బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ముంబయిలోని తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడి విషయంలో జరిగింది మనం ఏం మార్చలేం. కానీ... ఇలాంటి ఘటనలు ప్రజలకు చెప్పే బాధ్యతాయుతమైన మీడియా సంస్థల తీరు మాత్రం తప్పక మారాల్సిన అవసరం ఉంది.
సుశాంత్ మరణ విషయం తెలియగానే టెలివిజన్ ఛానెళ్లన్నీ 'బిగ్ బ్రేకింగ్ న్యూస్' పేరిట వార్తను సంచలం చేశాయి. నటుడు ఆత్మహత్యకు పాల్పడిన విధానాన్ని రోజంతా పూసగుచ్చినట్లు వివరించాయి. ఆత్మహత్యను వ్యక్తిగత, వృత్తిపరమైన, ఆర్థిక కోణాల్లో విశ్లేషించాయి. అటు.. టెలివిజన్ ఛానెళ్లకు పోటీగా వార్తా పత్రికలు సైతం సుశాంత్ ఆత్మహత్య విధానాన్నే భూతద్దంలో పెట్టి చూపించాయి.
ఇంత సంచలనమా?
ఈ వార్తకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. ఆత్మహత్యను ఇంతలా సంచలనంగా మార్చడం మంచిది కాదు. పదేపదే ఆత్మహత్య వార్తలు ప్రసారం చేయడం వల్ల తీవ్రమైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 50 పరిశోధనలు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నవారు, ఆత్మహత్య గురించి ఆలోచించేవారు ఇలాంటి వార్తలు వింటే... ఆ ఆలోచనలు మరింత పెరిగే అవకాశం ఉందని తేల్చాయి.
అనుకరిస్తూ ఆత్మహత్యలు!
ఆత్మహత్య చేసుకున్న విధానం గురించి మీడియాలో వచ్చిన వార్తలను అనుకరిస్తూ అదే విధంగా బలవన్మరణానికి పాల్పడే అవకాశం ఉందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి కథనాల వల్ల ఆత్మహత్యలు 2.5 శాతం ఎక్కువగా నమోదవుతున్నట్లు నిర్ధరించాయి. సెలెబ్రిటీల ఆత్మహత్యల తర్వాత నమోదయ్యే బలవన్మరణాలు చాలా ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించాయి.
అయితే ఆత్మహత్యల నివారించడంలో మీడియా సానుకూల పాత్ర పోషించే ఆధారాలనూ పరిశోధనలు బయటపెట్టాయి. సంచలనాత్మక రిపోర్టింగ్‌ను తగ్గించి.. ఆత్మహత్య పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో చెప్పే కథనాలు ప్రసారం చేస్తే ఉయోగకరంగా ఉంటుందని వెల్లడించాయి. ఈ రకంగా చేయడం ద్వారా ఆత్మహత్యలను కొంతవరకు నివారించవచ్చని పేర్కొన్నాయి.