చైనా సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ పేలినా... అది ఇరు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధానికి దారి తీస్తుందని లెఫ్టినెంట్ జనరల్ (విశ్రాంత) బి.ఎస్.జైశ్వాల్ స్పష్టం చేశారు. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను చైనా 1959లో తొలిసారిగా రూపొందించిందని, తరువాత మళ్లీమళ్లీ మారుస్తోందని ‘ఈటీవీ భారత్’ ప్రత్యేక ప్రతినిధి బిలాల్ భట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. భారత సైన్యంలో ఉత్తర కమాండ్‌కు నేతృత్వం వహించిన జైశ్వాల్‌కు ఎల్‌ఏసీ, ఆ ప్రాంతంలోని సైనిక వ్యవహారాలపై మంచి అవగాహన ఉంది. ఇంటర్వ్యూ వివరాలిలా ఉన్నాయి.
చైనా సరిహద్దుల్లో ఇటీవల గస్తీపాయింట్(పీపీ)14, గల్వాన్ లోయ వంటి చోట్ల ఏం జరిగిందనే విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి? ఇంతకీ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి ఏమిటి?
ఎల్‌ఏసీ విషయానికొస్తే, కొన్నిచోట్ల ఇరు దేశాలూ దాన్ని గుర్తించడం లేదు. 1959లో యుద్ధం ముగిసిన తరవాత చైనా ఆక్రమించుకున్న ప్రాంతాల వెనక భాగాలు, వారు ఉపసంహరించుకున్న ప్రాంతాలు వాస్తవాధీన రేఖలా మారాయి. 1959లో ఓ రేఖను నిర్దేశించిన చైనా, 1960లో పశ్చిమ దిశగా మరో రేఖను గీసింది. ఎల్‌ఏసీ పటంపై సంతకాలు జరగలేదు. రేఖ చెల్లుబాటు అస్పష్టమే. మొత్తం గల్వాన్ లోయ తమదేనంటూ చెప్పుకోవాలనేది చైనా ఉద్దేశం. ఎందుకంటే, అనుకూలమైన స్థానంలో ఉంటేనే మన దౌలత్‌బేగ్ ఓల్డీ(డీబీఓ) రోడ్డుపై అంతరాయాలు సృష్టించే అవకాశం కలుగుతుంది. ఇకపోతే, ఆ ప్రాంతంలో యథాతథ స్థితి ఉంది. కానీ, గస్తీపాయింట్(పీపీ)14 వద్ద మాత్రం చైనీయులే ఉన్నారు. ముందుగానే వారక్కడ ఉన్నారు. అక్కడ ఎల్‌ఏసీపై స్పష్టత లేదు.
ఎల్‌ఏసీపై ఒప్పందం ప్రకారం బలగాలు ఆయుధాలతో అక్కడికి వెళ్లకూడదు. మరి, సైనికులు ఆయుధాలు లేకుండానే వెళ్తారా?
సైనిక బలగాలు ఆయుధాల్ని వీపులపై వేలాడదీసుకుంటారు. తుపాకుల మొనలు నేలవైపు ఉండాలి. బుల్లెట్లు దుస్తుల్లోని సంచుల్లో ఉంచుకుంటారు. ఎల్‌ఏసీ ఒప్పందం ప్రకారం పరస్పర ఘర్షణల్లో ఆయుధాల్ని ఉపయోగించకూడదు. అయితే, దాడి జరిగినప్పుడు ఉపయోగించకూడదని ఎక్కడా చెప్పలేదు. ఆత్మరక్షణ కోసం అవసరమైనప్పుడు ఆయుధాన్ని ఉపయోగించాల్సిందే. పీపీ14 వద్ద పర్వత మార్గంలో ఏ మాత్రం జారిపడినా కిందుండే నదిలో పడాల్సిందే. అక్కడదే జరిగింది. చాలామంది నదిలో పడిపోయారు. చీకటిలో మెరుపు దాడి జరిగింది. ఎదుర్కొనేందుకు సంసిద్ధమయ్యేలోపే దాడి జరిగిపోయింది.