సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న సర్కారీ విద్యాలయాల్లో చిన్నారుల విద్యాహక్కు అక్షరాలా మంటగలిసిపోతోంది! దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో 11 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కావాల్సి ఉందని కేంద్రం తాజాగా ప్రకటించింది. నలభై శాతం గురువుల కొరతతో బిహార్‌లో ప్రభుత్వ విద్య పడకేస్తుంటే- కొన్నాళ్లుగా కొత్త నియామకాల ఊసే లేని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు శాతం చొప్పున ఖాళీలతో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
వసతులు అంతంతే..
ప్రాథమిక వసతుల పరంగా సర్కారీ పాఠశాలల వ్యధ అది.. అంతులేని కథ! 'జల్‌జీవన్ మిషన్(జేజేఎం) ద్వారా గాంధీ జయంతి నాడు ప్రత్యేక ఉద్యమానికి నాంది పలుకుతున్నాం. రాబోయే వంద రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో సురక్షిత తాగునీటిని అందుబాటులోకి తీసుకొస్తాం' అని ప్రధాని మోదీ నిరుడు జాతికి హామీ ఇచ్చారు. లక్ష్యాల సాధనకు రాష్ట్రాలు మరింత సమయం కావాలంటున్నాయని మొన్న మార్చి 31వరకు గడువును పొడిగించారు. అయితే మాత్రం లాభమేమిటి? దేశంలోని దాదాపు 35శాతం బడులకు, 40శాతం అంగన్‌వాడీ కేంద్రాలకు మంచినీటి సరఫరా నేటికీ అందని ద్రాక్షగానే ఉండిపోయింది! 'కలుషిత జలాలు మోసుకొచ్చే జబ్బుల బారి నుంచి చిన్నారులను తప్పించాలి' అని పార్లమెంటరీ స్థాయీసంఘం లోగడే నిర్దేశించింది.
సాంకేతికంలోనూ వెనుకంజే..
నత్తనడక పనులతో పాఠశాలలు తిరిగి తెరుచుకునే నాటికైనా పిల్లలకు ఆ భరోసా ఎండమావేనని స్పష్టమవుతోంది. కొరత ప్రాణాధార జలాలకేనా? దేశవ్యాప్తంగా 28.55శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే కంప్యూటర్లు, 11.58శాతం బడుల్లోనే అంతర్జాలం అందుబాటులో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ ఇటీవల లెక్కక్కట్టింది. 88శాతం బడులకు అంతర్జాలాన్ని అందించిన దిల్లీ ఈ జాబితాలో ముందుంటే- కేరళ(87.61శాతం), గుజరాత్(66.88) వంటివి ఆ తరవాతి స్థానాల్లో నిలిచాయి. పదిశాతం లోపు పాఠశాలలకు సైతం ఈ సాంకేతిక సదుపాయాన్ని కల్పించలేని దుస్థితికి ఏపీ, తెలంగాణ పరిమితమయ్యాయి! డిజిటల్ బోధనలో మెరుగైన ప్రమాణాలు సుసాధ్యం కావాలంటే- సత్వరం ఈ దుస్థితి సమసిపోవాల్సిందే.