తెలంగాణ

telangana

ETV Bharat / opinion

వాతావరణ మార్పులపై మేలుకోకుంటే తప్పదు విపత్తు

వాతావరణ మార్పులతో ప్రపంచం ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటోంది. వరదలతో నగరాలు మునిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పుల నియంత్రణపై మరింత క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంది. వాతావరణ మార్పులకు దోహదం చేసే అంశాలు, వాటిలో నగరాల పనితీరుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం చేసిన 'క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ అసెస్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ (సీఎస్‌సీఏఎఫ్‌) 2.0' నివేదిక ఇదే అంశాన్ని నొక్కి చెప్పింది. ప్రజాభాగస్వామ్యంతో వాతావరణ దుష్ప్రభావాలను అరికట్టే దిశగా బలమైన అడుగులు వేయాల్సి ఉంది.

natural disasters
వాతావరణ మార్పులు

By

Published : Jul 24, 2021, 7:58 AM IST

అమెరికా, కెనడా లాంటి శీతల దేశాల్లోనూ ఠారెత్తిస్తున్న ఎండలు.. జర్మనీ, చైనా వంటి దేశాల్లో అకస్మాత్తుగా భారీ వర్షాలు, వరదలు.. ఇవన్నీ వాతావరణ మార్పుల ప్రభావాలే. మన దేశంలోనూ దీని ప్రభావం తక్కువేమీ కాదు. హైదరాబాద్‌, బెంగళూరు లాంటి నగరాల్లో సైతం ఏటికేడు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భూతాపం పెరిగి మంచు పర్వతాలు కరగడంతో ఉత్తరాఖండ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నగరాలన్నీ వాతావరణ మార్పుల నియంత్రణపై మరింత క్రియాశీలకంగా పని చేయాల్సి ఉంది. వాతావరణ మార్పులకు దోహదం చేసే అంశాలు, వాటిలో నగరాల పనితీరుపై కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం చేసిన 'క్లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ అసెస్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ (సీఎస్‌సీఏఎఫ్‌) 2.0' నివేదిక ఇదే అంశాన్ని నొక్కి చెప్పింది. అయిదు ప్రధానాంశాల ప్రాతిపదికన ఒకటి నుంచి అయిదు నక్షత్రాల రేటింగ్‌ ఇస్తే.. దేశంలోని ఏ ఒక్క నగరమూ అయిదు నక్షత్రాల రేటింగ్‌ను అందుకోలేకపోయింది. తొమ్మిది నగరాలు అత్యధికంగా నాలుగు నక్షత్రాలదాకా సాధించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నానికి చోటు దక్కింది. సూరత్‌, ఇండోర్‌, అహ్మదాబాద్‌, పుణె, రాజ్‌కోట్‌, పింప్రి-చించ్వాడ్‌, వడోదరలకూ ఈ జాబితాలో స్థానం లభించింది. ఉత్తర భారత్‌ నుంచి ఒక్క నగరమూ నాలుగు నక్షత్రాల రేటింగ్‌ సాధించలేకపోవడం గమనార్హం. నీటి నిర్వహణ, రవాణా, వాయు నాణ్యత వంటి అంశాల్లో దాదాపు అన్ని నగరాలూ పురోగతి సాధించాలని నివేదిక తేల్చి చెప్పింది.

నగరాలకు రేటింగులు

'వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణ (ఎన్‌ఏపీసీసీ)'లో భాగంగా సీఎస్‌సీఏఎఫ్‌ కార్యక్రమాన్ని 2019లో ప్రారంభించారు. వాతావరణ మార్పులు సంబంధిత అంశాలపై ఇలాంటి గణన చేయడం ఇదే తొలిసారి. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై అవగాహన పెంచుకొని, వాటిని ఎదుర్కోవడానికి నగరాలకు ఈ కార్యక్రమం మార్గసూచీగా నిలుస్తుంది. పట్టణ ప్రణాళిక-పచ్చదనం-జీవవైవిధ్యం, ఇంధనం-హరిత భవనాలు, రవాణా-వాయునాణ్యత, నీటినిర్వహణ, వ్యర్థాలనిర్వహణ అనే అయిదు అంశాల ఆధారంగా దేశంలోని 126 నగరాలకు రేటింగులు ఇచ్చారు. ఇందులో 100 ఆకర్షణీయ నగరాలు; మిగిలినవి అయిదు లక్షలకంటే అధిక జనాభా ఉన్న నగరాలు. ఒక నగరంలో పెట్రోలు, డీజిలు, కిరోసిన్‌ లాంటి శిలాజ ఇంధనాల వినియోగం తక్కువగా ఉండటం, పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ఎక్కువగా వినియోగించడం ఈ అంశంలో ఎక్కువ మార్కులు తెచ్చే అంశాలుగా పరిగణిస్తారు. నగర పరిధిలో పచ్చదనం ఏ స్థాయిలో ఉంది? ఇందులో సహజ అడవుల విస్తీర్ణం ఎంత? నగర పాలక సంస్థ లేదా ప్రజల భాగస్వామ్యంతో పెరిగిన విస్తీర్ణం ఎంతో లెక్కించి మార్కులిస్తారు. అలాగే నీరు, వ్యర్థాల నిర్వహణ తదితర అన్ని అంశాలకూ ప్రత్యేకమైన లెక్కింపు పద్ధతులున్నాయి. 2019లో కేవలం నాలుగు నగరాలే నాలుగు నక్షత్రాల రేటింగ్‌ను సాధించాయి. 2020లో ఆ సంఖ్య తొమ్మిదికి పెరగడం శుభపరిణామమే. మూడు నక్షత్రాల రేటింగ్‌ నగరాల సంఖ్య నాలుగు నుంచి 22కు, రెండు నక్షత్రాల రేటింగ్‌ ఉన్నవాటి సంఖ్య 25 నుంచి 64కు పెరిగింది. అత్యంత నిరాశాజనకమైన పనితీరు కనబరిచిన నగరాలకిచ్చే ఒక నక్షత్రం రేటింగ్‌ను పొందిన వాటి సంఖ్య 2019లో 66 ఉండగా, ఏడాది తిరిగేసరికి సగానికి తగ్గడం విశేషం. నగరాలు పరస్పరం సహకరించుకోవడం, ఏదైనా అంశంపై ఓ నగరంలో విజయవంతమైన విధానాన్ని మరికొన్ని అందిపుచ్చుకోవడం, ఈ దిశగా వాటి పాలకవర్గాలు, అధికారులు ఇతర ప్రాంతాలకు వెళ్లి పరిశీలించి బాగున్నవి తమవద్దా అమలు చేయడం ఈ పురోగతికి కారణాలుగా నివేదిక పేర్కొంది. ఈ సమన్వయ సహకారాలు మున్ముందూ కొనసాగాల్సిన అవసరం ఉంది.

ప్రజాభాగస్వామ్యం కీలకం

పట్టణ ప్రణాళిక, పచ్చదనం, జీవవైవిధ్యం, వ్యర్థాల నిర్వహణ అంశాల్లో విశాఖ అయిదు నక్షత్రాల రేటింగ్‌ను సాధించింది. వ్యర్థాల నిర్వహణలో అయిదు నక్షత్రాలు అందుకున్న విజయవాడ నగరం నీటి నిర్వహణ, పట్టణ ప్రణాళిక, పచ్చదనం, జీవ వైవిధ్యంలో నాలుగు తారల రేటింగ్‌ తెచ్చుకుంది. అయితే ఇంధన వినియోగం, హరిత భవనాలు, రవాణా, గాలి నాణ్యతలో ఈ రెండు నగరాలకు మూడు నక్షత్రాలే దక్కాయి. ఆయా అంశాల్లో విజయవాడ, విశాఖ మెరుగుపడాల్సి ఉందని ఈ మార్కులే తేల్చిచెప్పాయి. వాతావరణ మార్పులపై నగరాల పోరాటానికి పాలకవర్గాలు, అధికారులు మాత్రమే పూనుకొంటే అయ్యే పని కాదని, ప్రజలూ భాగస్వామ్యం తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలు తవ్వుకుని వాననీటిని ఒడిసిపట్టాలని తెలుగు రాష్ట్రాల్లో ఎంతగా ప్రచారం చేసినా, హైదరాబాద్‌, విశాఖ వంటి పెద్ద నగరాల్లో సైతం అనుసరించేవారు అంతంతమాత్రమే. ఇంకుడు గుంతలతో భూగర్భజల మట్టం మెరుగుపడుతుందన్న స్పృహ ప్రజల్లో పెరగడం లేదు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం, పచ్చదనం కోసం చెట్లను పెంచడం వంటి కార్యక్రమాలన్నింటికీ ప్రజాభాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే వాతావరణ మార్పులతో సంభవించే దుష్ప్రభావాలను అరికట్టే దిశగా బలమైన అడుగులు పడతాయి.

- శిశిర

ఇదీ చదవండి:కర్ణాటకలో జల విలయం- వరద గుప్పిట్లో ప్రజలు

ABOUT THE AUTHOR

...view details