తెలంగాణ

telangana

ETV Bharat / opinion

Rajasthan Elections Key Points : మోదీ Vs గహ్లోత్​?.. ఈ 5 అంశాలు ఎవరికి కలిసొస్తే వారిదే పీఠం! - రాజస్థాన్​ ఎన్నికల కోసం బీజేపీ వ్యూహాలు

Rajasthan Elections Key Points : రాజస్థాన్‌లో అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌.. ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో మెజార్టీ సాధించాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతున్నాయి. అయితే ఈసారి ఎన్నికల ఫలితాలను.. ఐదు అంశాలు శాసించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించేందుకు హస్తం పార్టీ రెట్టింపు సంఖ్యలో ఉచితాలు ప్రకటించగా.. గత ఎన్నికల్లో కోల్పోయిన ఓటుబ్యాంకును పూడ్చుకునేందుకు కమలం పార్టీ వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తోంది.

Rajasthan Elections 2023 Key Points
Rajasthan Elections 2023 Key Points

By ETV Bharat Telugu Team

Published : Nov 1, 2023, 8:40 AM IST

Rajasthan Elections Key Points :రాజస్థాన్‌ ఎన్నికల రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నేతలు గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్‌లో ఈసారి 5 అంశాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. పేపర్‌ లీక్‌, ఉచితాలు, ప్రధాని మోదీ ఫ్యాక్టర్‌ వర్సెస్‌ సీఎం ఫేస్‌, రాజ్‌పుత్‌-గుజ్జర్ల ఓట్లు, హిందుత్వం.. ఈ ఐదు అంశాలు ప్రధాన పార్టీల విజయంలో కీలకపాత్ర పోషించనున్నాయి. రాజస్థాన్‌లో అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికల తర్వాత ఓటమి పాలు కావటం.. మూడు దశాబ్దాల నుంచి సంప్రదాయంగా కొనసాగుతోంది. ఇతర అంశాల తోపాటు సానుకూలాంశాల్లో అది కూడా ఒకటని కమలనాథులు అంటుండగా.. ఉచిత హామీలతో ఆ సంప్రదాయాన్ని ఈసారి తిరగరాస్తామని హస్తం నేతలు ఢంకా బజాయించి చెబుతున్నారు. కాంగ్రెస్‌ ఈసారి ఉచితాల సంఖ్యను రెట్టింపు చేసింది.

పేపర్ లీక్స్​ ప్రభావం గట్టిదే..
పరీక్ష పేపర్‌ లీక్‌ వ్యవహారం.. రాజస్థాన్‌ శాసనసభ ఎన్నికల్లో గట్టిగా ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న జోధ్‌పుర్ జిల్లాలోనూ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నాలుగేళ్లలో 18సార్లు పేపర్లు లీకయ్యాయి. అవి తమ కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీశాయనే భావన యువతలో కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్ నినాసాలు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేసింది. ఆ తర్వాత నుంచి కమలనాథుల్లో జోరు పెరిగింది. ఈ వ్యవహారంలో బడాబాబుల హస్తం ఉందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.

పైలట్​ దీక్ష.. కొత్త చట్టం!
కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సచిన్‌ పైలెట్‌.. అవినీతి అంశంపై గహ్లోత్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆమరణదీక్ష చేయటం వల్ల కొత్త చట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే హస్తం నేతలు పైలెట్‌ దీక్షను సమర్థించుకుంటున్నారు. అవినీతిపై దర్యాప్తు జరగాలని డిమాండ్‌ చేశారు తప్ప.. గహ్లోత్‌కు వ్యతిరేకం కాదన్నారు. రాజస్థాన్‌ పోలీసుల విచారణలో సీఎంకు ఎలాంటి సంబంధం లేదని తేలిందని గుర్తు చేస్తున్నారు. అయితే బీజేపీ నేతలు ఈ వాదనను తిప్పికొడుతున్నారు. ఏ తప్పు చేయకుంటే ఈడీ దాడులకు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

ఉచితాల వర్షం!
ఈ ఎన్నికల్లో ఉచితాలు కూడా గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల కుటుంబ బీమా హామీకి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉచిత వైద్యం, మందులు ఇవ్వటంపై గహ్లోత్‌ సర్కార్‌కు ప్రజల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. బీజేపీ గెలిస్తే.. ఈ పథకాలను ఆపేస్తుందని హస్తం నేతలు ప్రచారం చేస్తున్నారు. వంద యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 5వందల రూపాయలకే సిలిండర్‌ హామీలపై గ్రామీణ ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్​ హామీలకు బీజేపీ ఎద్దేవా..
ఇవే కాకుండా సీఎం గహ్లోత్‌ ఈసారి మరో ఏడు ఉచితాలను కొత్తగా ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏడాదికి 10వేలు, ప్రభుత్వ కళాశాల్లో చదివే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ లేదా ట్యాబ్‌, ఉద్యోగులకు పాత పింఛన్‌, పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం వంటి హామీలను కాంగ్రెస్‌ ఇచ్చింది. ఈ హామీలపై స్పందించేందుకు పెద్దగా ఆసక్తి చూపని బీజేపీ నేతలు.. గహ్లోత్‌కే గ్యారంటీ లేనప్పుడు.. ఆయన హామీలకు గ్యారంటీ ఎక్కడుంటుందని ఎద్దేవా చేస్తున్నారు.

బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో?
రాజస్థాన్‌లో సీఎం అభ్యర్థి ఎవరన్నది కాంగ్రెస్‌ లేదా బీజేపీలో స్పష్టత లేదు. ప్రధాని మోదీ పేరుతోనే కమలనాథులు ప్రచారం చేస్తుండగా సీఎం అశోక్‌ గహ్లోత్‌ అన్నీ తానై ప్రచారంలో దూసుకుపోతున్నారు. 2018 ఎన్నికల వరకు వసుంధరరాజె బీజేపీకు పెద్ద తలకాయగా ఉన్నారు. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యే టికెట్‌ కోసమే ఆమె రెండోజాబితా వరకు ఆగాల్సి వచ్చింది. ఈసారి బీజేపీ ప్రచారంలో రాజె పెద్దగా కనిపించలేదు.

మోదీ వర్సెస్‌ గహ్లోత్‌!
కాంగ్రెస్‌ పార్టీ సీఎం గహ్లోత్‌ సారథ్యంలో ప్రచారం చేస్తుండగా త్వరలోనే సచిన్‌ పైలట్‌ కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తారని హస్తం నేతలు చెబుతున్నారు. రాజస్థాన్‌లో ఈసారి.. మోదీ వర్సెస్‌ గహ్లోత్‌ అన్నట్లు ప్రచారం సాగుతోందని అభిప్రాయం ప్రజల్లో వినిపిస్తోంది. సీఎం ఎవరైనా మోదీకే తమ ఓటు అని కొందరంటే రాజెను పక్కనపెట్టినందుకు బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే వాదన కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. గహ్లోత్‌-పైలట్‌ మధ్య ఐదేళ్లుగా కొనసాగిన రాజకీయ ఘర్షణపై ఆ పార్టీశ్రేణులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌లో ఐక్యతా రాగం వినిపిస్తుండగా పంజాబ్‌లో మాదిరిగా అంతర్గతపోరు ఆ పార్టీని ముంచుతుందని కమలనాథులు జోస్యం చెబుతున్నారు.

రాజ్​పుత్​లు, గుజ్జర్లు ఎటో?
2018 ఎన్నికల్లో రాజ్‌పుత్‌లు బీజేపీను దూరంపెట్టగా.. గుజ్జర్లు కాంగ్రెస్‌కు జైకొట్టారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్‌ అధికారం చేపట్టింది. 2018లో సీఎం వసుంధర రాజె పట్ల మేవార్‌కు చెందిన రాజ్‌పుత్‌లు అసంతృప్తితో ఉండగా.. సచిన్‌ పైలట్‌ సీఎం అవుతారని భావించి తూర్పు రాజస్థాన్‌లోని గుజ్జర్లు కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. తూర్పు రాజస్థాన్‌లో హస్తం హవా, మేవార్‌లో బీజేపీ బలం కొంత తగ్గటం.. కాంగ్రెస్‌కు మెజార్టీ తెచ్చిపెట్టాయి. కానీ ఈసారి ఆ రెండు అంశాల ప్రభావం పెద్దగా కనిపించటంలేదు. రాజ్‌పుత్‌ల మద్దతు సాధించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా.. పార్టీలో సచిన్‌ పైలెట్‌కు జరిగిన అవమానంపై గుజ్జర్లు ఆగ్రహంతో ఉన్నారు. జయపుర నుంచి పోటీ చేస్తున్న జయపుర రాజ కుటుంబానికి చెందిన ఎంపీ దియా కుమారి బీజేపీ నుంచి సీఎం రేసులో ఉన్నారు. మేవార్‌, మార్వార్‌కు చెందిన రాజ్‌పుత్‌ నేతలను పార్టీలో చేర్చుకోవటంలో ఆమె కీలకపాత్ర పోషించారు. వారి రాకతో 2018లో పార్టీకి జరిగిన నష్టం.. కొంతమేర తగ్గుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.

ఏ పార్టీకి బాగా కలిసి వస్తే వారిదే అధికారం!
హిందుత్వ అంశం.. రాజస్థాన్‌ వ్యాప్తంగా హిందూ ఓటర్లలో అండర్‌ కరెంట్‌గా కనిపిస్తోంది. గహ్లోత్‌ సర్కార్‌ ముస్లింలకు అనుకూలమనే వాదన మధ్య.. బీజేపీ అధికారం చేపట్టాలనే భావన హిందూ ఓటర్లలో కొంతవరకు కనిపిస్తోంది. ఉదయ్‌పుర్‌లో జరిగిన కన్హయ్యలాల్ హత్యను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. శాంతియుతంగా ఉండే రాజస్థాన్‌లో అలాంటి ఘటనలు జరగటానికి కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలే కారణమన్న అభిప్రాయం హిందూ ఓటర్లలో ఉంది. ఈ ఐదు అంశాలు ఏ పార్టీకి బాగా కలిసి వస్తే వారిదే అధికారమనే విశ్లేషణలు ఉన్నాయి.

BJP Tough Seats In Chhattisgarh : ఆ 9 స్థానాలే టార్గెట్​.. 23 ఏళ్లుగా గెలవని బీజేపీ.. ఈసారి పక్కా ప్లాన్​తో..

Madhya Pradesh Assembly Election 2023 : కమల్​నాథ్ కంచుకోటలో పాగాకు బీజేపీ ప్లాన్​.. దేవుని విగ్రహాల చుట్టూ రాజకీయం!

ABOUT THE AUTHOR

...view details