భారత అంతర్గత భద్రతకు పెనుముప్పు పొంచి ఉందా? అఫ్గానిస్థాన్‌లో తమ పెంపుడు తాలిబన్లకు పట్టంకట్టిన పాకిస్థాన్- ఇండియాలో నెత్తుటి నెగళ్లను రాజేసే కుయుక్తులను ముమ్మరం చేసిందా? జమ్ముకశ్మీర్‌లో ఊపందుకొంటున్న ఉగ్రమూకల కార్యకలాపాలతో కమ్ముకొంటున్న భయసందేహాలివి! ఐఎస్‌ఐ కనుసైగ చేయగానే కశ్మీర్ లోయలో భారీ దాడులకు పాల్పడటానికి దాదాపు రెండొందల మంది సంసిద్ధంగా ఉన్నారన్న కథనాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఆ ముష్కరుల్లో స్థానికుల కంటే విదేశీయుల సంఖ్యే అధికమని భద్రతా దళాలే చెబుతున్నాయి.
కశ్మీర్‌లోకి ఉగ్రతండాల చొరబాట్లు రెండు నెలలుగా గణనీయంగా పెరుగుతున్నాయి. బండిపోరా, బారాముల్లా, కుప్వాడా జిల్లాల్లో ఆ మేరకు వాటి కదలికలు జోరందుకొంటున్నాయి. కశ్మీర్ వ్యవహారాల్లో తమకు తాలిబన్లు తోడ్పడతారని పాక్ అధికారపక్ష నేతలు మరోవైపు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. అఫ్గానిస్థాన్ నుంచి రష్యాతో పాటు కశ్మీర్‌కు ఉగ్రవాదం ఎగుమతి కావడం తథ్యమని ఇండియాలో ఆ దేశ రాయబారి నికొలాయ్ కుదాషెవ్ అంచనా వేస్తున్నారు. సుశిక్షితులైన అఫ్గాన్ ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే ప్రమాదముందంటూ కేంద్రమూ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
విదేశాలపై దాడులకు తమ గడ్డను నెలవు కానివ్వబోమంటూనే- కశ్మీరీల సమస్యలపై మాట్లాడే హక్కు తమకు ఉందని తాలిబన్లు నోరు పారేసుకొంటున్నారు. తదుపరి 'లక్ష్యాల' జాబితాలో కశ్మీర్‌నూ చేర్చిన అల్‌ఖైదాతో పాటు ఐఎస్‌ఐఎస్ సైతం ఇండియాపై గురిపెట్టిందన్నది వాస్తవం! ఆ విధ్వంసక ముఠాల ప్రోద్బలంతో భయంకర కుట్రలకు తెరతీస్తున్న కొందరు ఇటీవల శ్రీనగర్, అనంత్‌నాగ్, లఖ్‌నవూల్లో భద్రతాధికారులకు చిక్కారు. అటు బంగ్లాదేశ్ నుంచి జమాతుల్ ముజాహిదీన్ ముష్కరులు సైతం దేశంలోకి యథేచ్ఛగా చొరబడుతున్నారు. సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లు, దళాల మోహరింపులతో పాటు దేశవ్యాప్తంగా నిఘా కట్టుదిట్టమైతేనే భారతావని సురక్షితమవుతుంది. విద్రోహులను ఉక్కుపాదంతో అణచివేయడంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు సమష్టిగా కదంతొక్కాల్సిన కీలక తరుణమిది!
1980 నుంచే..