ఇటీవలి కాలంలో రెండు కీలక పరిణామాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం కనిపిస్తోంది. ఒకటి-దేశానికి ఆర్థికంగా ఆయువుపట్టు అయిన రాష్ట్రాల్లో మళ్ళీ పెరుగుతున్న కొవిడ్ కేసులు; రెండోది- ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరగడం. రిజర్వు బ్యాంకు స్వయంగా వెల్లడించిన అంశాలివి. దీనివల్ల కుటుంబాలు, రాష్ట్రాలు తీవ్ర కడగండ్లను ఎదుర్కోవలసి రావచ్చు. అసలే మునుపటి లాక్‌డౌన్ల వల్ల రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు తలకిందులైన తరుణంలో- ఈ రెండు కొత్త పరిణామాలు గోరుచుట్టుపై రోకటి పోటులా వచ్చిపడుతున్నాయి. కొవిడ్ విరుచుకుపడటానికి ముందు రెండేళ్ల నుంచి పెరుగుతూ వచ్చిన రాష్ట్రాల ఆదాయం, కొవిడ్ తరవాత పడిపోసాగింది. అలాగని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దెబ్బతినలేదని కాదు. రాష్ట్రాలకన్నా కేంద్రానికి ఎక్కువ ఆదాయ వనరులు ఉంటాయి. అవసరమైతే అమ్ముకోవడానికి విలువైన ఆస్తులూ ఉంటాయి. రాష్ట్రాలు ఓట్ల కోసం అనేక సంక్షేమ కార్యకలాపాలపై భారీగా చేస్తున్న ఖర్చులు, ఆర్థిక నిర్వహణ లోపాలు, ఇప్పటికే తలకుమించి చేసిన అప్పులు... వీటన్నింటి వల్ల ఆస్తులు సృష్టించుకోలేకపోవడం ప్రస్తుత కొవిడ్ కష్ట కాలంలో రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి.
తగ్గిన రాబడి... పెరిగిన ఖర్చులు
కొవిడ్ లాక్‌డౌన్ల వల్ల కేంద్రం, రాష్ట్రాలకు రాబడి పడిపోయి, ఖర్చులు పెరిగాయి. వస్తుసేవల పన్ను (జీఎస్టీ)ని ప్రవేశపెట్టినప్పటి నుంచి అసలే ఆదాయం తగ్గిపోయిన రాష్ట్రాలు కొవిడ్‌తో మరింత నష్టపోయాయి. పన్నులు విధించడానికి రాజ్యాంగపరంగా తమకున్న అధికారాన్ని రాష్ట్రాలు జీఎస్టీ మండలికి ధారాదత్తం చేసినందుకు ఇప్పుడు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. గత జనవరి వరకు నడచిన ఆర్థిక సంవత్సరంలో పెద్ద రాష్ట్రాల ఆదాయానికి అయిదు నుంచి 20 శాతంవరకు గండి పడిందని కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) నివేదిక వెల్లడిస్తోంది. రాష్ట్రాలు తమ ఆదాయంలో 52.5 శాతాన్ని సొంతంగానే సమకూర్చుకుంటూ, మిగతాదాని కోసం కేంద్రంపై ఆధారపడతాయి. ఎక్సైజ్ సుంకాలు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఆస్తి పన్నులు, వాహన పన్నులు, ఎస్‌జీఎస్‌టీ ద్వారా రాష్ట్రాలకు 90 శాతం ఆదాయం సమకూరుతుంది. లాక్‌డౌన్లు, ఆర్థిక కడగండ్ల వల్ల రాష్ట్రాల ఆదాయం 25 నుంచి 50 శాతం మేర కోసుకుపోయింది. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు నానాటికీ పెరిగిపోవడంతో ప్రజలు సతమతమవుతున్నారు. కుటుంబాలకు ఆదాయం తరిగిపోవడం వస్తుసేవల వినిమయాన్ని దెబ్బతీసి యావత్ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇలా అన్ని కోణాల నుంచి ఆదాయం కోల్పోయిన రాష్ట్రాలు పాలన రథాన్ని నడిపించడానికి అంతకంతకూ ఎక్కువ రుణాలు తీసుకోకతప్పడం లేదు. ప్రభుత్వ పరంగా జరిగే వ్యయంలో- అంటే కేంద్రం, రాష్ట్రాలు రెండూ కలిసి చేసే మొత్తం వ్యయంలో 60శాతం రాష్ట్రాల చేతుల మీదుగానే జరుగుతోంది. కానీ కరోనా వల్ల అది తరిగిపోయింది. రాష్ట్రాలు కరోనా మహమ్మారికి ముందు సమర్పించిన బడ్జెట్ వ్యయ అంచనాలకన్నా రెండు లక్షల కోట్ల రూపాయలు తక్కువగా ఖర్చు పెట్టే దుస్థితి ఏర్పడింది. ఇది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కోతకు కారణమవుతోంది. రిజర్వు బ్యాంకు అంచనా ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టే ప్రతి రూపాయీ జీడీపీని రూ.3.14 మేరకు పెంచుతుంది. రాష్ట్రాలు ఖర్చు చేసే ప్రతి రూపాయీ రెండురూపాయల పెరుగుదలకు కారణమవుతుంది. ఈ లెక్కన రాష్ట్రాల ఖర్చు రెండు లక్షల కోట్ల రూపాయల మేర పడిపోవడం వల్ల జీడీపీ నాలుగు లక్షల కోట్ల రూపాయల మేరకు కోసుకుపోయింది. ఇక కేంద్ర ప్రభుత్వం ఖర్చు తగ్గిపోతే జీడీపీ మరింత పడిపోతుంది. మరోవైపు రాష్ట్రాల ఆదాయం ఎంత పడిపోయినా ఉద్యోగులకు నెలనెలా జీతాలు, పింఛన్లు చెల్లించాల్సిందే. 2017-18 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 25 శాతం పెరిగాయి. ఇక రిటైర్డు ఉద్యోగుల పింఛన్లకు తోడు ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల పాలక పార్టీలు చెల్లిస్తున్న వివిధ సంక్షేమ పింఛన్లు రాష్ట్రాల ఖజానాలపై భారం మోపుతున్నాయి.
పంథా మార్చుకోవాలి