హిందూ మహాసముద్రంలోని మాల్దీవుల్లోని అతివాదులు ఈమధ్య ఇండియా పట్ల పూర్తి వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారు. భారత ప్రాదేశిక జలాలకు అత్యంత సమీపంగా ఉన్న ఆ ద్వీపదేశంలో ఇటువంటి అలజడి రేగడం ఆందోళన కలిగిస్తోంది. 1988లో కొందరు వ్యాపారవేత్తలు శ్రీలంక తీవ్రవాదుల సాయంతో అప్పటి మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్ గయూమ్‌ను గద్దె దించేందుకు యత్నించారు. భారత్ దళాలు 'ఆపరేషన్ కాక్టస్' పేరుతో ఆ కుట్రను భగ్నం చేశాయి. అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాయి. ఈ ఏడాది ఐరాస సర్వసభ్య సమావేశాలకు అధ్యక్షుడిగా మాల్దీవుల విదేశాంగమంత్రి అబ్దుల్లా షహీద్ ఎన్నికయ్యారు. ఆయన గెలుపు వెనక ఇండియా కృషి ఎంతో ఉంది. మరో మిత్రదేశమైన అఫ్గాన్ విదేశాంగమంత్రి జైమై రసూల్ బరిలో ఉన్నా, షహీద్‌కే భారత్ మద్దతు ప్రకటించింది. మాల్దీవులకు లక్షకుపైగా కొవిడ్ టీకాలనూ అందించింది. ఇలా అన్నివేళలా అండగా ఉంటున్న ఇండియాపై మాల్దీవుల్లో వ్యతిరేక ప్రచారం ఉద్ధృతమవుతుండటం బాధాకరం!
విద్వేష ప్రచారంతో..
మాల్దీవుల్లోని ఒక ప్రచురణ సంస్థ కొన్నాళ్లుగా ఇండియాపై విషంకక్కుతోంది. భారత వ్యతిరేక శక్తులు కొన్ని ఈ సంస్థకు భారీగా నిధులు సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు మాజీ అధ్యక్షుడు యామీన్ గయూమ్ చైనాకు అనుకూలంగా వ్యవహరించారు. 2018 ఎన్నికల్లో ఇబ్రహీం సోలిహ్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈయన హయాములో భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలు గాడిన పడతాయని ఆశించారు. అతివాదుల ప్రభావంతో అది సాధ్యంకావడం లేదు. మాల్దీవులకు గతంలో ఇండియా రెండు ధ్రువ్ హెలికాప్టర్లను అందించింది. సముద్ర అన్వేషణ, సహాయ కార్యక్రమాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో రోగులను సత్వరం తరలించేందుకు వీటిని ఉదారంగా సమకూర్చింది. ఈ హెలికాప్టర్ల ద్వారా భారత్ తమ దేశంలో నిఘాపెడుతోందన్న విద్వేష ప్రచారాన్ని కొందరు ప్రారంభించారు. యామీన్ గయూమ్ ప్రభుత్వం సైతం ఆ హెలికాప్టర్లను భారత్ వెనక్కు తీసుకోవాలని కోరింది. యామీన్ పార్టీ పరాజయం పాలయ్యాక పగ్గాలు చేపట్టిన ఇబ్రహీం సర్కారు హెలికాప్టర్లను మరికొంతకాలం వినియోగించాలని నిర్ణయం తీసుకుంది. మరోవైపు, అక్కడి 'అడ్డు' నగరంలో మరో కాన్సులేట్ కార్యాలయాన్ని ప్రారంభించబోతున్నట్లు భారత్ ప్రకటించింది. దీనిపై ఆందోళనలు తలెత్తాయి. ఆ కార్యాలయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇబ్రహీం ప్రభుత్వం ప్రకటించాకే అవి తగ్గుముఖం పట్టాయి.
అతివాదుల ఆగడాలు