కరోనా సృష్టించిన ఇబ్బందుల నుంచి జనసామాన్యం పాఠాలు నేర్చుకొంటూ- ఆ మహమ్మారి బారి నుంచి బయట పడేందుకు ప్రయత్నిస్తోంది. ఆ క్రమంలో వైరస్ సంక్రమించకుండా తమను తాము కాపాడుకొనేందుకు మాస్కు ధరించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం, వీలైనంత భౌతిక దూరం పాటించడం మొదలైనవి త్వరగానే అలవాటు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కరోనా నిర్ధరణ పరీక్షల్లో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే వాటి ఆధారంగా శరీరంలో వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే వ్యాధి నిరోధక వ్యవస్థ బలపడిందని భావించలేం.
'లక్ష్యాత్మక' రక్షణ
ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాలకు చెందిన ముగ్గురు సాంక్రామిక వ్యాధుల నిపుణులు కలిసి కరోనా వైరస్ నుంచి ప్రజారోగ్యాన్ని ఎలా కాపాడాలి అనే అంశంపై చర్చించి గ్రేట్ బారింగ్టన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. సామూహిక అసంక్రామ్యత (హెర్డ్ ఇమ్యూనిటీ) ఆధారంగా వారు చేసిన ఈ ప్రతిపాదన ప్రకారం వ్యాధిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగిన వారిని... అంటే పిల్లలు, యుక్త, మధ్య వయస్కులవారిపై ఆంక్షలు విధించకుండా వదిలివేసి, వ్యాధికి సులభంగా లొంగిపోయే వృద్ధులకు రక్షణ కల్పించాలి.
వ్యాధిని ఎదుర్కొనే సామర్థ్యం కలిగినవారివల్ల వైరస్ వ్యాప్తి తగ్గిపోతుంది. తద్వారా వయసు పైబడినవారిని రక్షించినట్లవుతుంది. 'లక్ష్యాత్మక రక్షణ' (ఫోకస్డ్ ప్రొటెక్షన్) అని వారు పిలిచే ఈ విధానం ప్రకారం... నిర్బంధం విధించి వైరస్ వ్యాప్తిని ఆలస్యం చేయడం కంటే, వ్యాధిని ఎదుర్కొనే సమూహాల్లో వైరస్ సహజ వ్యాప్తికి ఆటంకం కలిగించకుండా ఉంటే- కొత్త పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టి, వ్యాక్సిన్ వచ్చేనాటికి మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చనేది గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్‌ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తల వాదన.
పిల్లలు, యువత మనోవికాసానికి సహకరించే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను పునఃప్రారంభించడం... వీటితో పాటు క్రీడా సముదాయాలను, రెస్టారెంట్లను, సినిమా హాళ్లు, ఇతర వర్తక, వాణిజ్య సముదాయాలను పూర్వస్థితికి తీసుకురావడం, తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవడం, యుక్తవయస్కులను కలవాల్సి వచ్చినప్పుడు వయోవృద్ధులు సాధ్యమైనంత భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తపడటం, ఆస్పత్రి సిబ్బందికి, ఆస్పత్రికి వచ్చేవారికి తరచుగా కరోనా పరీక్షలు చేయడం అనేవి వారి ప్రతిపాదనలోని మరికొన్ని అంశాలు.
వ్యతిరేకత..
అయితే ఈ ప్రతిపాదన వెలువడిన కొన్ని రోజులకే దీనికి వ్యతిరేకంగా ఎనభై మంది శాస్త్రవేత్తలు కలిసి 'జాన్ స్నో మెమోరాండం' ప్రచురించారు. హెర్డ్ ఇమ్యూనిటీని సాధించడం అసాధ్యమని, దానికసలు ఎలాంటి శాస్త్రీయతా లేదని వారు వాదిస్తున్నారు. ఆంక్షలు లేకపోతే తక్కువ రిస్క్ కలిగిన పిల్లలు, యువతలో కూడా వైరస్ విజృంభించి వారిద్వారా ఇన్‌ఫెక్షన్, మరణాల రేటు గణనీయంగా పెరుగుతాయని, అందువల్ల ప్రమాదకరమైన, 'లక్ష్యాత్మక రక్షణ' విధానాన్ని అమలు చేయరాదని గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్‌పై వారు ధ్వజమెత్తారు.
సమర్థమైన, భద్రతాయుతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేదాకా ఆంక్షలతో కూడిన జీవనాన్ని మాత్రమే అమలు చేయాలని, ప్రజలు గుమికూడే అవకాశం గల ప్రదేశాలపై ఆంక్షలు కొనసాగించాలని వారు సూచిస్తున్నారు. అక్టోబర్‌లో కేవలం కొద్దిరోజుల వ్యవధిలో వెలువడిన పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రతిపాదనల్లో 'గ్రేట్ బారింగ్టన్ డిక్లరేషన్'కు ఇప్పటిదాకా ముప్పైవేల పైచిలుకు ప్రజారోగ్య శాస్త్రవేత్తలు సానుకూలత వ్యక్తం చేయగా... కేవలం ఏడువేల మంది మాత్రమే 'జాన్ స్నో మెమోరాండం'ని సమర్థించడం గమనార్హం.
ముందు జాగ్రత్త చర్యలు కీలకం