Rahul Gandhi On Caste Census : త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్త కులగణన డిమాండ్‌ను ప్రధాన అస్త్రంగా చేసుకుంది. అందుకు దిల్లీలో సోమవారం జరిగిన సీడబ్యూసీ సమావేశంలో బీజం పడింది. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. అందుకు ఆ పార్టీ అధిష్ఠానం కూడా ఆమోదం తెలిపింది. కేంద్రం కులగణన ఎందుకు చేయడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మరోసారి ఆయన మీడియా సమావేశంలో కూడా కులగణన గురించి మాట్లాడారు.
కేంద్రం కులగణన ఎందుకు చేయడం లేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కులగణన పేదలకు సంబంధించిన విషయమని.. దానితోనే అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన సాధ్యమని పేర్కొన్నారు. ఓబీసీలు 50 శాతం ఉన్నా పాలనలో భాగస్వామ్యం దక్కట్లేదని అన్నారు. ఎక్స్‌రే తీయకుండా.. రోగికి వైద్యం ఎలా చేస్తారని కేంద్రంపై రాహుల్ మరోసారి విమర్శలు గుప్పించారు.
వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక సమరానికి ముందు జరుగుతున్న శాససనభ ఎన్నికలు కావడం వల్ల ఐదు రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదు రాష్ట్రాల్లోనూ విజయం సాధించాలని చెమటోడ్చుతోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి 'ఇండియా' కూటమిలో మెజారిటీ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా తమ పార్టీ బలాన్ని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో చూపించాలని సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో పార్టీ ఇచ్చిన హామీలు, కులగణననే ప్రధాన అస్త్రంగా మలుచుకుని శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది. అలాగే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని.. మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. ఎందుకంటే.. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాలు మొత్తం 83 లోక్‌సభ స్థానాలను కలిగి ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, కాంగ్రెస్ అధికారం దక్కించుకోగా.. లోక్‌సభ ఎన్నికల్లో బోల్తా కొట్టింది. ఈసారి అటువంటి పరిస్థితి ఎదురుకాకుండా జాగ్రత్త పడుతోంది. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు దేశవ్యాప్త కులగణన డిమాండ్‌ను ముందుకు తెచ్చి.. ఓబీసీలను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.