సమ్మిళిత అభివృద్ధి, సుపరిపాలన, సామాన్య పౌరులకు సాధికారత సాధనకు డిజిటల్ సాంకేతికతలు చక్కగా ఉపకరిస్తాయని డిజిటల్ ఇండియా పథకం ప్రపంచానికి చాటిచెప్పింది. కొన్నేళ్ల క్రితం వరకు సంపన్న వర్గాలకు మాత్రమే అందుబాటులో ఉన్న డిజిటల్ సాంకేతికతలు నేడు సామాన్యులకూ చేరువయ్యాయి. ఈ మధ్య విరివిగా వినియోగంలోకి వస్తున్న కృత్రిమ మేధ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. మానవాళి ప్రగతికి అమోఘ సాధనం కానుంది. కృత్రిమ మేధకు డేటా (సమాచార శకలాలు) ప్రధాన ముడి సరకు. 70 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు, 121 కోట్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు, 126 కోట్ల ఆధార్ కార్డుదారులతో భారతదేశం ప్రతి రోజూ అపార సమాచార రాశిని ఉత్పన్నం చేస్తోంది. ప్రపంచంలో అతిపెద్ద అంతర్జాల సంస్థలు కొన్నింటికి భారత్‌లో విస్తృతంగా వినియోగదారులు ఉన్నారు. మన దేశంలో ఇంటర్నెట్ సేవలు తక్కువ రుసుములకు లభిస్తున్నాయి. ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన భారతీయ ఐటీ కంపెనీలు భారీయెత్తున నిపుణ సిబ్బందిని అందిస్తున్నాయి. ఇన్ని అనుకూలతలు ఉన్నాయి కాబట్టే- ప్రధాని మోదీ నాయకత్వంలో కృత్రిమ మేధ విప్లవంలో దూసుకుపోవడానికి భారత్ సమాయత్తమవుతోంది. దీనికి కొన్నేళ్ల క్రితమే సన్నాహాలు ప్రారంభమయ్యాయి. 2018లో భారత ప్రభుత్వం జాతీయ కృత్రిమ మేధ వ్యూహాన్ని ప్రకటించినప్పటి నుంచి కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ దేశంలో అందుకు తగు ప్రాతిపదికను ఏర్పాటు చేయసాగింది. ప్రభుత్వానికి డేటా సేవలు అందించడానికి సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ డేటా ఎనలిటిక్స్ (సెడా)ను నెలకొల్పింది. ఐటీ పరిశ్రమ సహకారంతో బెంగళూరు, గాంధీనగర్, గురుగ్రామ్, విశాఖపట్నాల్లో ఇలాంటి ఉత్కృష్ట కేంద్రాలను స్థాపించారు. ఈ నగరాల్లో 113 అంకుర సంస్థలకు ప్రాణప్రతిష్ఠ చేశారు. 56 రంగాలకు ‘సొల్యూషన్స్’, 29 మేధా హక్కులను రూపొందించారు.
నైపుణ్యాలతో భవితకు పునాది
నాలుగు లక్షలమందికి కొత్త టెక్నాలజీలలో, కొత్త ఉద్యోగాలలో ఆన్‌లైన్ శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం జాతీయ కృత్రిమ మేధ (ఏఐ) పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఏఐ సంబంధ విజ్ఞానాన్ని పంచుకోవడానికి, సహకరించుకోవడానికి ఈ పోర్టల్ ఉపకరిస్తుంది. త్వరలో కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందగానే కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ జాతీయ ఏఐ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. ఆధార్, యుపీఐ, జీఎస్టీ నెట్‌వర్క్, ప్రభుత్వ ఇ-మార్కెట్ (జీఈఎం)ల నుంచి గడించిన అనుభవంతో ఇకపై విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, బట్వాడా, భాషానువాద రంగాల్లోనూ పబ్లిక్ డిజిటల్ వేదికలను నెలకొల్పనున్నారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ డిజిటల్ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఇందుకు నాంది పలికారు. కృత్రిమ మేధ ఆధారిత భాషానువాదానికి జాతీయ పథకాన్ని ప్రారంభించడానికి ప్రముఖ విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలు, అంకురాలు, పరిశ్రమలతో కలిసి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ పనిచేస్తోంది. అన్ని భారతీయ భాషల్లో స్వర ఆధారిత ఇంటర్నెట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని లక్షిస్తోంది. ఇతర మంత్రిత్వ శాఖలు సైతం తమతమ పరిధిలో ఇటువంటి సహకార ప్రాజెక్టులు చేపడుతున్నాయి. ఈ పబ్లిక్ డిజిటల్ వేదికలు వివిధ రంగాల్లో డేటా భద్రత, వినియోగదారుల గోప్యతకు ఏఐ సేవలు అందిస్తాయి. ఈ క్రమంలో విరివిగా అంకుర సంస్థల ఆవిర్భావానికి తోడ్పడతాయి.
ప్రభుత్వం ఐటీ రంగ సిబ్బందిని కొత్త సాంకేతికతలకు, కొత్త ఉద్యోగాలకు సిద్ధం చేయడానికి ‘ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్’ కార్యక్రమం కింద నడుంకట్టింది. సమ్మిళిత అభివృద్ధి, సామాన్య పౌరుల సాధికారతలకు ఏఐని ఉపయోగించనుంది. ఏఐ వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడిపోకుండా సిబ్బందికి అధునాతన శిక్షణ ఇవ్వబోతోంది. పేద, మధ్యతరగతివారి సమస్యల పరిష్కారానికి ఏఐని ఉపయోగించాలి. తద్వారా సామాజిక సాధికారత సిద్ధిస్తుంది. ఈ లక్ష్యంతోనే విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, బట్వాడా, భాషానువాద రంగాల్లో ఏఐ సాంకేతికతల వినియోగాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిశ్చయించింది. ఏఐ అభివృద్ధికి డేటా వనరులే పునాది. కానీ, వ్యక్తిగత సమాచారం లేదా డేటాను వ్యాపార ప్రయోజనాలకు దుర్వినియోగం చేసే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. జాతీయ భద్రతకు భంగకరంగా మన డేటాను ఇతర దేశాలు ఉపయోగించవచ్చు. దీన్ని నివారించడానికి ప్రభుత్వం పార్లమెంటులో వ్యక్తిగత డేటా సంరక్షణ బిల్లును ప్రవేశపెట్టింది. ఈ డిజిటల్ యుగంలో వినియోగదారుల డేటాను సంరక్షిస్తూనే, పటిష్ఠమైన డేటా ఆధారిత ఆర్థిక వ్యవస్థ సృష్టికి ఈ బిల్లును ఉద్దేశించారు. భారత పౌరుల వ్యక్తిగత సమాచారంతో డిజిటల్ సీమలో గుత్తస్వామ్యాలను సాధించాలనే ప్రయత్నాలను భారత ప్రభుత్వం అడ్డుకొంటుంది. ఇటీవల కొన్ని మొబైల్ యాప్‌లను నిషేధించడాన్ని ఈ కోణం నుంచే చూడాలి.