తెలంగాణ

telangana

ETV Bharat / opinion

విద్వేషాగ్నులకు ఆజ్యంపోసే.. అభ్యంతరకర పోస్టులు!

కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో పేట్రేగుతున్న విధ్వంసకాండకు ఫేస్‌బుక్‌ (Facebook Latest News) వేదికగా ఒక ప్రబుద్ధుడు పంచుకున్న తప్పుడు వార్తే మూలమని ఇటీవలే తేలింది. విద్వేషాగ్నులకు ఆజ్యంపోసే (Facebook Hate Speech) అటువంటి అభ్యంతరకర పోస్టులను నియంత్రించడంలో ఆ సంస్థ నేరపూరిత నిర్లక్ష్యం- యావత్‌ ప్రపంచాన్నే కలవరపరుస్తోంది.

facebook
facebook hate speech

By

Published : Oct 27, 2021, 6:56 AM IST

సామాజిక మాధ్యమాలను ముంచెత్తుతున్న విద్వేష సమాచార సునామీపై ఐరాస ప్రత్యేక ప్రతినిధి ఇటీవలే ఆందోళన వ్యక్తంచేశారు. అనేక దేశాల్లోని అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలకు అది ప్రాణాంతకమవుతోందని హెచ్చరించారు. కొద్ది రోజులుగా బంగ్లాదేశ్‌లో పేట్రేగుతున్న విధ్వంసకాండకు ఫేస్‌బుక్‌ వేదికగా ఒక ప్రబుద్ధుడు పంచుకున్న తప్పుడు వార్తే మూలమని తాజాగా తేలింది. విద్వేషాగ్నులకు ఆజ్యంపోసే అటువంటి అభ్యంతరకర పోస్టులను నియంత్రించడంలో ఆ సంస్థ నేరపూరిత నిర్లక్ష్యం- యావత్‌ ప్రపంచాన్నే కలవరపరుస్తోంది. ప్రజాప్రయోజనాలను గాలికొదిలేస్తూ లాభార్జనలో ఫేస్‌బుక్‌ యాజమాన్యం తలమునకలైందంటూ కొన్ని వేల పత్రాలను ప్రజావేగు ఫ్రాన్సెస్‌ హాగెన్‌ ఈమధ్యనే బహిరంగపరచారు. వాటి ఆధారంగా అమెరికా వార్తాసంస్థలు ప్రచురిస్తున్న వరస కథనాలు పెనుసంచలనం సృష్టిస్తున్నాయి. పుంఖానుపుంఖంగా పుట్టుకొస్తున్న పుక్కిటి పురాణాలను కట్టడి చేసేలా కృత్రిమమేధకు మెరుగులు దిద్దడంలో ఫేస్‌బుక్‌ విఫలమైనట్లు అవి తేటతెల్లం చేస్తున్నాయి. రాజకీయ హింసను ప్రేరేపించే, చిన్నారుల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే సమాచారాన్ని వినియోగదారులకు చేరువ చేయడంలో ఫేస్‌బుక్‌ అల్గారిథమ్స్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఆ సంస్థ అంతర్గత పరిశోధనలే చాటుతున్నాయి. ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలోని ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించుకొంటూ మధ్యప్రాచ్యంలో ఆడపిల్లల క్రయవిక్రయాలకు తెగబడుతున్న ముఠాల దుశ్చర్యలు రెండేళ్ల క్రితమే వెలుగుచూశాయి. 190కి పైగా దేశాల్లో దాదాపు 160 భాషల్లో సేవలందిస్తూ, 289 కోట్ల వినియోగదారులతో సామాజిక మాధ్యమాల్లో మేరునగంగా ఆవిర్భవించిన ఫేస్‌బుక్‌- శాంతిభద్రతలకు విఘాతకరమయ్యే పెడపోకడలను ఉపేక్షించడమే దిగ్భ్రాంతికరం! సమధిక నిధులు, స్థానిక భాషలపై పట్టున్న సిబ్బంది, సమర్థ కృత్రిమమేధల నియోగంతోనే బూటకపు సమాచార వెల్లువకు అడ్డుకట్ట పడుతుంది. ఆ కర్తవ్యదీక్షను ఔదలదాలిస్తేనే- వ్యవస్థాపకులు మార్క్‌ జుకర్‌బర్గ్‌ అభివర్ణించినట్లు, ప్రజల మధ్య సుహృద్భావ వారధిగా ఫేస్‌బుక్‌ ప్రతిష్ఠ వన్నెలీనుతుంది!

ఉదాసీన వైఖరితో ముప్పు!

ప్రజాభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తులుగా అవతరించిన ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు- ప్రతికూల భావాల వ్యాప్తికి ప్రధాన వాహకాలుగా పరిణమిస్తుండటాన్ని సుప్రీంకోర్టు నాలుగు నెలల క్రితమే గర్హించింది. భిన్నత్వంలో ఏకత్వ భావనను దెబ్బతీసే సమాచారాన్ని నియంత్రించడంలో ఆ సంస్థ ఉదాసీన వైఖరి అంగీకారయోగ్యం కాదని తేల్చిచెప్పింది. జవాబుదారీతనంతో వ్యవహరించాలని హితవు పలికింది. సామాజిక మాధ్యమాల్లో పోటెత్తుతున్న నకిలీ వార్తలపై సీజేఐ ఎన్‌.వి.రమణ ఇటీవల కన్నెర్ర చేశారు. వాటిని అడ్డుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. నిరుటి దిల్లీ అల్లర్లకు కొద్ది నెలల ముందుగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో వదంతుల వ్యాప్తి ఎకాయెకి మూడొందల శాతానికి ఎగబాకినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. అల్పసంఖ్యాక వర్గాలే లక్ష్యంగా అసత్యాలు, అర్ధసత్యాలను హోరెత్తించే మూకలు సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా తిష్ఠవేసినట్లు అవి నిర్ధారిస్తున్నాయి. అటువంటి వారి ఆటలు కట్టించడానికి రెండేళ్ల క్రితమే సింగపూర్‌ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని పట్టాలెక్కించింది. యూకే సైతం ఆ మేరకు ముసాయిదా బిల్లును రూపొందించింది. కల్పిత కథనాల కార్ఖానాలుగా వర్ధిల్లుతున్న సామాజిక మాధ్యమాలకు ముకుతాడు బిగించడానికే నూతన ఐటీ నిబంధనలను తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ఉద్ఘాటిస్తోంది. వాటిపై పలు విమర్శలు వ్యక్తమవుతున్న దృష్ట్యా- పౌరుల భావప్రకటనా స్వేచ్ఛకు పట్టం కడుతూనే, వైషమ్యాలకు కారణభూతమయ్యే తప్పుడు సమాచార వ్యాప్తిని పూర్తిగా నివారించేలా సర్కారీ కార్యాచరణ పదునుతేలాలి. ప్రజల ప్రాథమిక హక్కుగా అత్యున్నత న్యాయస్థానం స్పష్టీకరించిన వ్యక్తిగత గోప్యతకు మన్నన దక్కాలంటే- చర్చల్లోనే మగ్గిపోతున్న సమాచార భద్రతా బిల్లుకు కేంద్రం సత్వరం శాసన రూపం కల్పించాలి!

ఇదీ చూడండి:వివాదాలు చుట్టుముడుతున్నా.. ఫేస్​బుక్​కు లాభాల పంట

ABOUT THE AUTHOR

...view details