్థక ఆస్తులు (ఎన్​పీఏ) 10 శాతానికి పైగా ఉండగా.. 2021 నాటికి 15 శాతానికి చేరవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. ఎన్‌పీఏలు పెరిగి, మూలధన నిష్పత్తి తగ్గి, బ్యాంకుల మూలధన వితరణ సామర్థ్యం క్షీణిస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్​పీఏలపై ప్రత్యేక కథనం.

Rising non-performing assets in the banking sector have become a challenge for the RBI
జోరెత్తుతున్న ఎన్​పీఏలు.. ఆర్​బీఐ ముందున్న సవాళ్లు

కొవిడ్‌ మహమ్మారి సృష్టిస్తున్న మహోత్పాతం వల్ల దేశ ఆర్థికరంగ సంక్షోభం మరింత తీవ్రస్థాయికి చేరింది. బ్యాంకింగ్‌ రంగంలో నిరర్థక ఆస్తుల(ఎన్‌పీఏల) విస్ఫోటం సంభవించనుందన్న అంచనాలను ఆర్‌బీఐ తాజా ఆర్థిక స్థిరత్వ నివేదిక సైతం ధ్రువీకరించింది. గత ఆర్థిక సంవత్సరంలో 8.5శాతం ఉన్న వాణిజ్య బ్యాంకుల ఎన్‌పీఏలు 12.5శాతం దాకా పెరుగుతాయని అంచనా వేసింది. స్థూల నిరర్థక ఆస్తులు 14.7శాతం దాకా పెచ్చరిల్లవచ్చనీ హెచ్చరించింది. 2019-20లో పీఎస్‌బీల స్థూల ఎన్‌పీఏలు 11.3శాతం ఉండగా మార్చి 2021నాటికి 15.2శాతానికి చేరవచ్చని నివేదిక చెబుతోంది. ఎన్‌పీఏలు పెరిగి, మూలధన నిష్పత్తి తగ్గితే బ్యాంకుల రుణ వితరణ సామర్థ్యం కుంగడంతోపాటు కొన్ని బ్యాంకుల మూలధన నిష్పత్తి బాసెల్‌ నిబంధనల కంటే దిగువకు పడిపోవచ్ఛు అలాంటి బ్యాంకులు మూలధనాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. పీఎస్‌బీలకు ప్రభుత్వమే మరో విడత మూలధనం సమకూర్చాల్సిన పరిస్థితి రావచ్ఛు

బ్యాంకుల తటపటాయింపు

రిజర్వుబ్యాంకు ఎప్పటికప్పుడు బ్యాంకుల రుణ వితరణ సామర్థ్యాన్ని పెంచి మార్కెట్లో నిధుల లభ్యతకు భంగం కలగకుండా చర్యలు తీసుకొంటున్నప్పటికీ ఇంకా బ్యాంకులు రుణ వితరణ వైపు దృష్టి సారించడం లేదు. అందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. మొదటిది- బ్యాంకుల అనాసక్తి. ఒకవైపు పారుబాకీలు, మరోవైపు విలీనాల కారణంగా కొత్త రుణాలకు బ్యాంకులు దూరంగా ఉంటున్నాయి. రెండోది- కొవిడ్‌ వల్ల రుణ గిరాకీ పతనం. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్‌బీఎఫ్‌సీల) పారుబాకీలూ అనూహ్యంగా పెరుగుతున్నాయి. చిన్న, మధ్య స్థాయి (రేటింగ్‌ తక్కువగా ఉన్నవి) ఎన్‌బీఎఫ్‌సీలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. 2015నుంచి బ్యాంకుల ఎన్‌పీఏలు ఏటికేడు పెరుగుతూ 2018 మార్చి నాటికి రూ.10లక్షల కోట్లకు చేరాయి! 2019 మార్చి నాటికి స్వల్పంగా తగ్గి రూ.9,49,279 కోట్లకు దిగివచ్చాయి. గతేడాది నుంచి బ్యాంకుల పారుబాకీలు తగ్గుముఖం పడుతున్నాయనుకున్న సమయంలో కొవిడ్‌ మహమ్మారి విరుచుకుపడింది. సుదీర్ఘ లాక్‌డౌన్‌ వల్ల రుణగ్రహీతలు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఉత్పన్నమైంది. ఫలితంగా పారుబాకీల సమస్య తీవ్రస్థాయికి చేరింది.

పారుబాకీల విస్ఫోటనాన్ని తప్పించాలంటే ఆర్‌బీఐ బహుముఖ వ్యూహంతో ముందుకెళ్ళాలి. రుణ చెల్లింపులపై ఆర్‌బీఐ రెండు విడతలుగా ఆరునెలల మారటోరియం విధించింది. ఆగస్టు 30తో ఇది ముగియనుంది. చిరుద్యోగులకు రుణ చెల్లింపులు భారం కాకుండా ఇది ఉపశమనాన్ని ఇచ్చింది. అదే సమయంలో బ్యాంకుల నిరర్థక ఆస్తులు పెరగకుండా ఈ చర్య కొంతవరకు నివారిస్తుంది. ఆగస్టు 30 తరవాత పరిస్థితి ఏమిటన్నదే అసలు ప్రశ్న! వైరస్‌ విజృంభణ ఆగకుంటే ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడే అవకాశం ఉంది. అందువల్ల అధికశాతం రుణగ్రహీతలకు చెల్లింపులు భారంగా మారతాయి. అప్పుడు పారుబాకీలు పెచ్చరిల్లుతాయి. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే రిజర్వుబ్యాంకు కొన్ని అసాధారణ చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం రిజర్వుబ్యాంకు ముందు మూడు ప్రత్యామ్నాయాలున్నాయి. ఒకటి ఎన్‌పీఏ నిబంధనలను సడలించడం. రెండు మారటోరియాన్ని మార్చి 2021దాకా పొడిగించడం. మూడు రుణ పునర్‌ వ్యవస్థీకరణ పథకాలను ప్రవేశపెట్టడం.

నిబంధనలు సడలించాలి

నిరర్థక ఆస్తుల నిబంధనలను సడలించే అంశాన్నీ ఆర్‌బీఐ పరిశీలించాలి. ఒకప్పుడు 180 రోజుల వరకు చెల్లింపులు లేకుంటే ఆ రుణ ఖాతాను నిరర్థక ఆస్తిగా పరిగణించేవారు. ఆ నిబంధనను కఠినతరం చేసి 90రోజులకు కుదించారు. ఈ నిబంధనలను సరళతరం చేసే దిశగా అడుగులు పడాలి. 90రోజుల నిబంధనను 180 రోజులకు పెంచాలి. ఆర్థిక వ్యవస్థ కుదుటపడి తిరిగి వృద్ధిబాట పడితే 90రోజుల నిబంధనను అప్పుడు తీసుకురావచ్ఛు మారటోరియం గడువును 2021 మార్చిదాకా పొడిగించే అంశాన్ని ఆర్‌బీఐ పరిశీలించాలి. 2018 ఫిబ్రవరిలో ఉపసంహరించిన రుణ పునర్‌ వ్యవస్థీకరణ పథకాలను పునఃప్రవేశపెట్టాలి. ముఖ్యంగా కార్పొరేట్‌ రుణాలను నిబంధనల మేరకు పునర్‌వ్యవస్థీకరించినట్లైతే కొంతమేర పారుబాకీల పెరుగుదలను అరికట్టవచ్ఛు గతంలో వ్యూహాత్మక రుణ పునర్‌ వ్యవస్థీకరణ(ఎస్‌డీఆర్‌), స్కీమ్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ స్ట్రక్చరింగ్‌ ఆఫ్‌ స్ట్రెస్డ్‌ అసెట్స్‌, కార్పొరేట్‌ రుణ పునర్‌ వ్యవస్థీకరణ (సీడీఆర్‌) వంటి పలురుణ పథకాలను బ్యాంకులు అమలు చేశాయి. అవి పారుబాకీల సమస్యకు పరిష్కారాన్ని చూపలేకపోయాయి. కేవలం రుణఖాతాలు పారుబాకీలుగా మారకుండా కొంతకాలం ఆపగలిగాయి. ఈ చర్యలను ఆర్బీఐ యుద్ధప్రాతిపదికన చేపట్టాలి. లేకుంటే బ్యాంకులు కొత్తగా రుణాలు అందించే స్థితికి చేరలేవన్నది నిర్వివాదం!

రచయిత- తుమ్మల కిశోర్​, బ్యాంకింగ్‌ రంగ నిపుణులు)

ఇదీ చూడండి:సోనీ నుంచి మరో ఆల్ఫా​ కెమెరా- ధర ఎంతంటే..

ABOUT THE AUTHOR

...view details