రూపాయిని ఆదా చేయడం అంటే మరో రూపాయిని అదనంగా సంపాదించినట్లే. ఆదాయం పెంచుకునే క్రమంలో ఖర్చు తగ్గించుకోవడం అత్యంత కీలకాంశం. ఇల్లు, వ్యాపార నిర్వహణల్లోనే కాదు- వ్యవసాయంలోనూ ఇదే ముఖ్యమైన ఆర్థిక సూత్రం. గడచిన దశాబ్దకాలంగా పంటల సాగులో పెట్టుబడి ఖర్చులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. పంటకు వాడే విత్తనం నుంచి ఎరువులు, మందులు తదితర ఉత్పాదకాలను ఎంత పరిమితంగా వాడుకోవాలనే అంశంపై రైతులకు అవగాహన ఉండటం లేదు. పంటను విక్రయించుకునే విషయంలోనూ నైపుణ్యం లోపించడంతో అన్నదాతలు నష్టపోవాల్సి వస్తోంది. త్వరలో ఖరీఫ్ ఆరంభం కానున్న తరుణంలో ఖర్చు తగ్గించి లాభసాటి సేద్యం దిశగా రైతులు అడుగులు వేయాల్సిన అవసరముంది.
అడుగడుగునా సమస్యలే!
వానాకాలం పంటల సాగుకు ముందే రైతుల సన్నాహాలు మొదలవుతాయి. వేసవి దుక్కులు, పొలం తయారీ, విత్తన సేకరణ తదితర పనులపై రైతులు దృష్టి పెడతారు. విత్తే దశ నుంచే సాగు ఖర్చులు తగ్గించుకునే దిశగా రైతులు యోచించాల్సిన తరుణమిది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో విత్తనాల ధరలు మండిపోతున్నాయి. రాయితీల ఊసే లేకుండా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ విత్తన ధరలను ఖరారు చేయడం అన్నదాతల్ని కలవరపెడుతోంది. విత్తనం వేయడం మొదలుకొని, పంటను విక్రయించేవరకు పలు దశల్లో పెడుతున్న ఖర్చులు రైతుల్ని ముంచేస్తున్నాయి. కౌలు సేద్యం చేసేవారి పరిస్థితి మరింత దయనీయం. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల్లో ఏం వాడాలో ఏది వాడకూడదో అవగాహన కల్పించే విస్తరణ సేవలు అందక రైతులు నష్టపోతున్నారు. పత్తి వంటి వాణిజ్య పంటల విషయంలో ఈ పరిస్థితి మరీ ఘోరం. తెలంగాణ వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఎకరా వరి సాగు వ్యయం రూ.2,717. మద్దతు ధరతో పోలిస్తే రైతులు క్వింటాకు రూ.829 మేర నష్టపోతున్నారు. ఎకరా వరి సగటు దిగుబడి 2.25 టన్నులుగా అంచనా వేస్తే- రైతులు నికరంగా ఎకరాకు రూ.18,653 నష్టపోవలసి వస్తోంది. ఈ లెక్కన ఒక్క తెలంగాణలోనే గత ఖరీఫ్, రబీ సీజనల్లో దాదాపు 98 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసిన రైతులకు మొత్తం రూ.18,279 కోట్ల నష్టం వాటిల్లింది. ఇలా పత్తి, మొక్కజొన్న, సోయా తదితర పంటల్నీ లెక్కిస్తే- గడచిన సంవత్సర కాలంలో రైతులు సుమారు రూ.30 వేల కోట్లకు పైనే నష్టపోవలసి వచ్చింది. సేద్యం గిట్టుబాటు కావడం లేదన్న సంగతిని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకునేలా ఎప్పటికప్పుడు విస్తరణ విభాగం రైతుకు దిశానిర్దేశం చేయాల్సి ఉంది. అయితే కొందరు వ్యవసాయ అధికారులే పురుగుమందుల కంపెనీలకు అనధికారిక ఏజెంట్లుగా మారిపోవడం దారుణం. పురుగుమందుల వినియోగం అవసరానికి మించి ఉంటోంది. ఈ పరిణామాలన్నీ సాగు ఖర్చుల్ని రైతుకు భారంగా మార్చేశాయి.
ఇదీ చదవండి:మహమ్మారితో మానసిక కల్లోలం.. స్థైర్యమే విరుగుడు!
సహజ, సేంద్రియ, సంప్రదాయ సాగు పద్ధతులకు తోడు సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ వంటి పద్ధతుల గురించి రైతులకు వివరించి చెప్పే ఓపిక వ్యవసాయ యంత్రాంగానికి లేదు. విస్తరణ వ్యవస్థ ఇంతగా నిర్వీర్యమైపోతున్నా- పాలకులు చలించడం లేదు. విస్తరణ సిబ్బంది పాత్రను చాలావరకు డీలర్లే పోషిస్తున్నారు. నిరక్షరాస్యులైన రైతులకు అధిక వడ్డీలకు పెట్టుబడులు అందిస్తూ- ఎరువులు, పురుగుమందులు తమ వద్దే కొనాలని, పంటను తమకే అమ్మాలని షరతులు విధిస్తున్నారు. రైతుల చుట్టూ తమ వ్యాపారాన్ని నిర్మించుకుంటున్నారు. అవసరం లేకపోయినా వీరి సిఫార్సుపై వాడుతున్న మందులతో సాగు ఖర్చులు పెరిగిపోతున్నాయి. పైగా కొన్ని ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ, నాసిరకం విత్తనాలు, క్రిమిసంహారకాలను కొందరు డీలర్లు స్వేచ్ఛగా విక్రయిస్తున్నారు. డీలర్లను వ్యవసాయశాఖ కట్టడి చేయలేకపోతోంది.