ఇండియా సహా ప్రపంచ దేశాలన్నింటికీ ఈ ఏడాది కొవిడ్ నామ సంవత్సరమైంది. పటిష్ఠ ఆరోగ్య వ్యవస్థలకు పేరెన్నికగన్న దేశాలూ కరోనా మహమ్మారి ధాటికి దిమ్మ తిరిగి పోగా, జనారోగ్య రంగాన- 195 దేశాల్లో 145వ స్థానంలో నిలిచిన ఇండియా గురించి చెప్పేదేముంది? స్థూల దేశీయోత్పత్తిలో 1.3 శాతం లోపే ఉన్న సర్కారీ కేటాయింపులతో ఈసురోమంటున్న వైద్య ఆరోగ్య రంగం- కొవిడ్‌లాంటి ప్రాణాంతక మహమ్మారుల తాకిడిని ఏమాత్రం తట్టుకొనే పరిస్థితి లేనేలేదని రుజువైంది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే కోటి మందికిపైగా జనావళికి సోకి లక్షా 45 వేల మందిని బలిగొన్న కొవిడ్ ఉద్ధృతి కొంత ఉపశమించడం ఊరటనిచ్చేదే అయినా, బ్రిటన్‌లో కొత్తగా కోరసాచిన కరోనా ఉత్పరివర్తన వైరస్ మళ్ళీ భయాందోళనలు పెంచుతున్న వేళ ఇది. తలకు మించిన వైద్య ఖర్చుల్ని భరించలేక అప్పుల పాలై ఏటా ఆరు కోట్ల మంది దారిద్య్ర రేఖ దిగువకు జారిపోతున్న దేశం మనది. కొవిడ్ కారణంగా ఉపాధి మార్గాలు మూసుకుపోయి అల్లాడుతున్న సామాన్య జనంపై కొవిడ్, గాయంపై గునపంపోటులా మారింది.
సమగ్ర ప్రజారోగ్య చట్టం
చికిత్సా వ్యయం భరించదగిన స్థాయిలో ఉండటం కూడా ఆరోగ్య హక్కులో అంతర్భాగమేనని, సగటు పౌరులకు కొవిడ్ రక్షణ అందని ద్రాక్షలా మారిందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మధ్యే ఆవేదన చెందింది. ఈ నేపథ్యంలోనే- సమగ్ర ప్రజారోగ్య చట్టాన్ని రూపొందించాలన్న పార్లమెంటరీ స్థాయీసంఘం, కొవిడ్ లాంటివి విరుచుకు పడ్డప్పుడు ప్రైవేటు ఆసుపత్రులపై తగు నియంత్రణలు, ఔషధాలు నల్లబజారుకు తరలిపోవడాన్ని నిలువరించే ఏర్పాట్లు ఉండాలంటోంది. జాతీయ విపత్తుల నిభాయక ప్రాధికార సంస్థలో కొవిడ్ లాంటి ఉత్పాతాల్ని ఎదుర్కొనే ప్రత్యేక వ్యవస్థ కొలువు తీరాలని, బీమా సదుపాయం ఉన్న వారందరికీ నగదు రహిత వైద్యం అందేలా చూడాలని సూచించింది. ఇలాంటి పైపై పూతలు కాదు- అట్టడుగు స్థాయి నుంచి ప్రజారోగ్య వ్యవస్థల్ని పటిష్ఠంగా నిర్మించే చొరవే కావాలిప్పుడు!