ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పలు విశేషాలున్నాయి. విజేత జో బైడెన్ భారీ స్థాయిలో ఓట్లు సంపాదించినా, ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్‌నూ తీసిపారేయడానికి లేదు. 2016, 2020 ఎన్నికల్లో నమోదైన ఓట్లను పరిశీలిస్తే ట్రంప్ తన విధానాల పట్ల మద్దతును పెంచుకున్నట్లే కనిపిస్తోంది.
2016 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుచుకున్న ఓట్లు 6,29,84,824. పోలైన మొత్తం ఓట్లలో అవి 46 శాతం. 2020 ఎన్నికల్లో 7,19,25,299కి పెరిగి, 47.5 శాతంగా నమోదయ్యాయి. ఈ లెక్కన ట్రంప్ ఓడినా, ఆయన వాదనకు జనామోదం పెరిగిందని ఓట్ల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 2020 సెనేట్ ఎన్నికల్లో పరిస్థితిని పరిశీలిస్తే- రిపబ్లికన్ పార్టీ 18 సీట్లను కైవసం చేసుకుని సెనేట్‌లో 48 సీట్ల బలం సంపాదించింది. డెమోక్రటిక్ పార్టీ 13 సీట్లను గెలుచుకొని 46 స్థానాలకు పరిమితమైంది. మరో రెండు స్థానాలు స్వతంత్రుల చేతిలో ఉన్నాయి. జార్జియాలో రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థికీ 50 శాతం మించి ఓట్లు రాలేదు. దీంతో అక్కడ మళ్లీ జనవరి ఆరంభంలో ఎన్నిక జరపనున్నారు. ఈ నేపథ్యంలో, జార్జియాలో నిర్వహించే ‘రన్‌ఆఫ్’ ఎన్నిక కీలకంగా మారింది. బైడెన్ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలంటే, సెనేట్లో ఆధిక్యం సాధించాల్సిందే. లేనిపక్షంలో రిపబ్లికన్లపై ఆధార పడాల్సి వస్తుంది.
పార్టీని గుప్పిట్లో పెట్టుకునే వ్యూహం
అమెరికా ఆవిర్భావం నుంచీ అక్కడి రాజకీయాల్లో భాగమైన ‘సబ్‌టెర్రేనియన్ భావజాలం’తో ట్రంప్ అనుసంధానమయ్యారు. ఫలితంగానే ఆయనకు అంతటి ఆదరణ లభించింది. జాతి, లింగ, వర్గ, శాస్త్రీయ దృష్టి వంటి అంశాల పట్ల వేళ్లూనికుని ఉన్న ప్రగాఢ మితవాద విశ్వాసాలు, భావజాలాల సమ్మేళనాన్నే ట్రంపిజంగా వ్యవహరిస్తున్నారు. ఈ నయా మితవాద వాతావరణం ట్రంప్ సృష్టించిందేమీ కాదు. కాకపోతే, ఈ భావజాలం ప్రధాన రాజకీయ స్రవంతిలోకి చొరబడేందుకు ఆయన వాహకంగా మారారు. ఈ భావజాలం తనకు అనుబంధంగా పనిచేసే గ్రూపుల రూపంలో రిపబ్లికన్ పార్టీకి గణనీయంగా ఓట్లు సమకూర్చినా, అవి పార్టీలో భాగం కాదు. ఈ గ్రూపులు పార్టీ అదుపాజ్ఞల్లో ఉండేవీ కావు. అయితే ఈ తరహా సమూహాలను పార్టీతో అనుసంధానించిన ఘనత పూర్తిగా ట్రంప్, ఆయన అనుచరులదే. రిపబ్లికన్ పార్టీపై ట్రంప్ భల్లూకపు పట్టుకు మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఎన్నికల ఓటమితో నిమిత్తం లేకుండా ట్రంప్, ఆయన విశ్వాసపాత్రులు పార్టీని గుప్పిట్లో పెట్టుకునే అవకాశం ఉంది. డెమోక్రాట్లు, తమ ప్రత్యర్థులుగా భావించే ఇతరులతో ఘర్షణ వైఖరిని కొనసాగిస్తూనే ఉంటారు.
విభజన రాజకీయాలు