2013 సెప్టెంబర్ 27.. దిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతల ప్రెస్ మీట్.. ఒక్కసారిగా యువనేత రాహుల్ గాంధీ ఎంట్రీ.. ఎందుకొచ్చారా అని సహచర నేతలు చూస్తుండగానే షాకింగ్ పరిణామం.. చేతిలో ఉన్న పేపర్‌ను కసి తీరా చింపేశారు రాహుల్ గాంధీ.
"మా పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతోందో నేను ఇప్పుడు మీకు చెబుతున్నా. కొన్ని రాజకీయ కారణాలతోనే మేము (యూపీఏ ప్రభుత్వం) ఈ ఆర్డినెన్స్ తీసుకురావాల్సి వచ్చింది. ఆ విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్, బీజేపీ, జనతా దళ్, సమాజ్‌వాదీ పార్టీ.. అందరూ ఇలానే చేస్తారు. ఈ నాన్సెన్స్‌కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది" అంటూ సీరియస్ కామెంట్స్ చేసి.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయారు రాహుల్.
సీన్ కట్ చేస్తే..
2023 మార్చి 24.. 'కేరళలోని వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు' అంటూ లోక్‌సభ సచివాలయం నుంచి ప్రకటన వెలువడింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సంబంధిత నిబంధనలు సహా 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అయితే.. ఇదంతా కక్షపూరితం అంటూ కాంగ్రెస్ నేతాగణం బీజేపీ సర్కార్‌పై విమర్శల దాడికి దిగింది. సూరత్ కోర్టు తీర్పుపై అపీలుకు వెళ్లే సమయమైనా ఇవ్వకుండా మరుసటి రోజే అనర్హత వేటుపై ప్రకటన జారీ చేయడం దురుద్దేశపూర్వకమేనని మండిపడింది. అయితే.. అంతా చట్ట ప్రకారమే జరిగిందనేది బీజేపీ మాట. రెండు ప్రధాన పార్టీల మాటల యుద్ధం నడుమ.. మరో చర్చ సాగుతోంది. 2013లో రాహుల్ గాంధీ ఆ ఆర్డినెన్స్ విషయంలో అలా చేయకుండా ఉండుంటే.. ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదన్నది విశ్లేషకుల మాట.
2013 ఆర్డినెన్స్‌లో ఏముంది?
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని కొన్ని నిబంధనలు సవరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తిరగరాసేలా 2013లో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్ తెచ్చింది. సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఎవరైనా దోషిగా తేలితే.. వారిపై 3 నెలల వరకు అనర్హత వేటు వేయరాదన్నది ఆ ఆర్డినెన్స్ సారాంశం. ఈ అత్యవసర ఆదేశం ప్రతులనే దిల్లీలో ప్రెస్మీట్లో అందరి ముందు చింపేశారు రాహుల్ గాంధీ. ఫలితంగా కొన్నిరోజులకు ఆ ఆర్డినెన్స్‌ను యూపీఏ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హుల్ని చేసే నిబంధన అమలైంది. ఆ నిబంధన కారణంగానే ఇప్పుడు రాహుల్ గాంధీపై వేటు పడింది.
ఆ ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చారు?
చట్టసభలు, ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరుకు సంబంధించి.. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లో అమల్లోకి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు శిక్ష పడితే ఏం చేయాలన్నదానిపై ఆ చట్టంలో స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. రెండేళ్లు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడే కేసుల్లో దోషిగా తేలితే.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం పదవికి అనర్హులవుతారు. శిక్షా కాలం పూర్తయ్యాక మరో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయరాదు. అయితే.. ఒకప్పుడు ఈ చట్టంలోని నిబంధనలు మాజీ ప్రజాప్రతినిధులకు, సిట్టింగ్ సభ్యులకు వేర్వేరుగా ఉండేవి. మాజీ ప్రజాప్రతినిధులు దోషిగా తేలిన వెంటనే అనర్హులవుతారు. కానీ.. సిట్టింగ్ సభ్యులకు మాత్రం దోషిగా తేలిన తర్వాత 3 నెలల పాటు సమయం ఉంటుంది. ఈలోగా పైకోర్టుకు అపీలుకు వెళ్లి, తీర్పు మారేలా చేసుకుంటే.. అనర్హత వేటు తప్పుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ లిలీ థామస్ అనే మహిళ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేశారు. 3 నెలలు ఆగాల్సిన పని లేకుండా.. వెంటనే అనర్హత వేటు పడాల్సిందేనని సుప్రీంకోర్టుతోనే చెప్పించారు.