పాకిస్థాన్‌లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన జ్వాలలు అలుముకున్నాయి. ప్రజలు రగిలిపోతున్నారు. వీధుల్లోకి వస్తున్నారు. ఈ నెల 25న క్వెట్టా నగరంలో నిరసనలు హోరెత్తాయి. విపక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమ బాట పట్టాయి.
ఈ నెల 25వ తేదీన నిర్వహించిన భారీ ప్రదర్శన సందర్భంగా క్వెట్టా నగరంలో నిరసనలు హోరెత్తాయి. ఇలాంటి ప్రదర్శన కార్యక్రమాల వరసలో ఇది మూడోది కావడం గమనార్హం. 1999 నాటి జనరల్ ముషారఫ్ సైనిక తిరుగుబాటు అనంతరం పలు అభియోగాలతో ఖైదు పాలైన పాక్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ లండన్ నుంచి పంపిన వీడియో ప్రసంగం వాడివేడి చూస్తే ఆయన మళ్లీ బరిలోకి దిగినట్లు స్పష్టమవుతోంది.
అసమర్థ పాలనే కారణమా?
పాకిస్థాన్ ప్రభుత్వ అధిపతిగా 2018 ఆగస్టులో పగ్గాలు చేపట్టిన ఇమ్రాన్‌ఖాన్‌పై ‘రావల్పిండి సైనిక నేతలు ఎంపిక చేసిన నేత’ అనే విమర్శలున్నాయి. సైన్యాధిపతి జనరల్ ఖమర్ జావేద్ బజ్వా చేతిలో ఇమ్రాన్ కీలుబొమ్మ అనే ఆరోపణలూ లేకపోలేదు. బజ్వా పదవీ కాలాన్ని పొడిగించడం దీన్ని మరింతగా బలపరుస్తోంది. ఈ పరిణామం సైనికాధిపతి, ప్రధానమంత్రి మధ్య పరస్పర ఆధారిత అనుబంధానికి నిదర్శనంగా నిలుస్తోంది.
పీడీఎం కూటమి
పాకిస్థాన్‌లో రాజకీయ కేంద్రమైన ఇస్లామాబాద్‌కు, సైనిక కేంద్ర స్థావరమైన రావల్పిండి మధ్య బలమైన బాంధవ్యం కొత్త విషయమేం కాదు. అంతెందుకు, నవాజ్ షరీఫ్ 1990 నవంబరులో తొలి దఫా ప్రధానమంత్రి పదవిని చేపట్టినప్పుడు అప్పటి సైన్యానికి ఇష్టుడైన వ్యక్తిగా ముద్రపడిన రాజకీయ నేతే కావడం విశేషం. రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడమే ప్రధాన అజెండాగా సాగిన రెండేళ్ల ఇమ్రాన్‌ఖాన్ అసమర్థ పాలనే ప్రజల్ని వీధుల్లోకి నడిపించింది. పీఎంఎల్-ఎన్ (పాకిస్థానీ ముస్లిం లీగ్-నవాజ్), పీపీపీ (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ), జేయూఎల్-ఎఫ్ (జమైత్ ఉలేమా-ఇ-ఫజ్లూర్), పఖ్తూంఖ్వా మిల్లి అవామీ పార్టీలు మూలస్తంభాలుగా సెప్టెంబరులో పీడీఎం కూటమి ప్రాణం పోసుకోడానికి కారణమైంది.
బలూచ్ నేషనల్ పార్టీ, పష్తున్ తహఫ్ఫుజ్ మూవ్‌మెంట్ వంటి ఇతర సభ్యపక్షాలూ తమ మధ్య విభేదాలు పక్కనపెట్టి పీడీఎం వేదికగా ఏకమయ్యాయి. ఇమ్రాన్ వ్యతిరేక కూటమికి పష్తున్ నేత ఫజ్లూర్ రెహ్మాన్ (జేయూఎల్-ఎఫ్) నేతృత్వం వహిస్తున్నారు. మరియం నవాజ్ (పీఎంఎల్-ఎన్ ఉపాధ్యక్షురాలు, నవాజ్ షరీఫ్ కుమార్తె), పీపీపీ అధ్యక్షుడు బిలావల్ భుట్టో జర్దారీ (జనరల్ జియా ఉల్ హఖ్ ఉరి తీయించిన పాక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టోకి మనుమడు, 2007 డిసెంబరులో హత్యకు గురైన మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు) ఈ కూటమిలోని ఇతర ప్రముఖ యువనేతలు.
తాజాగా విపక్ష కూటమి చేపట్టిన ప్రదర్శన సందర్భంగా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఈ వీరావేశం చూస్తుంటే, దీన్ని అణచి వేయడం ఎవరి తరం కాదని, ఇంతకుముందు గుర్జన్‌వాలాలోనూ కరాచీలోనూ ఇదే వీరావేశం తాను చూశానని, ఇప్పుడు క్వెట్టాలో చూస్తున్నానంటూ- తన తాజా ప్రసంగంతో ఓటర్ల అజేయ శక్తిని సైనిక అణచివేతకు వ్యతిరేకంగా మళ్లిస్తూ సమరశంఖం పూరించారు. పాకిస్థాన్‌లోని అతిపెద్ద, అత్యధిక జనసంఖ్య కలిగిన పంజాబ్, సింధ్, బలూచిస్థాన్ వంటి మూడు ప్రావిన్సుల్లో జరిపిన నిరసన ప్రదర్శనల ద్వారా కూటమికి దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తున్నట్లు స్పష్టమైంది. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వానికి ఇంతకంటే బలమైన ప్రమాద సంకేతం ఇంకేముంటుంది?
సైన్యం దూకుడు:
సైన్యం ‘దేశాన్ని మించిన దేశం’గా వ్యవహరిస్తోందని అక్టోబరు 16న గుర్జన్‌వాలా ప్రదర్శనలో వ్యాఖ్యానించిన నవాజ్ షరీఫ్, సైనిక అధిపతి బజ్వా తనను తప్పించి ఇమ్రాన్‌ఖాన్‌ను గద్దెపై కూర్చోబెట్టడానికి న్యాయవ్యవస్థతో కుమ్మక్కు అయ్యారంటూ ఆరోపణలు చేశారు.
ఇది రిమోట్ కంట్రోల్డ్ సైనిక కుట్ర అనేది ఆయన ఆరోపణ. దీని తర్వాత అక్టోబరు 18న కరాచీలో పీడీఎం నిరసన ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శన అనంతరం, పాక్ సైన్యం అధీనంలో పనిచేసే పాకిస్థానీ రేంజర్స్ కరాచీలోని అత్యున్నత పోలీసు అధికారిని భయభ్రాంతులకు గురిచేశారు. అల్పకారణాలతో నవాజ్ షరీఫ్ అల్లుడిని అరెస్టు చేశారు. పాకిస్థాన్ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా ఇది అసాధారణ పరిణామమే. సైనిక ‘రేంజర్లు’ పరిధి దాటి తమను అవమానపరచారని నిరసిస్తూ సింధ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు ముస్తాక్ మహ్రన్ ఏకంగా సెలవుపై వెళ్లారు. సింధ్ పోలీసులతో పాక్ సైనికులు కయ్యానికి కాలు దువ్వుతున్నారని, సైనికాధిపతి జనరల్ బజ్వా జోక్యం చేసుకోవాలని పీపీపీ నేత బిలావల్ భుట్టో జర్దారీ కోరడంతో ప్రమాదకర పరిస్థితి తప్పిపోయింది. దీనిపై బజ్వా విచారణకు ఆదేశించడంతో పోలీసు అధికారులు తాత్కాలికంగా తమ నిరసన సెలవును ఉపసంహరించుకున్నారు.
జనరల్ బజ్వా పదవీకాలం పొడిగింపు, తదుపరి సైనికాధిపతి ఎంపిక ప్రక్రియ అంశాలపై సైన్యంలోనూ ప్రస్తుతం అంతర్గతంగా కొంతమేర అసంతృప్తి నెలకొని ఉంది. ప్రజాస్వామ్యానికి తాను నిఖార్సయిన ప్రతినిధినని గట్టిగా ప్రకటించుకునే ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు ఇప్పుడు పలు సమస్యలు చుట్టుముట్టాయి. క్వెట్టాలో వెల్లువెత్తిన ప్రజాగ్రహం ఆయనకు అగ్నిపరీక్షే. పాకిస్థాన్‌లో దేశీయంగా వేడెక్కిన రాజకీయ పరిణామాలను అటు చైనా, ఇటు భారత్ తమవైన కోణాల నుంచి నిశితంగా గమనిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
- సి.ఉదయ్‌భాస్కర్(సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ సంచాలకులు)