Rajasthan Congress Vs BJP :రాజస్థాన్‌లో శాసనసభ ఎన్నికల సమరం రసవత్తరంగా మారింది. మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్.. అశోక్ గహ్లోత్ సర్కార్ వైఫల్యాల ద్వారా పగ్గాలు చేపట్టాలని భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతున్నాయి. 2018 ఎన్నికల్లో ( Rajasthan Election 2023) 200 స్థానాల శాసనసభలో వంద సీట్లతో హస్తం పార్టీ అధికారం చేపట్టింది. వసుంధరరాజే సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఓటమిపాలైంది. అంతకుముందు 2013ఎన్నికల్లో కమలం పార్టీ 163స్థానాల్లో విజయం సాధించి భారీ మెజార్టీతో వసుంధరరాజె సారథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కీలకాంశాలు ఇవే...
ఈసారి రాజస్థాన్ ఎన్నికల్లో మహిళలపై నేరాలు, పరీక్ష పేపర్ల లీక్... కీలకాంశాలుగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలు, యువత కాంగ్రెస్ పాలనపై కొంత అసంతృప్తితో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ ప్రతికూల పరిస్థితులను ఏ మేరకు అధిగమిస్తుందనే అంశంపై హస్తం పార్టీ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ పరిస్థితులను కమలం పార్టీ ఎంతవరకు తమకు అనుకూలంగా మార్చుకుంటుందో చూడాలి.
గహ్లోత్, వసుంధర.. ఇద్దరికీ ఒకే సమస్య!
రాజస్థాన్‌లో బీజేపీ తరఫున బలమైన నాయకురాలిగా వసుంధర రాజె గుర్తింపుపొందారు. అయితే ఈసారి ఆమెను పక్కనపెట్టాలని కమలనాథులు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ అంశం కూడా ఆ పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే కాంగ్రెస్ తరఫున 72ఏళ్ల అశోక్ గహ్లోత్... రెండోసారి సీఎం పగ్గాలు చేపట్టేందుకు పోటీపడుతున్నారు. అయితే ఈ ఇరువురు నేతలు కూడా తమ తమ పార్టీల్లో ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 46ఏళ్ల సచిన్ పైలెట్... గహ్లోత్‌కు పక్కలో బళ్లెంలా మారారు. 18 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయటమే కాకుండా ఇటీవలే బీజేపీ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలని దీక్ష చేపట్టారు. అలాగే వసుంధర రాజెకు 52ఏళ్ల దియాకుమారి పోటీదారుగా కనిపిస్తున్నారు. రాజె స్థానాన్ని ఆమెతో భర్తీ చేయాలని బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పేపర్ లీక్ల సమస్య
రాజస్థాన్‌లో పరీక్షల పేపర్ల లీక్ సర్వసాధారణంగా మారిందనే ఆరోపణలు హస్తం పార్టీకి కొంత దెబ్బగా చెప్పాలి. గత ఐదేళ్ల కాలంలో 14 పేపర్ లీక్ ఘటనలు జరిగి... కోటి మందికిపైగా యువతపై ప్రభావం పడినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటు వేయనున్న 49 లక్షల మంది యువత... నిర్ణయాత్మకపాత్ర పోషించే అవకాశం ఉంది. ఇది కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు.