తెలంగాణ

telangana

ETV Bharat / opinion

ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం - న్యాయవ్యవస్థ

భారత న్యాయవ్యవస్థలో తీర్పు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కేసులు కోకొల్లలు. ఇలా అయితే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం లోపిస్తుంది. సత్వర న్యాయం మానవ హక్కుల్లో అంతర్భాగమని సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టీకరించింది. వాస్తవంలో ఆ స్ఫూర్తే కనపడటం లేదు. కొరగాని చట్టాలకు చెల్లుకొట్టి కాలదోషం పట్టిన విచారణ పద్ధతులకు అగ్నిసంస్కారం చేయడం తక్షణావసరం.

Reforms should be brought in Indian Judiciary system
ఎండమావిగా మారిన 'సత్వర'న్యాయం

By

Published : Jul 24, 2020, 8:14 AM IST

ఎనభై దశకంలో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన పోలీస్‌ ఘాతుకమది. 1985లో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పీఠం నుంచి శివచరణ్‌ మాధుర్‌ ఉద్వాసనకు దారితీసిన బూటకపు ఎన్‌కౌంటర్‌ కేసులో మధుర(యూపీ) సెషన్స్‌ కోర్టు తాజా తీర్పు- నాటి డీఎస్పీ సహా 11మంది పోలీస్‌ సిబ్బందికి యావజ్జీవ కారాగారవాస శిక్ష విధించింది. భరత్‌పూర్‌ రాజవంశీకుడైన మాన్‌సింగ్‌ వరసగా ఏడుసార్లు స్వతంత్ర ఎమ్మెల్యేగా నెగ్గిన రాజకీయ ప్రముఖుడు. స్వీయ రాజవైభవ చిహ్నమైన కపి ధ్వజానికి అవమానం జరిగిందన్న ఆగ్రహంతో ముఖ్యమంత్రి హెలికాప్టర్ని తన జీపుతో ఢీకొట్టిన మరునాడు రాజా మాన్‌సింగ్‌ పోలీసు కాల్పుల్లో కడతేరిపోయాడు. అతడి మద్దతుదారుల ప్రాణాల్నీ కర్కశ తూటాలు తోడేశాయి. ప్రజాగ్రహం వెల్లువెత్తి కడకు ముఖ్యమంత్రిత్వం చేతులు మారడానికి, విచారణ ప్రక్రియ రాష్ట్రం ఎల్లలు దాటాల్సి రావడానికి కారణమైన కేసులో- మూడున్నర దశాబ్దాల తరవాత ఇప్పుడు తీర్పు వెలువడటం దిగ్భ్రాంతపరుస్తోంది. కేదస(సీబీఐ) పొందుపరచిన ముద్దాయిల జాబితాలో ముగ్గురు వ్యాజ్యవిచారణ దశలోనే చనిపోయారు. సరైన సాక్ష్యాధారాలు లభించక విడిచిపుచ్చినవారు పోను 11మందికి శిక్ష ప్రకటించారు. 1975నాటి రైల్వేమంత్రి లలిత్‌ నారాయణ్‌ మిశ్రా హత్య కేసులో 39ఏళ్ల తరవాత, 1987నాటి హషీంపురా సామూహిక దారుణ హత్యాకాండలో సుమారు మూడు దశాబ్దాలు గతించాక వెలువడ్డ తీర్పుల్లాగే రాజా మాన్‌సింగ్‌ కేసూ- దేశంలో నేరన్యాయ అవ్యవస్థకు ప్రబల నిదర్శనంగా నిలిచిపోతుంది. కనీసం ఇటువంటి సంచలనాత్మక కేసులనైనా శీఘ్ర విచారణ పద్ధతిలో ఒక కొలిక్కి తేకపోతే నేరన్యాయ వ్యవస్థ సమర్థమైందని పౌరులెలా విశ్వసిస్తారు? 'సత్వర న్యాయం మానవ హక్కుల్లో అంతర్భాగమని సర్వోన్నత న్యాయస్థానమే స్పష్టీకరించింది. వాస్తవంలో ఆ స్ఫూర్తే కొల్లబోతోంది!

వలస పాలకుల ప్రయోజనాల పరిరక్షణే అంతస్సూత్రంగా రూపుదాల్చిన 1860నాటి ఐపీసీ, 1872నాటి సాక్ష్యాధార చట్టాల్ని పెద్దయెత్తున ప్రక్షాళించాల్సి ఉందని నిపుణులెందరో కొన్నేళ్లుగా చెబుతున్నారు. నేరశిక్షాస్మృతిని 1973లో గణనీయంగా సవరించినప్పటికీ మౌలిక లోటుపాట్లు చెక్కుచెదరలేదన్న విమర్శలున్నాయి. 'చట్టబద్ధంగా వివాద పరిష్కారానికి దాదాపు మూడు దశాబ్దాలు నిరీక్షించాల్సి ఉంటుందని మనం సూచిస్తే చట్ట వ్యతిరేక పద్ధతులవైపు పౌరుల్ని ప్రోత్సహించడం కాదా?' అని సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్‌ థామస్‌ సంధించిన ప్రశ్న, జన మనోగతానికి ప్రతిధ్వని. ప్రజానీకంలో విశ్వాస పునరుద్ధరణే లక్ష్యంగా- న్యాయ విచారణ పద్ధతుల్ని సరళీకరించి, న్యాయపాలిక ప్రాసిక్యూషన్‌ పోలీస్‌ విభాగాలమధ్య సమన్వయం ఏర్పరచడానికి 2003లో జస్టిస్‌ మలీమత్‌ కమిటీ సవివర సూచనలు సమర్పించింది. మేలిమి సిఫార్సులు నేటికీ అమలుకు నోచుకోని పర్యవసానంగా, యథాతథ స్థితి కొనసాగితే ఇంకో ఇరవై ఏళ్లలో దేశంలోని పెండింగ్‌ కేసులు 15 కోట్లకు పైబడతాయన్న అంచనాలు బేజారెత్తిస్తున్నాయి. ఉగ్రవాద కేసులు తదితరాల పరిష్కరణకు ప్రత్యేక న్యాయస్థానాల ప్రతిపాదనలు అడపాదడపా వెలుగుచూస్తున్నా, న్యాయవిచారణను వేగిరం చేసే పకడ్బందీ చర్యలు పట్టాలకు ఎక్కడంలేదు. నేరన్యాయ సంస్కరణల్ని లక్షించి కేంద్రం కొత్తగా కొలువుతీర్చిన కమిటీ కూర్పుపై 69మంది నిపుణుల బృందం అభ్యంతరాలు లేవనెత్తుతోంది. కొరగాని చట్టాలకు చెల్లుకొట్టి కాలదోషం పట్టిన విచారణ పద్ధతులకు అగ్నిసంస్కారం చేయడం తక్షణావసరం. సత్వర న్యాయాన్ని ఎండమావి చేస్తున్న దుస్థితిని చెదరగొట్టే సర్వసమగ్ర సంస్కరణలతోనే వ్యవస్థపై కక్షిదారుల్లో విశ్వాస పునరుద్ధరణ సాధ్యం!

ABOUT THE AUTHOR

...view details