మతం పేరిట జరిగే హింసను, ఇతర అన్ని తప్పులనూ జాతీయవాదం ముసుగులో వెనకేసుకొస్తున్నారు. మరోవైపు మైనారిటీలు వ్యవస్థ దృష్టిలో అనుమానితులవుతున్నారు. అధిక సంఖ్యాకుల భావజాలాన్ని విమర్శించే ఇతరులను జాతి వ్యతిరేకులుగా పరిగణిస్తూ కేసుల్లో తప్పుగా ఇరికిస్తున్నారు. నిందితులు ఏళ్ల తరబడి విచారణ, బెయిలు లేకుండా జైళ్లలో మగ్గేలా చేసేందుకు వారిపై దేశద్రోహం, చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, జాతీయ భద్రత చట్టం (ఎన్‌ఎస్‌ఏ) వంటి చట్టాలను ప్రయోగిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతిభద్రతల్ని కాపాడలేకపోయిన పోలీసులు ఎన్‌ఎస్‌ఏ కింద నమోదు చేసిన 139 కేసుల్లో 76 గోవధకు సంబంధించినవే. సమాజంలో ద్వేషాగ్నిని రగిలించడానికి కొంతమంది డిజిటల్ వేదికలనూ వాడుకుంటున్నారు. ఇలాంటి చర్యలపై ఎలాంటి అదుపూ లేకపోవడం విషాదకరం. మత రాజకీయాలు వివిధ వర్గాల నడుమ అభద్రతను సృష్టిస్తూ, సామాజిక వ్యవస్థను ఛిద్రం చేస్తున్నాయి.
పెరుగుతున్న అడ్డుగోడలు
మనం మూడు వేల కులాలు, 10కి పైగా ప్రధాన మత విశ్వాసాలున్న సమాజంలో జీవిస్తున్నాం. సహనం మన సమ్మిళిత సంస్కృతిలో అంతర్భాగం. భిన్నమతాలు, కులాల ప్రజలు తరతరాలుగా ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు సాయం అందించుకుంటూ- కలిసిమెలిసి జీవించడమెలాగో నేర్చుకున్నారు. దురదృష్టవశాత్తు, మతతత్వ రాజకీయాలు సమాజాన్ని భిన్నధ్రువాలుగా విభజిస్తూ వివిధ వర్గాల నడుమ మానసిక అడ్డుగోడలను నిర్మిస్తున్నాయి. కొవిడ్ సంక్షోభానికీ జిహాద్ భావనను విస్తరింపజేశారు. ఇటీవల ఒక టీవీ ఛానెల్ మరో కథనాన్ని మన ముందుకు తెచ్చింది. సివిల్ సర్వీసుల్లోకి మైనారిటీలు చొరబడుతున్నారన్నది ఆ కోణం. విద్యాపరంగా వెనకబాటు వల్ల సర్వీసుల రంగంలో జనాభా ప్రాతిపదికన ముస్లిముల ప్రాతినిధ్యం తక్కువగా ఉందని ఓ వైపు సచార్ కమిటీ నివేదిక చెబుతుంటే, వాస్తవం ఇలా వక్రీకరణకు గురవుతోంది. సమాజ శ్రేయస్సుపై దీని పర్యవసానాలు ప్రమాదకరంగా ప్రసరించే అవకాశం ఉంది. మత, కులతత్వ, పితృస్వామ్య ఆలోచనా ధోరణితో మన నైతికత మొద్దుబారిపోయింది. కిరాతక దుష్కృతాలకు సైతం మన మనస్సాక్షి స్పందించడం మానేసింది. భారత ప్రభుత్వాన్ని సంతోషంగా ఉంచేందుకు... కొంతమంది నేతల విద్వేష ప్రకటనలు అల్లర్లను ప్రేరేపించేవిగా ఉన్నప్పటికీ- ఫేస్‌బుక్ ఉద్దేశపూర్వకంగా ఎలా అనుమతించిందో వివరిస్తూ ఇటీవల వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం వాక్‌స్వాతంత్య్రం మీద చర్చను లేవదీసింది. చివరికి భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్‌కు సంబంధించిన అంశాలను ఫేస్‌బుక్ తొలగించింది.